
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో లాభాలను ఆర్జిస్తామని బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తెలిపింది. జూన్ త్రైమాసికంలో బ్యాంకు రూ.4,876 కోట్ల నికర నష్టాలను మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో రూ.2,006 కోట్ల లాభాలను ఆర్జించింది. 2018–19 సెప్టెంబరు త్రైమాసికం అనంతరం నుంచి లాభాలను చూస్తామని ఎస్‌బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ శుక్రవారం వెల్లడించారు.
హైదరాబాద్‌లో బ్యాంకు నిర్వహించిన సీఎస్‌ఆర్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. ‘రానిబాకీల కోసం చేసిన కేటాయింపుల వల్లే లాభాలపై ప్రభావం చూపింది. 2017–18లో ఈ కేటాయింపులు రూ.70,000 కోట్లు. అంత క్రితం ఏడాది ఇవి రూ.55,000 కోట్లు. ఈ ప్రొవిజన్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తగ్గుముఖం పట్టనున్నాయి. ఇచ్చిన రుణాలు బ్యాడ్ లోన్స్ కాకుండా గట్టి చర్యలు చేపడుతున్నాం. ఎన్‌సీఎల్‌టీ వద్ద ఉన్న మొండి బకాయిల కేసులు కొన్ని పరిష్కారం అవుతాయి. మొత్తంగా ఈ ఏడాది బ్యాంకు లాభాల్లోకి వస్తుంది’ అని ధీమా వ్యక్తం చేశారు.
రుణాల్లో 10 శాతం వృద్ధి..
ఈ ఏడాది రుణాల్లో 10 శాతం వృద్ధి ఉండొచ్చని రజనీశ్ కుమార్ వెల్లడించారు. కంజ్యూమర్ లోన్స్ అయిన కార్ లోన్స్, హోమ్, పర్సనల్ లోన్స్ ఎక్కువగా ఉండనున్నాయి. ఎస్‌ఎంఈ విభాగంలో కూడా మంచి వృద్ధి ఉంటుంది. ఈ ఏడాది కార్పొరేట్ రుణాలు పుంజుకుంటాయి. ఈ విభాగంలో మంచి అవకాశాలు ఉన్నాయి. సిమెంట్, రోడ్స్, ఆటో, ఆటో కాంపోనెంట్, రెనివేబుల్ ఎనర్జీ, ఆయిల్ తదితర రంగాలు మంచి పనితీరు కనబరుస్తున్నాయి’ అని తెలిపారు. వడ్డీ రేట్లు స్థిరపడుతున్నాయని, రానున్న రోజుల్లో పెద్దగా మార్పు ఉండకపోవచ్చని అన్నారు. కొత్తగా 8,000 మందిని నియమిస్తున్నట్టు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment