
ఫలితాల ఆధారంగా ట్రెండ్
ఎస్‌బీఐ, హిందుస్తాన్ యూనీలివర్ వంటి దిగ్గజ కంపెనీలు ఈ వారం తమ ఆర్థిక ఫలితాలను వెల్లడిస్తుండటంతో షేర్ల వారీ కదలికలే ప్రాధాన్యం సంతరించుకుంటాయని నిపుణులంటున్నారు.
ఎస్‌బీఐ, హిందుస్తాన్ యూనీలివర్ వంటి దిగ్గజ కంపెనీలు ఈ వారం తమ ఆర్థిక ఫలితాలను వెల్లడిస్తుండటంతో షేర్ల వారీ కదలికలే ప్రాధాన్యం సంతరించుకుంటాయని నిపుణులంటున్నారు. గత శుక్రవారం మార్కెట్ ముగిసిన తర్వాత వెల్లడైన పారిశ్రామికోత్పత్తి, ద్రవ్యోల్బణ గణాంకాల ప్రభావం కూడా స్టాక్ మార్కెట్‌పై ఉంటుందని వారంటున్నారు. ఇప్పటికే మార్కెట్ గరిష్ట స్థాయిలో ఉందని, కంపెనీల ఆర్థిక ఫలితాలు బాగా ఉంటే మరింత ముందుకు దూసుకుపోతుందని అమ్రపాలి ఆధ్య ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ డైరెక్టర్ అభ్నిశ్ కుమార్ సుధాంశు చెప్పారు.
అంతర్జాతీయంగా ప్రధాన సంఘటనలేవీ లేనందున షేర్ల వారీ కదలికలే కీలకమని పేర్కొన్నారు. ప్రస్తుతం మార్కెట్లో లాభాల స్వీకరణ, మందగమనం చోటు చేసుకున్నాయని, అయితే పెద్దగా క్షీణత ఉండబోదని ట్రేడ్ స్మార్ట్ ఆన్‌లైన్ డైరెక్టర్ విజయ్ సింఘానియా చెప్పారు. ఆర్థిక ఫలితాలు నిరాశకు గురిచేస్తే లాభాల స్వీకరణ కొనసాగుతుందని కోటక్ సెక్యూరిటీస్‌కు చెందిన ఎనలిస్ట్ టీనా వీర్మాణి అంచనా వేస్తున్నారు.
కీలక కంపెనీల క్యూ4 ఫలితాలు..: ఈ వారంలో పలు ప్రధాన కంపెనీలు తమ తమ గత ఆర్థిక సంవత్సరం క్యూ4 ఫలితాలను వెల్లడించనున్నాయి. నేడు వేదాంత, మంగళవారం(ఈ నెల 16న) పంజాబ్ నేషనల్ బ్యాంక్, టాటా స్టీల్, బుధవారం(ఈ నెల 17న) హిందుస్తాన్ యూనీలివర్, బజాజ్ ఫైనాన్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, గురువారం(ఈ నెల18న) బజాజ్ ఆటో, బ్యాంక్ ఆఫ్ బరోడా, యునైటెడ్ బ్యాంక్, శుక్రవారం(ఈ నెల19న) ఎస్‌బీఐ, టాటా పవర్ కంపెనీలు ఆర్థిక ఫలితాలను వెల్లడిస్తాయి. ఏప్రిల్ నెల వాణిజ్య గణాంకాలను కేంద్రం నేడు(సోమవారం) వెల్లడించనున్నది.