సాక్షి, న్యూఢిల్లీ : డెబిట్ కార్డు కస్టమర్లకు ఎస్‌బీఐ తీపికబురు అందించింది. డెబిట్ కార్డుపైనా ఈఎంఐ సౌకర్యం అందుబాటులోకి తీసుకువస్తున్నట్టు ఎస్‌బీఐ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొంది. దేశవ్యాప్తంగా 40,000కుపైగా వాణిజ్య సముదాయాలు, వ్యాపార సంస్ధల వద్ద ఏర్పాటు చేసిన పాయింట్ ఆఫ్ సేల్స్ (పీఓఎస్) వద్ద ఎస్‌బీఐ డెబిట్‌కార్డుదారులు వస్తువులను కొనుగోలు చేసి నెలసరి వాయిదాల రూపంలో (ఈఎంఐ)లో చెల్లింపులు చేపట్టే వెసులుబాటు కల్పిస్తున్నామని ఎస్‌బీఐ ఛైర్మన్ రజనీష్ కుమార్ వెల్లడించారు. వస్తువుల కొనుగోలుకు అయ్యే మొత్తం తక్షణమే ఒకేసారి చెల్లించకుండా డెబిట్ కార్డుల ద్వారా కస్టమర్లు ఈఎంఐపై వాటిని కొనుగోలు చేయవచ్చని ఆయన పేర్కొన్నారు.
కనిష్టంగా ఆరు నెలల నుంచి 18 నెలల వరకూ వినియోగదారులు ఈఎంఐ గడువును ఎంపిక చేసుకోవచ్చని ఎస్‌బీఐ ప్రకటన పేర్కొంది. దీనికోసం డెబిట్‌కార్డు కలిగిన వినియోగదారులు ఎలాంటి ప్రాసెసింగ్, డాక్యుమెంటేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపింది. సేవింగ్స్ ఖాతాలో అకౌంట్ బ్యాలెన్స్‌తో సంబంధం లేకుండా ఒక్క నిమిషంలోనే ఈ సదుపాయం పొందవచ్చని వెల్లడించింది. లావాదేవీ పూర్తయిన నెల తర్వాత ఈఎంఐలు మొదలవుతాయి. మెరుగైన క్రెడిట్ హిస్టరీ కలిగిన కస్టమర్లందరూ వినిమయ రుణాలను పొందవచ్చని ఆ ప్రకటన పేర్కొంది. కస్టమర్లు తమ అర్హతను చెక్ చేసుకునేందుకు డీసీఈఎంఐ అని టైప్ చేసి 567676 నెంబర్‌కు ఎస్‌ఎంఎస్ చేయాలని తెలిపింది. అయితే ఈ నెంబర్‌కు ఎస్‌ఎంఎస్ చేసిన పలువురికి ఫెయిల్డ్ అని రిప్లై వస్తుండటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment