ఇక ‘సేవింగ్స్’ వడ్డీకి ఎసరు!
⇔ ఎస్‌బీ ఖాతాలపై బ్యాంకులు వడ్డీరేటు తగ్గించే అవకాశం: జెఫ్రీస్
⇔ లోగడ ఎస్‌బీఐ చైర్‌పర్సన్ అరుంధతీ సైతం ఇదే సంకేతం
⇔ ఆర్‌బీఐ నియంత్రణ ఎత్తేసినా దక్కని ప్రయోజనం ∙రేటు పెంచాల్సి ఉందంటున్న నిపుణులు
ముంబై: ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్ల తగ్గుదలతో ఇప్పటికే అసంతృప్తితో ఉన్న బ్యాంకు ఖాతాదారులను మరింత నిరుత్సాహపరిచే నిర్ణయాన్ని బ్యాంకులు త్వరలో తీసుకోనున్నాయా...? దీనికి అవుననే సమాధానం వినిపిస్తోంది. రుణాల జారీ వృద్ధి మందగించడంతో బ్యాంకులు తమ నిర్వహణ లాభాలను పెంచుకునేందుకు సేవింగ్స్ ఖాతాల(ఎస్‌బీ) నిల్వలపై వడ్డీ రేట్లను తగ్గించొచ్చని ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ సంస్థ జెఫ్రీస్ తెలిపింది.
ఇన్వెస్టర్ల ఆందోళనలను తెలియజేస్తూ దేశీయ బ్యాంకింగ్ రంగంపై ఈ సంస్థ ఓ నివేదికను విడుదల చేసింది. ‘‘రుణాల్లో వృద్ధి తగ్గుదల నికర వడ్డీ మార్జిన్లకు సానుకూలం కాదు. డిపాజిట్ నిష్పత్తి, రుణాల్లో బలహీన వృద్ధి నేపథ్యంలో పొదుపు ఖాతాల్లోని నిల్వలపై వడ్డీ రేట్లను తగ్గించే అంశాన్ని బ్యాంకులు పరిశీలించే అవకాశం ఉంది. చాలా బ్యాంకులు ప్రస్తుతం పొదుపు ఖాతాల నిల్వలపై 4% వడ్డీని అందిస్తున్నాయి.
కొన్ని ప్రైవేటు బ్యాంకులు అయితే ఇంకా ఎక్కువ మొత్తమే ఆఫర్ చేస్తున్నాయి’’ అని జెఫ్రీస్ తన నివేదికలో పేర్కొంది. సేవింగ్స్ ఖాతాలపై వడ్డీ రేటులో అర శాతం కోత విధించినా ఈ రంగం నిర్వహణ లాభాల్లో మొత్తం మీద పెరుగుదల 8 శాతంగా ఉంటుందని తెలిపింది. యెస్ బ్యాంకు, కోటక్ బ్యాంకు, డీబీఎస్ బ్యాంకు తదితర బ్యాంకులు రూ.లక్షకు మించిన సేవింగ్స్ నిల్వలపై 6 శాతం పైనే వడ్డీ రేటును ఆఫర్ చేస్తున్నాయి.
పొదుపు ఖాతానే ఆధారం
దేశంలో సాధారణ బ్యాంకు ఖాతాదారుల్లో ఎక్కువ మందికి తెలిసింది బ్యాంకు పొదుపు ఖాతా గురించే. లక్షలాది మంది అందుబాటులో ఉన్న నిధులను నెలల తరబడి తమ పొదుపు ఖాతాల్లోనే ఉంచేస్తుంటారు. వారికి మెరుగైన రాబడులను ఇచ్చే స్వల్పకాలిక పెట్టుబడి సాధనాల గురించి తెలిసింది తక్కువే. అందుకే బ్యాంకు సేవింగ్స్ ఖాతాలో ఉంచి అవసరమైనప్పుడు వాడుకుంటుంటారు. ఈ విషయాలను గుర్తించే బ్యాంకు సేవింగ్స్ ఖాతాలపై సమంజసమైన వడ్డీ రేటు ఉండాలన్న ఆలోచనతో 2011 అక్టోబర్‌లో నాటి ఆర్‌బీఐ గవర్నర్ డి.సుబ్బారావు నియంత్రణ ఎత్తివేశారు.
దాంతో వడ్డీ రేట్లు పెరుగుతాయని ఖాతాదారులు ఆశించారు. కానీ చాలా వరకు బ్యాంకులు నామమాత్రపు పెంపుతో 4 శాతానికి వడ్డీ రేటును పరిమితం చేశాయి. కొన్ని ప్రైవేటు బ్యాంకులు మాత్రం 6 శాతానికి పైనే వడ్డీ రేటును ఆఫర్ చేస్తున్నప్పటికీ... అధిక నిల్వలు ఉంచే ఖాతాదారులకే ఈ ప్రయోజనాన్ని పరిమితం చేశాయి. దీంతో ఆర్‌బీఐ ఆశించించి జరగలేదు.
డీమోనిటైజేషన్ ఎఫెక్టా...?
ఇప్పుడు వడ్డీ రేటును పెంచకపోగా, తగ్గించే దిశగా బ్యాంకులు ఆలోచనలు చేస్తుండడం ఖాతాదారులకు రుచించనిదే. ఇటీవల కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేయడం వల్ల బ్యాంకుల్లోకి భారీగా నగదు నిల్వలు వచ్చి చేరిన విషయం తెలిసిందే. సుమారు రూ.12 లక్షల కోట్లకు పైనే పెద్ద నోట్ల రూపంలో బ్యాంకుల్లో జమ అయ్యాయి. వీటిలో 15 శాతం వరకు బ్యాంకుల్లోనే ఉండిపోవచ్చని ఎస్‌బీఐ చైర్మన్ అరుంధతీ భట్టాచార్య అప్పట్లోనే చెప్పారు. ఇతర బ్యాంకర్లు అయితే 30 శాతం వరకూ నిధులు బ్యాంకుల్లోనే నిలిచి ఉంటాయన్న అభిప్రాయంతో ఉన్నట్టు ఆమె తెలిపారు.
పెరిగిన డిపాజిట్లపై బ్యాంకులు ఖాతాదారులకు వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. అదే సమయంలో రుణాల్లో అనుకున్న మేర వృద్ధి లేకపోవడంతో బ్యాంకులు వడ్డీ భారాన్ని తగ్గించుకునేందుకు రేటు తగ్గింపును పరిశీలించొచ్చన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏంజెల్ బ్రోకింగ్ అనలిస్ట్ సిద్ధార్థ్ పురోహిత్ సైతం సేవింగ్స్ డిపాజిట్లపై వడ్డీ రేట్ల తగ్గింపును తోసిపుచ్చలేమని అభిప్రాయపడడం గమనార్హం. లిక్విడిటీ దృష్ట్యా బ్యాంకులు వడ్డీ రేట్ల కోతకు తగిన కారణం కూడా ఉందన్నారాయన.
రేటు పెంచాల్సిందే...
పొదుపు ఖాతాలో ఎప్పుడూ ఉంచాల్సిన కనీస నగదు నిల్వను బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్‌గా పరిగణిస్తాయి. వీటిపై వడ్డీ రేటు కనీసం సగటు ద్రవ్యోల్బణం రేటుకు తక్కువ కాకుండా ఉండాలి. లేదంటే అసలు క్యాపిటల్‌కే నష్టం వాటిల్లినట్టు. కానీ, బ్యాంకులు అందిస్తున్న 4% వడ్డీ రేటు ద్రవ్యోల్బణం రేటు కంటే తక్కువే. దీంతో కనీస నిల్వలపై ఖాతాదారులు ఆ మేర నష్టపోతున్నట్టే. ఈ నేపథ్యంలో ఎక్కువ వడ్డీ రేటును ఇవ్వొచ్చుగా అన్న ప్రశ్న ఎదురవుతోంది. మార్కెట్ ఆధారిత బెంచ్ మార్క్‌కు అనుగుణంగా వడ్డీ రేటు ఉండాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గత త్రైమాసిక కాలపు సగటు ద్రవ్యోల్బణ రేటు బెంచ్ మార్క్‌కు ప్రామాణికంగా ఉండాలని సూచిస్తున్నారు