75 లక్షల గృహ రుణంపై వడ్డీ తగ్గింపు
ఎస్‌బీఐ నిర్ణయం 15 నుంచీ అమలు
ముంబై: భారీ గృహ రుణాలపై వడ్డీరేటును బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) స్వల్పంగా 10 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) తగ్గించింది. దీనితో మహిళలకు సంబంధించి ఈ రుణ రేటు 8.55 శాతంగా ఉంటుంది. ఇతరులకు 8.60 శాతంగా అమలవుతుంది. బుధవారంనాడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాండెర్ట్ లిక్విడిటీ రేషియో (తమ డిపాజిట్లలో బ్యాంకులు ప్రభుత్వ బాండ్లలో ఉంచాల్సిన మొత్తం)ను అరశాతం తగ్గించింది. దీనితో ఈ రేటు 20 శాతానికి చేరింది.
ఇది బ్యాంకుల వద్ద మరిన్ని నిధులు సమకూరే అంశం కాగా, గృహ రుణాలపై ప్రొవిజినింగ్‌ను సైతం తగ్గించడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే ఎస్‌బీఐ శుక్రవారం తాజా నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయం జూన్ 15వ తేదీ నుంచీ అమల్లోకి వస్తుందని ఒక ప్రకటనలో ఎస్‌బీఐ తెలిపింది. రిస్క్ వెయిటేజ్‌ని ఆర్‌బీఐ తగ్గించడం తమ నిర్ణయానికి కారణమని ప్రకటనలో ఎండీ (నేషనల్ బ్యాంకింగ్) రజ్‌నీష్ కుమార్ తెలిపారు. రూ.75 లక్షల పైబడిన గృహ రుణంపై రిస్క్ వెయిటేజ్‌పై ఆర్‌బీఐ 75 శాతం నుంచి 50 శాతానికి తగ్గించింది.
ఇప్పటికి తాజా మూలధనం అక్కర్లేదు
♦ ఎస్‌బీఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య...
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రభుత్వం నుంచి తాను ఏమాత్రం తాజా మూలధనం కోరుకోవడం లేదని శుక్రవారం ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఎస్‌బీఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య తెలిపారు. క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్ మార్గంలో ఇటీవలే ఎస్‌బీఐ రూ. 15,000 కోట్లు సమీకరించింది. ‘‘మా ప్రణాళికల ప్రకారం ఈ ఏడాది ప్రభుత్వ నిధులు అక్కర్లేదు. అవసరమైతే వచ్చే ఏడాది ప్రభుత్వ నిధులను కోరతాం. బాసెల్ 3 (మూలధన అవసరాలకు సంబంధించి అంతర్జాతీయ నిబంధనలు) నిబంధనలకు అనుగుణంగా సైతం ప్రస్తు తం బ్యాంక్ మూలధనాన్ని కలిగిఉంది’’ అని ఆమె అన్నారు. లైఫ్ ఇన్సూరెన్స్ విభాగాన్ని లిస్టింగ్ చేసే అంశంపై ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దృష్టి పెడుతున్నామని తెలిపారు.
ఎంసీఎల్‌ఆర్ తగ్గించిన ఓబీసీ
20 బేసిస్ పాయింట్లు తగ్గింపు ∙12 వతేదీ నుంచీ అమలు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఓబీసీ) మార్జినల్ కాస్ట్ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్‌ఆర్)ను 0.20 శాతం తగ్గించింది. బ్యాంక్ విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం
♦ ఈ రేటు జూన్ 12వ తేదీ నుంచీ అమల్లోకి వస్తుంది.
♦ ఓవర్‌నైట్ రేటు 15 బేసిస్ పాయింట్లు తగ్గి 8.10%కి చేరింది.
♦ నెల రేటు 10 బేసిస్ పాయింట్లు తగ్గి 8.20 శాతానికి దిగింది.
♦ మూడు, ఆరు నెలల రేటు 20 బేసిస్ పాయింట్లు తగ్గి వరుసగా 8.25 శాతం, 8.35 శాతానికి దిగివచ్చింది.
♦ ఇక ఏడాది కాలానికి రేటు 10 బేసిస్ పాయింట్లు తగ్గి 8.50కి చేరింది.
♦ తనకు తాజాగా లభ్యమవుతున్న నిధుల వ్యయాల ప్రాతిపదికన, దాదాపు నెలకొకసారి ఎంసీఎల్‌ఆర్‌పై సమీక్ష ఉంటుంది. గత బేస్‌రేటు స్థానంలో ఈ కొత్త విధానం అమల్లోకి వచ్చింది. రెపో రేటు ప్రయోజనాన్ని తక్షణం కస్టమర్లకు అందించాలన్నది ఇక్కడ ప్రధాన లక్ష్యం.
ఐఓబీ కూడా...
మరో ప్రభుత్వ రంగ ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్ తన బేస్ రేటును ప్రస్తుత 9.50 శాతం నుంచి 9.45 శాతానికి తగ్గించింది. జూలై 1 నుంచీ తాజా రేటు అమలవుతుందని తెలిపింది.