ఎస్‌బీఐ రుణాలు భారం
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) రుణ ప్రాతిపదిక రేట్లను 20 బేసిస్ పాయింట్లు పెంచింది (100 బేసిస్ పాయింట్లు ఒక శాతానికి సమానం). దీనితో కనీస వడ్డీరేటు(బేస్) 10 శాతానికి చేరింది. ప్రామాణిక వడ్డీరేటు (బీపీఎల్‌ఆర్- బెంచ్‌మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటు) 14.75 శాతానికి ఎగసింది. గురువారం నుంచి రేట్లు అమల్లోకి వస్తాయని బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. దీనివల్ల ఈ రేట్లకు అనుసంధానమైన గృహ, వాహన, వాణిజ్య ఇతర వినియోగ వస్తువుల రుణాలకు సంబంధించి నెలవారీ వాయిదాలు (ఈఎంఐ) ప్రియం కానున్నాయి. పండుగల సీజన్‌ను పురస్కరించుకుని కొన్ని రుణాలపై ఎస్‌బీఐ 2014 జనవరి 31 వరకూ ప్రత్యేక రాయితీలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఈ గడువులోపుగా తాజా రుణాలు తీసుకునే వినియోగదారులకు ఈ రాయితీ రేట్లే అమలవుతాయని ఎస్‌బీఐ ప్రకటన తెలిపింది. ఎస్‌బీఐ నిర్ణయం నేపథ్యంలో- ఇతర బ్యాంకులు సైతం రుణ రేట్లను పెంచే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రైవేటు రంగంలో రెండవ అతిపెద్ద బ్యాంకింగ్ దిగ్గజం- హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కనీస రేటును ఇప్పటికే 20 బేసిస్ పాయింట్లు పెంచింది. దీనితో ఈ రేటు 10 శాతానికి చేరింది.
తప్పలేదు: అరుంధతీ భట్టాచార్య
తాజా రేట్ల పెంపుపై ఎస్‌బీఐ చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య మాట్లాడుతూ, నిధుల సమీకరణ భారం పెరిగిన నేపథ్యంలో బ్యాంక్ తాజా నిర్ణయం తీసుకుందన్నారు. గతసారి రుణ రేట్లను పెంచిన తరువాత ఇప్పటివరకూ రెపో రేటు అరశాతం పెరిగిందని చెప్పారు.
నేపథ్యం ఇదీ...
బ్యాంకులకు రెపో మార్గం ద్వారా తానిచ్చే స్వల్పకాలిక రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపోను రిజర్వ్ బ్యాంక్ అక్టోబర్ 29న పావు శాతం పెంచింది. దీనితో ఈ రెపో రేటు 7.75 శాతానికి ఎగసింది. ఈ రేటు భారం కావడం వల్ల సహజంగా ఈ భారాన్ని వినియోగదారుల మీదకు బ్యాంకులు మళ్లిస్తాయి. ఎస్‌బీఐ చేసింది ప్రస్తుతం ఇదే. ఇలాంటి పరిస్థితుల్లో రెపో భారం వల్ల ద్రవ్యలభ్యత (లిక్విడిటీ) అవసరాలు, సర్దుబాట్లలో భాగంగా బ్యాంకులు డిపాజిట్ రేట్లలో మార్పులు చేసే అవకాశాలు కూడా ఉంటాయి. ఎస్‌బీఐ, అలహాబాద్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్(ఓబీసీ)లు ఈ దిశలో ఇప్పటికే నిర్ణయాలు తీసుకున్నాయి.
యాక్సిస్ బ్యాంక్ డిపాజిట్ రేట్లలో మార్పు
కాగా ప్రైవేటు రంగంలోని యాక్సిస్ బ్యాంక్ కోటి రూపాయలకు లోబడి డిపాజిట్లపై వడ్డీరేట్లను మార్చింది. తాజా రేట్లు నవంబర్ 1 నుంచీ అమల్లోకి వచ్చినట్లు పేర్కొంది. 13-15 నెలల మధ్య డిపాజిట్లపై రేటు పావు శాతం పెరిగి 8.75 శాతానికి చేరింది. అదే సమయంలో 61 రోజుల నుంచి ఆరు నెలల శ్రేణిలో రేట్లు పావు శాతం తగ్గి 8.25 శాతానికి దిగాయి. 6-11 నెలల శ్రేణిలో డిపాజిట్ల రేట్లు పావు శాతం తగ్గి 8.5 శాతానికి చేరాయి. 46-60 రోజుల డిపాజిట్ రేటు విషయంలో 8.5% నుంచి అరశాతం తగ్గింది.
మా రుణ రేట్లలో మార్పు ఉండదు: బీఓఐ
కాగా తమ కనీస రుణ రేటులో మాత్రం మార్పు ఉండబోదని బుధవారం ప్రభుత్వ రంగంలో రెండవ అతిపెద్ద బ్యాంకింగ్ దిగ్గజం- బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీఓఐ) పేర్కొంది. చైర్‌పర్సన్ విజయలక్ష్మీ అయ్యర్ ఈ అంశంపై ముంబైలో బుధవారం విలేకరులతో మాట్లాడారు. తమ బ్యాంక్ ద్రవ్య లభ్యత పరిస్థితులు తగిన విధంగా ఉన్నాయని, ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో డిపాజిట్ల వృద్ధి కూడా బాగుందని ఆమె వెల్లడించారు. అయితే పరిస్థితులకు అనుగుణంగా రానున్న కాలంలో బేస్‌రేట్‌పై చర్చిస్తామని మాత్రం పేర్కొన్నారు.