బేస్ రేటు ఇక తగ్గించం...
► నిధుల సమీకరణ ఈసారి ఉండదు
► ఎస్‌బీఐ చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బేస్ రేటును మరింతగా తగ్గించే యోచనేదీ లేదని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య తెలిపారు. ఆర్థిక సంవత్సరం ముగిశాక దీనిపై దృష్టి పెట్టే అవకాశాలు ఉండొచ్చని దక్షిణ ముంబైలోని కొలాబాలో ఇన్‌టచ్ శాఖను ప్రారంభించిన సందర్భంగా ఆమె చెప్పారు. రిజర్వ్ బ్యాంక్ గతేడాది సెప్టెంబర్‌లో కీలక పాలసీ రేట్లను తగ్గించిన తర్వాత ఎస్‌బీఐ అక్టోబర్‌లో 40 బేసిస్ పాయింట్ల మేర బేస్ రేటును తగ్గించింది. దీంతో ఇది 9.70 శాతం నుంచి 9.30 శాతానికి దిగి వచ్చింది. ఇటీవలే ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ కూడా 0.05 శాతం మేర బేస్ రేటు తగ్గించి ఎస్‌బీఐ తరహాలోనే 9.30 శాతం స్థాయికి తీసుకొచ్చింది.
ఈ నేపథ్యంలోనే బేస్ రేటు అంశంపై భట్టాచార్య వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇక బేస్ రేటు లెక్కింపునకు కొత్తగా మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ (ఎంసీఎఫ్) ఫార్ములాను అమల్లోకి తెచ్చినా పెద్దగా తేడా ఉండబోదని, అయితే వడ్డీ రేట్ల తగ్గింపు ప్రయోజనాలను మరింత వేగంగా ఖాతాదారులకు బదలాయించేందుకు మాత్రం వెసులుబాటు లభించగలదని భట్టాచార్య వివరించారు. ఏప్రిల్ నుంచి కొత్త విధానం అమల్లోకి వస్తే బేస్ రేటును బ్యాంకులు కనీసం 80-160 బేసిస్ పాయింట్ల మేర తగ్గించాల్సి రావొచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. మరోవైపు, మార్చి నాటికి ఎస్‌బీఐ కొత్తగా మరో 500 శాఖలను ప్రారంభించనుందని, వీటిలో 100 హై టెక్ శాఖలు ఉంటాయని భట్టాచార్య చెప్పారు.
ఇప్పట్లో నిధుల సమీకరణ ఉండకపోవచ్చు..
దాదాపు రూ. 12,000 కోట్ల ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్‌పీవో) ప్రతిపాదనపై స్పందిస్తూ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎస్‌బీఐ నిధులను సమీకరించే అవకాశాలు లేవని భట్టాచార్య తెలిపారు. ప్రస్తుతానికైతే దీనికి సంబంధించి స్పష్టమైన ప్రణాళికలేమీ లేవని వివరించారు. బాసెల్ త్రీ ప్రమాణాలకు అనుగుణంగా ఉండే టియర్-టూ బాండ్లను ప్రైవేట్ ప్లేస్‌మెంట్ ప్రాతిపదికన విక్రయించడం ద్వారా రూ. 12,000 కోట్లను సమీకరించేందుకు అనుమతులు లభించినట్లు గతేడాది డిసెంబర్ 21న స్టాక్ ఎక్స్చేంజీలకు ఎస్‌బీఐ వెల్లడించిన సంగతి తెలిసిందే.
ఆ తర్వాత డిసెంబర్ 24న ఈ మార్గంలో ఎస్‌బీఐ రూ. 4,000 కోట్లు సమీకరించింది. ఇక, 2017 మార్చి నాటికల్లా బ్యాంకులు తమ ఖాతాల్లో మొండిబకాయిల భారాన్ని తగ్గించుకోవాలన్న డెడ్‌లైన్‌పై ఆర్‌బీఐతో బ్యాంకులు చర్చలు జరుపుతున్నాయని భట్టాచార్య చెప్పారు. అటు స్టాక్‌మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి కొత్త చీఫ్‌గా తన పేరు పరిశీలనలో ఉందన్న వార్తలు వాస్తవం కాదన్నారు. ఇదంతా మీడియా సృష్టేనని చెప్పారు.