ఎస్‌బీఐ కార్డుకి చెక్కుతో చెల్లిస్తే బాదుడే
రూ. 2,000 దాకా చిన్న మొత్తాల చెల్లింపులపై రూ. 100 చార్జీ
బెంగళూరు: క్రెడిట్ కార్డుల సంస్థ ఎస్‌బీఐ కార్డు.. చిన్న మొత్తాలను చెక్కుతో క్లియర్ చేసే కస్టమర్లపై భారీగా వడ్డించడం ప్రారంభించింది. రూ. 2,000 దాకా స్వల్ప మొత్తాలను చెక్కుతో చెల్లించిన పక్షంలో రూ. 100 చార్జీ వసూలు చేస్తోంది. ఏప్రిల్ 1 నుంచి ఈ ఫీజులు అమల్లోకి వచ్చినట్లు ఎస్‌బీఐ కార్డ్ వెల్ల డించింది.
అయితే, రూ. 2,000కు మించిన మొత్తాలను చెక్కులతో చెల్లించినా ఎటువంటి చార్జీలు ఉండవని తెలిపింది. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా డిజిటల్ పేమెంట్స్‌ను ప్రోత్సహించే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్‌బీఐ కార్డు పేర్కొంది. దాదాపు 90 శాతం మంది కస్టమర్లు చెక్ కాకుండా ఇతర విధానాల ద్వారానే చెల్లింపులు జరుపుతుంటారని సంస్థ సీఈవో విజయ్ జసూజా చెప్పారు.
అయితే, స్వల్ప మొత్తాలను చెక్కుతో చెల్లిస్తున్న సందర్భాల్లోనే వివాదాలు తలెత్తుతున్నట్లు గుర్తించామని ఆయన వివరించారు. ఇది ఇటు సంస్థకు, అటు ఖాతాదారులకూ సమస్యాత్మకంగానే ఉంటోందని తెలిపారు. తొలిసారి క్రెడిట్ కార్డును ఉపయోగించే వారికోసం ఉద్దేశించిన ‘ఎస్‌బీఐ కార్డ్ ఉన్నతి’ హోల్డ ర్లకు మాత్రం చెక్కు పేమెంట్లపై ఎటువంటి చార్జీలు ఉండబోవని జసూజా తెలిపారు. ఎస్‌బీఐ కార్డ్‌కు 40 లక్షల పైగా ఖాతాదారులు ఉన్నారు.