సాక్షి, న్యూఢిల్లీ : ఎయిర్‌సెల్-మ్యాక్సిస్, ఐఎన్‌ఎక్స్ కేసుల్లో విచారణ నిమిత్తం మార్చి తొలివారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట హాజరు కావాలని సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర ఆర్ధిక మంత్రి పీ చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరాన్ని సుప్రీం కోర్టు బుధవారం ఆదేశించింది. చట్టంతో చెలగాటమాడరాదని ఆయనను సర్వోన్నత న్యాయస్ధానం హెచ్చరించింది. విదేశాలకు వెళ్లేందుకు అనుమతించే షరతుల్లో భాగంగా రూ పది కోట్లను కోర్టు రిజిస్ట్రీ వద్ద డిపాజిట్ చేయాలని కార్తీని సుప్రీం కోర్టు ఆదేశించింది.
ఫిబ్రవరి 21-28 తేదీల్లో తన ఫ్రాన్స్ పర్యటనకు అనుమతించాలని కోరుతూ కార్తీ గత ఏడాది నవంబర్‌లో అప్పీల్ చేశారు. ‘మీరు ఎక్కడికి వెళ్లదలుచుకుంటే అక్కడికి వెళ్లవచ్చు..ఏం చేయాలనుకుంటే అది చేయవచ్చు.. అయితే చట్టంతో మాత్రం ఆడుకోవద్దు..విచారణకు సహకరించకుంటే మాత్రం తాము తీవ్ర చర్యలకు వెనుకాడబో’ మని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్ నేతృత్వంలోని బెంచ్ కార్తీపై మండిపడింది. ఎయిర్‌సెల్-మ్యాక్సిస్, ఐఎన్‌ఎక్స్ కేసుల్లో కార్తీ చిదంబరం మనీ ల్యాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఆయా సంస్ధల్లో విదేశీ పెట్టుబడులకు కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం కార్తీ చిదంబరం ముడుపులు స్వీకరించారని దర్యాప్తు ఏజెన్సీలు ఆరోపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment