‘ఆద్రియాలా’ ఉత్పత్తి పెంపుపై సింగరేణి దృష్టి
హైదరాబాద్: కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలోని ప్రతిష్టాత్మక ఆద్రియాలా లాంగ్ వాల్ అండర్‌గ్రౌడ్ ప్రాజెక్టు నుంచి జోరుగా బొగ్గు ఉత్పత్తి పెంచేందుకు సింగరేణి కాలరీస్ కసరత్తు చేస్తోంది. ఈ ప్రాజెక్టు నుంచి రోజుకు 15,000 టన్నుల ఉత్పత్తి లక్ష్యంగా పనిచేస్తోంది. ఇందుకు దాదాపు రూ.1,200 కోట్ల భారీ పెట్టుబడులను వెచ్చిస్తోంది. 2015-16లో 28.1 లక్షల టన్నుల వార్షిక ఉత్పత్తి ప్రాజెక్టు లక్ష్యం.
జర్మనీకి చెందిన కేటర్‌పిల్లర్ కంపెనీ ఉత్పత్తి పెంపునకు సంబంధించిన పరికరాల సరఫరాసహా సాంకేతిక అంశాలకు సంబంధించి కీలక సలహాలను అందజేస్తోంది. ఈ మేరకు సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఒక ప్రకటన విడుదల చేసింది. 2014 అక్టోబర్ నుంచి జరుపుతున్న ప్రయోగాత్మక ఉత్పత్తి రోజుకు 4,000 టన్నుల మేర వుంటోంది.
ఫిబ్రవరి నాటికి ప్రాజెక్టు ద్వారా రోజుకు 10,000 టన్నులు, మార్చినాటికి 15,000 టన్నుల ఉత్పత్తి జరగాలన్నది లక్ష్యమని ప్రకటన పేర్కొంది. లక్ష్య సాధనకు సంస్థ సింగరేణి కాలరీస్ కంపెనీ సీఎండీ ఎన్ శ్రీధర్ ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారని తెలిపింది.