పాన్‌కార్డ్ నిబంధనను తొలగించాల్సిందే!
- లేకపోతే 70% బంగారం అమ్మకాలపై ప్రభావం
- జీజేఎఫ్ రీజనల్ డెరైక్టర్ మోహన్‌లాల్ జైన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రూ.లక్ష విలువ చేసే బంగారం అమ్మకాలపై కొనుగోలుదారుల నుంచి కచ్చితంగా పాన్‌కార్డ్ అప్లికేషన్ నంబర్ తీసుకోవాలన్న నిబంధన పరిశ్రమను నిర్వీర్యం చేసేలా ఉందని ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జ్యుల్లరీ ట్రేడ్ ఫెడరేషన్ (జీజేఎఫ్) రీజనల్ డెరైక్టర్ మోహన్‌లాల్ జైన్ అన్నారు.
ప్రాక్టికల్‌గా ఈ నిబంధన అమలు కాకపోవడమే కాకుండా 70 శాతం గ్రామీణ కొనుగోలుదారులపై ఇది ప్రభావం చూపుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారమిక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పాన్‌కార్డ్ నిబంధన వచ్చిన నాటి నుంచి కొనుగోలుదారులు తగ్గారని ఆయన చెప్పారు. దేశంలో ప్రస్తుతం 14 కోట్ల మందికి మాత్రమే పాన్‌కార్డులున్నాయని.. మిగతా వాళ్లకు మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చాలా మందికి పాన్ కార్డుల్లేవని పేర్కొన్నారు.
ఇప్పటికే రూ.5 లక్షల ఆభ రణాల అమ్మకాలపై టీసీఎస్ (ట్యాక్స్ కలెక్షన్ ఎట్ సోర్స్)ను అమలు చేస్తుండగా.. కొత్తగా రూ.లక్ష ఆభరణాలపై పాన్‌కార్డ్ నిబంధనను తేవటం సరైనదికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నిబంధన గ్రామీణ ప్రాంతాల్లోని సుమారు 70% మార్కెట్‌ను దెబ్బతీస్తుందని పేర్కొన్నారు. పాన్‌కార్డ్ నిబంధనను తొలగించకపోతే చాలా వరకు బంగారం వ్యాపారులు రోడ్డు పాలవుతారని పేర్కొన్నారు.