Akshaya Tritiya 2023: ‘అక్షయ’కు పుత్తడి మెరిసేనా?
ముంబై: ఈ అక్షయకు పుత్తడి వెలుగులు విరజిమ్మేనా? ప్రస్తుత ధరలు అమ్మకాలను ప్రభావితం చేస్తాయా? అవుననే అంటున్నాయి పరిశ్రమ వర్గాలు. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే పరిమాణం పరంగా విక్రయాలు 20 శాతం తగ్గే అవకాశం ఉందని చెబుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో గురువారం 10 గ్రాముల పుత్తడి ధర 24 క్యారెట్లు రూ.60,930, అలాగే 22 క్యారెట్లు అయితే రూ.55,850 పలికింది.
‘ఇటీవల 10 గ్రాములకు రూ.60 వేలు దాటడంతో వినియోగదార్లు పుత్తడి కొనుగోలు చేయకుండా జాగ్రత్త పడుతున్నారు. ఆ తర్వాత ధర స్వల్పంగా తగ్గినప్పటికీ.. ధరలు మాత్రం బుల్లిష్‌గానే ఉన్నాయి. విలువైన లోహాలను కొనుగోలు చేయడం శుభప్రదంగా భావించే అక్షయ తృతీయ సమయంలో ఇది అమ్మకాలపై ప్రభావం చూపుతుంది’ అని ఆల్ ఇండియా జెమ్, జ్యువెల్లరీ డొమెస్టిక్ కౌన్సిల్ (జీజేసీ) చైర్మన్ సైయమ్ మెహ్రా తెలిపారు. ఈ ఏడాది అక్షయ తృతీయ ఏప్రిల్ 22న వస్తోంది.
దక్షిణాది వాటాయే అధికం..
అక్షయ విక్రయాల్లో దక్షిణాది రాష్ట్రాల వాటా ఏకంగా 40 శాతం ఉంది. పశ్చిమ భారత్ 25 శాతం, తూర్పు 20, ఉత్తరాది రాష్ట్రాలు 15 శాతం వాటా కైవసం చేసుకున్నాయి. ధరలు అధికంగా ఉండడం డిమాండ్‌పై ప్రభావం చూపనుందని జీజేసీ మాజీ చైర్మన్, ఎన్ఏసీ జ్యువెల్లర్స్ ఎండీ అనంత పద్మనాభన్ తెలిపారు.
ధరలు పెరిగిన ప్రభావం ఇప్పటికే కనపడుతోంది. 2022తో పోలిస్తే విలువ పరంగా అక్షయ అమ్మకాల్లో ఈ ఏడాది 10 శాతం తగ్గుదల నమోదు కావొచ్చని చెప్పారు. పరిమాణం పరంగా 20 శాతం క్షీణతకు చాన్స్ ఉందన్నారు. అకస్మాత్తుగా పుత్తడి ధర తగ్గితే అమ్మకాలకు బూస్ట్‌నిస్తుందని వివరించారు.
స్థిరంగా పసిడి ధర..
ప్రస్తుతం కొనసాగుతున్న బంగారం ధరలు బుల్లిష్‌గా ఉన్నప్పటికీ.. కొంతకాలం స్థిరంగా ఉండే అవకాశం ఉందని కామ్‌ట్రెండ్జ్ రిస్క్ మేనేజ్మెంట్ సర్వీసెస్ సీఈవో జ్ఞానశేఖర్ త్యాగరాజన్ తెలిపారు. ‘ప్రస్తుతం యూఎస్ ఆర్థిక పరిస్థితుల మాదిరిగా పసిడి ధరలను అస్థిరంగా మార్చడానికి కారణాలేవీ లేవు.
రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, చమురు ధరల వంటి ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితులు కూడా ఇటీవల పుత్తడి ధరలను ప్రభావితం చేయలేదు. భారత్‌లోని వినియోగదార్లకు బంగారం ధరల పెరుగుదలకు అలవాటుపడటానికి ఎల్లప్పుడూ సమయం పడుతుంది. కాబట్టి ఈ సవత్సరం అక్షయ తృతీయ సమయంలో డిమాండ్ తక్కువగా ఉండే అవకాశం ఉంది’ అని
వివరించారు.
విడదీయలేని బంధం..
లక్షలాది మంది భారతీయులకు అక్షయ తృతీయ వేడుకల్లో బంగారం కొనుగోళ్లు విడదీయరాని భాగం అని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ భారత్ సీఈవో సోమసుందరం పీఆర్ వివరించారు. ‘పుత్తడిని సంపద చిహ్నంగా భావిస్తారు. అక్షయకు కాలానుగుణ కొనుగోలు ప్రారంభాన్ని సూచిస్తుంది. ప్రధాన బంగారం కొనుగోలు పండుగ అయినప్పటికీ.. ఈ సంవత్సరం అక్షయ తృతీయ పసిడి జీవితకాల అధిక ధరలను ఎదుర్కొంటోంది. గత కొన్ని వారాలుగా వినియోగదారుల నుండి మోస్తరు స్పందన ఉంది’ అని తెలిపారు.
మహమ్మారి కారణంగా రెండేళ్ల మందకొడి పనితీరు తర్వాత బంగారు పరిశ్రమకు తిరిగి మెరుపు వచ్చిందని కామా జ్యువెల్లరీ ఎండీ కోలిన్ షా అన్నారు. ‘కొంతకాలంగా పసిడి ధరలు గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. ఈ సంవత్సరంలో పెరుగుతున్న ధరలు, ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో వినియోగదారులు తమ కొనుగోళ్లతో మరింత జాగ్రత్తగా ఉండాలని భావిస్తున్నారు. అయితే పెట్టుబడిదారుల వర్గం రాబోయే కాలంలో పుత్తడి ధరలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు’ అని చెప్పారు.