ఈ నెలలోనే ఎలక్ట్రానిక్-ఐపీఓ నిబంధనలు
న్యూఢిల్లీ: మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ, ఈ నెలలోనే ఎలక్ట్రానిక్ ఐపీఓలపై సవివరమైన మార్గదర్శకాలను విడుదల చేయనున్నది. ఈ విధానంలో ఇన్వెస్టర్లు ఇంటర్నెట్ ద్వారా షేర్లకు బిడ్ చేయవచ్చు. వీటికి సంబంధించిన ముసాయిదా మార్గదర్శకాలను ఈ ఏడాది జనవరిలో విడుదల చేశామని సెబీ వర్గాలు వెల్లడించాయి. సంబంధిత వ్యక్తులు, సంస్థల నుంచి అందిన సూచనలను క్రోడీకరించి తుది నిబంధనలను రూపొందించామని ఈ వర్గాలు పేర్కొన్నాయి.
ఎలక్ట్రానిక్ -ఐపీఓ కారణంగా ఐపీఓ దరఖాస్తుల ముద్రణ వ్యయం తప్పుతుంది. అంతేకాకుండా ఐపీఓ సంబంధిత వ్యయాలు కూడా బాగా తగ్గుతాయి. చిన్న నగరాల్లో మరింతమంది రిటైల్ ఇన్వెస్టర్లకు చేరువ కావచ్చు. అంతేకాకుండా ప్రస్తుతం 12 రోజులుగా ఉన్న స్టాక్ మార్కెట్లో కంపెనీల లిస్టింగ్ కాలం మూడు రోజులకు తగ్గుతుందని అంచనా.