అత్యాశతో కమోడిటీ మార్కెట్లోకి రావద్దు...
చిన్న ఇన్వెస్టర్లకు సెబీ చీఫ్ సిన్హా హెచ్చరిక
ముంబై : తక్షణ లాభాలను ఆశించి కమోడిటీ మార్కెట్లోకి అడుగుపెట్టొద్దని చిన్న ఇన్వెస్టర్లను సెబీ చీఫ్ యూకే సిన్హా హెచ్చరించారు. కమోడిటీ లావాదేవీలు అత్యంత రిస్కుతో కూడినవని.. దీనికి చాలా నైపుణ్యం అవసమని కూడా ఆయన పేర్కొన్నారు. పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలను చెప్పారు. కమోడిటీ ట్రేడింగ్‌ను నియంత్రించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని... వచ్చే నెలకల్లా కమోడిటీ మార్కెట్ నియంత్రణ సంస్థ ఎఫ్‌ఎంసీని సెబీలో విలీనం చేసే ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందన్నారు. ‘కమోడిటీ ట్రేడింగ్‌లో తక్కు వ మార్జిన్‌తో భారీ లాభాలను ఆర్జించవచ్చంటూ కొంతమంది ఆశలు రేకెత్తిస్తుంటారు.
వారి వలలో పడొద్దు. కమోడిటీ మార్కెట్ అనేది నిపుణులు, అధిక రిస్క్‌లను తట్టుకోవడం కోసం, హెడ్జింగ్ చేసే వారికోసం ఉద్దేశించింది. అంతేకానీ, చెమటోడ్చి సంపాదించిన సొమ్మును ఇందులో పెట్టుబడిగా పెట్టి.. ట్రేడింగ్ చేయడం ఏమాత్రం మంచిది కాదు’ అని చిన్న ఇన్వెస్టర్లకు సిన్హా సూచించారు.