అక్రమార్కుల్లో చిన్నాపెద్దా తేడాలేదు
ముంబై: స్టాక్ మార్కెట్లో అవకతవకలు, మోసాలు, నిబంధనలను ఉల్లంఘించేవారెవరైనా వదిలిపెట్టే ప్రసక్తేలేదని నియంత్రణ సంస్థ సెబీ చైర్మన్ యూకే సిన్హా హెచ్చరించారు. అక్రమార్కుల్లో చిన్నాపెద్దా తేడాలేవీ సెబీకి ఉండవని కూడా స్పష్టం చేశారు. తప్పు చేసినవాళ్లలో బడా కార్పొరేట్ సంస్థలు, చిన్న ఇన్వెస్టర్లనే వ్యత్యాసం లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ‘వాస్తవాలు, కేసు పరిస్థితి ఆధారంగానే మోసానికి పాల్పడేవారిపై సెబీ చర్యలు చేపడుతుంది. కేసులను వేగంగా దర్యాప్తు చేయడం కూడా ఇందులో భాగమే. నేరం చేసేవాళ్ల విషయంలో తరతమ భేదాలు ఉండవు’ అని సిన్హా వ్యాఖ్యానించారు. అవకతవకలకు పాల్పడే పెద్ద కంపెనీల విషయంలో ఒకవిధంగా, చిన్నవాళ్లపై మరోరకంగా సెబీ వ్యవహరిస్తోందనే విమర్శలపై ఆయన ఈ విధంగా స్పందించారు. మరోపక్క, అక్రమార్కులపై ప్రతాపం చూపుతున్నామనే బలమైన సందేశాన్ని పంపేందుకు... సెబీ తమపై మరీ దురుసుగా చర్యలు తీసుకుంటోందని కొన్ని కార్పొరేట్ దిగ్గజాలు ఆరోపిస్తున్న సందర్భాలూ ఉన్నాయి.
పెద్ద కంపెనీలు ఎంతపెద్ద తప్పుచేసినా సెటిల్‌మెంట్ పేరుతో వదిలిపెడుతున్నారన్న ఒక అపప్రధ గతంలో ఎక్కువగా ఉండేదని.. ఇప్పుడు అలాంటిదేమీ లేదని స్వయంగా అందరూ గుర్తిస్తున్నారని సెబీ చీఫ్ చెప్పారు. అయితే, ఆ బడా కంపెనీలు, వ్యక్తుల పేర్లను ప్రస్తావించలేదు. ప్రస్తుతం తీవ్రమైన నేరాలకు పాల్పడేవారికి ఇలాంటి సెటిల్‌మెంట్ విధానాలను వర్తింపజేయడం లేదని కూడా సిన్హా పేర్కొన్నారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్ కేసులో కన్‌సెంట్ సెటిల్‌మెంట్ విజ్ఞప్తిని తోసిపుచ్చిన సెబీ నిర్ణయాన్ని ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ సవాలు చేయడం తెలిసిందే. ఇంకా ఇన్వెస్టర్ల నుంచి అక్రమంగా నిధులు సమీకరించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న సహారా గ్రూప్‌పైకూడా సెబీ ఉక్కుపాదం మోపింది.