
ఎక్స్ఛేంజీలకు ఎన్నికల ఫీవర్
న్యూఢిల్లీ: రోజుకో కొత్త ఆల్‌టైమ్ గరిష్టాలతో దేశీ స్టాక్ మార్కెట్లు చరిత్ర సృష్టిస్తున్న నేపథ్యంలో... ఇప్పుడు రానున్న లోక్‌సభ ఎన్నికల ఫలితాలపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. వచ్చే నెల 16న ఎన్నికల ఫలితాలు వెలువడనున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా సుస్థిర ప్రభుత్వం ఏర్పడవచ్చన్న అంచనాలే మార్కెట్ దూకుడుకు దోహదం చేస్తోంది. కాగా, ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ఫోలియోలకు వెన్నుదన్నుగా ఎఫ్‌ఎంసీజీ ఇతరత్రా ‘డిఫెన్సివ్’ స్టాక్స్‌వైపు మొగ్గుచూపుతున్నారు.
మరోపక్క, ఫలితాల రోజు అకస్మాత్తుగా స్టాక్ సూచీలు అనూహ్య హెచ్చుతగ్గులకులోనైతే మౌలిక వ్యవస్థలు, సాఫ్ట్‌వేర్ పరంగా ఎలాంటి సమస్యలూ తలెత్తకుండా నియంత్రణ సంస్థ సెబీ, స్టాక్ ఎక్స్ఛేంజీలు అప్రమత్తమవుతున్నాయి. ఫలితాల ప్రకటన సందర్భంగా అనుకోనిరీతిలో లావాదేవీలు పెరిగిపోవడం వల్ల తలెత్తే ఒత్తిడిని ఎదుర్కోవడంకోసం సెబీ పర్యవేక్షణలో స్టాక్ ఎక్స్ఛేంజీలు ‘మాక్ స్ట్రెస్ టెస్ట్’లను నిర్వహిస్తున్నాయని అధికారిక వర్గాలు వెల్లడించాయి.
2009 మే 18 నాటి అనుభవాన్ని దృష్టిలోపెట్టుకొని సెబీ తాజా ఎన్నికల ఫలితాలకు సన్నద్ధమవుతోంది. అప్పటి ఎన్నికల పలితాల సందర్భంగా స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా దూసుకెళ్లడంతో ట్రేడింగ్‌ను నిలిపేయాల్సి వచ్చింది. ‘మేజిక్ మండే’గా నిలిచిపోయిన ఆనాటి ట్రేడింగ్‌లో బీఎస్‌ఈ సెన్సెక్స్ ఒక్క నిమిషంలోనే 2,100 పాయింట్లు ఎగబాకి అతిపెద్ద లాభాన్ని నమోదు చేయడం తెలిసిందే. ప్రధానంగా యూపీఏ కూటమికి అనుకూలంగానిర్ణయాత్మక ఫలితాలు వెలువడటమే దీనికి కారణం.
అదేవిధంగా 2004 మే 14న ఎన్నికల ఫలితాల సందర్భంగా కూడా మార్కెట్లు తీవ్రంగానే స్పందించాయి. ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోవడంతో సంస్కరణలపై నీలినీడలు అలముకోవడంతో మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలేందుకు దారి తీసింది. కాగా, ఈ ఏడాది ఇప్పటికే సెన్సెక్స్ 7% పైగా ఎగబాకి 23,000 పాయింట్ల స్థాయివైపు పరుగులు తీస్తోంది. అయితే, అందరూ అంచనావేస్తున్నట్లు స్థిరమైన ప్రభుత్వ ఏర్పాటుకు అనుకూలంగా తాజా ఎన్నికల ఫలితాలురాకపోతే మార్కెట్లో క్రాష్‌కు ఆస్కారం ఉందనేది విశ్లేషకుల అభిప్రాయం.