ఇన్వెస్టర్ల కోసమే సెబీ
సాక్షి, గుంటూరు: ఇన్వెస్టర్ల ప్రయోజనాలు కాపాడటమే తమ ప్రధాన కర్తవ్యమని సెబీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ కె. రంగనాయకులు అన్నారు. శనివారం గుంటూరులో నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (ఎన్‌ఎస్‌డీఎల్), సెబీ ఆధ్వర్యంలో మార్కెట్ భద్రతపై ఇన్వెస్టర్లకు నిర్వహించిన ప్రాంతీయ స్థాయి అవగాహన సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఏదైనా కంపెనీలో పెట్టుబడి పెట్టి మోసపోతే గనక ఇన్వెస్టర్లు సెబీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయవచ్చన్నారు. హైదరాబాదులోని బంజారాహిల్స్ రోడ్ నెంబరు-10లో ఉన్న సెబీ కార్యాలయంలో అధికారులు అందుబాటులో ఉంటారని ఆయన వివరించారు. సెబీ డీజీఎం సంజయ్ సీ పురావ్, ఎన్‌ఎస్‌డీఎల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సమర్ బన్వత్, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రీజనల్ మేనేజరు ఎం. రవికుమార్, హెచ్‌డీఎఫ్‌సీ ప్రతినిధి సుమన్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
500 కోట్ల రికవరీకి నోటీసులు: సిన్హా
ముంబై: ఉల్లంఘనలకు పాల్పడిన, బకాయిలు ఎగ్గొట్టిన కంపెనీల నుంచి దాదాపు రూ.500 కోట్లు పైగా రాబట్టేందుకు గత రెండు నెలల్లో నోటీసులు పంపినట్లు సెబీ చైర్మన్ యూకే సిన్హా చెప్పారు. ఆయా కంపెనీలకు చెందిన పలు బ్యాంక్ ఖాతాలను కూడా స్తంభింపజేసినట్లు ఒక సదస్సులో ఆయన చెప్పారు. మరోవైపు, ఫైనాన్షియల్ టెక్నాలజీస్ సారథ్యంలోని నేషనల్ స్పాట్ ఎక్స్చేంజ్ సంక్షోభం ప్రభావం.. మరో గ్రూప్ సంస్థ ఎంసీఎక్స్-ఎస్‌ఎక్స్‌పై ఉండదని సిన్హా చెప్పారు. తన పరిధిలోకి వచ్చే ఎంసీఎక్స్-ఎస్‌ఎక్స్ నియంత్రణ పకడ్బందీగా ఉండేలా సెబీ కట్టుదిట్టంగా వ్యవహరిస్తుందని ఆయన తెలిపారు.