
ముంబై: ఐపీవోలు, టేకోవర్, రైట్స్ ఇష్యూలకు సంబంధించి కీలక మార్పులకు సెబీ ఓకే చెప్పింది. ఐపీవో ధరల శ్రేణిని 2 రోజుల ముందు ప్రకటించే విధానానికి ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఐపీవో ప్రారంభానికి ఐదు రోజులు ముందుగానే ధరల్ని ప్రకటించాల్సి ఉంది. దీన్ని రెండు రోజులకు తగ్గించే సవరణకు సంబంధించి ముసాయిదా మార్గదర్శకాలకు సెబీ ఆమోదముద్ర వేసింది. ఇంకా పలు సవరణలకు కూడా ఆమోదం తెలుపుతూ గురువారం జరిగిన బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకుంది.
ఐపీవోలకు వెసులుబాట్లు
ఐపీవో, రైట్స్ ఇష్యూలకు వచ్చే కంపెనీలు ఐదు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన ఆర్థిక ఫలితాల వివరాలను వెల్లడించాలన్న నిబంధన ఉంది. దీన్ని ఇక నుంచి మూడు ఆర్థిక సంవత్సరాలకు సెబీ తగ్గించింది. అదేవిధంగా, కన్సాలిడేటెడ్ ఆడిటెడ్ ఫైనాన్షియల్ వివరాలనే పత్రాల్లో వెల్లడించాలని సెబీ పేర్కొంది. స్టాండలోన్, సబ్సిడరీల ఆర్థిక ఫలితాలు, వివరాలను కంపెనీ వెబ్‌సైట్లో పేర్కొంటే సరిపోతుందని తెలియజేసింది. యాంకర్ ఇన్వెస్టర్ సైజు కనీస పరిమితిని రూ.2 కోట్లకు తగ్గించింది. సబ్‌బ్రోకర్ల కేటగిరీని ఎత్తేసి, వారిని అధీకృత వ్యక్తులు లేదా ట్రేడింగ్ సభ్యులుగా పరిగణించనుంది. సెబీ ఈ నిర్ణయాలు తీసుకునే ముందు ప్రైమరీ మార్కెట్ అడ్వైజరీ కమిటీ సిఫారసులు, ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంది.ఇష్యూ ఆఫ్ క్యాపిటల్ అండ్ డిస్‌క్లోజర్ రిక్వైర్‌మెంట్స్ (ఐసీడీర్)కు సంబంధించి వెల్లడించాల్సిన వివరాల్లో గందరగోళాన్ని తొలగించడమే తాజా నిర్ణయాలకు కారణమని సెబీ చైర్మన్ అజయ్ త్యాగి చెప్పారు.
ఎండీ పదవీ కాలంలో మార్పులు
డిపాజిటరీ, క్లియరింగ్ కార్పొరేషన్, స్టాక్ ఎక్సేంజ్ వంటి మార్కెట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇనిస్టిట్యూషన్లలో (ఎంఐఐలు) అర్హత కలిగిన దేశీయ, విదేశీ కంపెనీలు 15 శాతం వాటా తీసుకునేందుకు అనుమతించడం కూడా సెబీ తీసుకున్న నిర్ణయాల్లో ఒకటి. ఇక ఎంఐఐలకు ఎండీగా వ్యవహరించేవారు రెండు పర్యాయాలు 5 సంవత్సాల చొప్పున లేదా 65 ఏళ్లు వీటిలో ఏది ముందు అయితే అది వర్తిస్తుందని సెబీ వెల్లడించింది. ఇక ఎంఐఐలకు పబ్లిక్ ఇంట్రెస్ట్ డైరెక్టర్లు మూడేళ్లు చొప్పున మూడు పర్యాయాలు మాత్రమే లేదా 75 ఏళ్లు ఏది ముందు అయితే అంతకాలం పాటే పదవుల్లో ఉండగలరని తెలిపింది. సరైన దిశలోనే సెబీ ఈ నిర్ణయాలు తీసుకుందని ఖైతాన్ అండ్ కో పార్ట్‌నర్ ఆదిత్య చెరియన్ పేర్కొన్నారు. వివరాల వెల్లడిలో పాత విధానాలను తొలగించి ఇన్వెస్టర్లు ఆఫర్ పత్రాలను అర్థం చేసుకుని, తగిన నిర్ణయం తీసుకునేందుకు ఈ మార్పులు ఉపయోగపడతాయన్నారు.
కీలక అంశాలు
►ఇకపై ఐపీవోకు రెండు రోజుల ముందు ధరలు (ప్రైస్ బ్యాండ్) ప్రకటిస్తే చాలు.
►ఐపీవోలు, రైట్స్ ఇష్యూలకు వచ్చే కంపెనీలు మూడు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి ఫలితాల వివరాలు వెల్లడిస్తే చాలు.
►స్టాక్ ఎక్సేంజ్‌లు, డిపాజిటరీలు, క్లియరింగ్ కార్పొరేషన్లలో 15 శాతం వాటా కొనుగోలుకు అర్హత కలిగిన దేశ, విదేశీ సంస్థలకు అనుమతి.
►ప్రమోటర్ గ్రూపు గుర్తింపునకు షేర్‌హోల్డింగ్ ప్రారంభ పరిమితి 10 శాతం నుంచి 20శాతానికి పెంపు.
►సెక్యూరిటీల చట్టం కింద థర్డ్ పార్టీ అస్సైన్‌మెంట్‌కు సంబంధించిన నిబంధనల సవరణకు చర్చాపత్రం.
► వాట్సాప్‌లో ఆర్థిక ఫలితాల సమాచారం లీకులపై మరింతగా దర్యాప్తు.
► యాంకర్ ఇన్వెస్టర్ సైజు రూ.2 కోట్లకు తగ్గింపు.
►ఇకపై సబ్‌బ్రోకర్లు అధీకృత వ్యక్తులు లేదా ట్రేడింగ్ సభ్యులుగా పరిగణింపు. సబ్‌బ్రోకర్లకు తాజా రిజిస్ట్రేషన్ ఇక మీదట ఉండదు.
వాట్సాప్ లీకులపై మరింత దర్యాప్తు
కొన్ని కంపెనీలకు సంబంధించి స్టాక్ ధరల్ని ప్రభావితం చేసే సమాచారాన్ని వాట్సాప్‌లో లీక్ చేసిన ఉదంతంలో సెబీకి 4 నివేదికలు అందాయి. దీనిపై తదుపరి దర్యాప్తు నిర్వహిస్తున్నట్టు త్యాగి తెలిపారు. ఈ కేసులో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంకు, బాటా ఇండియాలకు వ్యతిరేకంగా ప్రాథమిక దర్యాప్తునకు ఆదేశించడం తెలిసిందే. అంతర్గత విచారణ చేపట్టాలని ఈ కంపెనీలను కోరినట్టు త్యాగి చెప్పారు. నాలుగు నివేదికలు తమకు అందాయన్నారు. ఈ విషయంలో అవసరమైన చర్యల్ని తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ విషయమై 12 కంపెనీలు సెబీ నిఘాలో ఉన్నాయి. కంపెనీల ఆర్థిక ఫలితాలకు సరిపోలే సమాచారాన్ని ముందుగానే వాట్సాప్ వేదికలపై లీక్ చేసినట్టు సెబీ తన ప్రాథమిక దర్యాప్తులో గుర్తించింది.
ఐసీఐసీఐ నుంచి ఇంకా జవాబు రాలేదు
ఐసీఐసీఐ బ్యాంక్ సీఈఓ చందా కొచర్‌పై వచ్చిన అభియోగాలపై వివరణ కోరామని త్యాగి చెప్పారు. ఆ బ్యాంక్ నుంచి ఇప్పటిదాకా ఎలాంటి జవాబు రాలేదన్నారు. 2012లో వీడియోకాన్ గ్రూప్‌కు ఐసీఐసీఐ బ్యాంక్ రూ.3,250 కోట్ల రుణాలు ఇచ్చింది. ఈ రుణాల విషయంలో చందా కొచర్ కుటుంబ సభ్యుల లబ్ది పొందారనే ఆరోపణలు వచ్చాయి. ఈ కేసు విషయమై ఐసీఐసీఐ బ్యాంక్ అంతర్గత దర్యాప్తు జరుగుతుండటంతో, ఈ దర్యాప్తు పూర్తయ్యేవరకూ సెలవుపై వెళ్లాలన చందా కొచర్ నిర్ణయించుకున్నారని ఐసీఐసీఐ బ్యాంక్ ఇటీవలే పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment