నష్టాలతో బోణీ..
♦ ఆసియా, యూరప్ మార్కెట్ల క్షీణత ప్రభావం
♦ సెన్సెక్స్‌కు 72 పాయింట్ల నష్టం
కొత్త ఆర్థిక సంవత్సరంలో స్టాక్ మార్కెట్ నష్టాలతో ప్రారంభమైంది. ఆసియా, యూరోప్ మార్కెట్ల పతన ప్రభావంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ కారణంగా శుక్రవారం స్టాక్ సూచీలు క్షీణించాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 72 పాయింట్లు క్షీణించి 25,270 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 25 పాయింట్లు నష్టపోయి 7,713 పాయింట్ల వద్ద ముగిశాయి. ఇంధన, ఐటీ షేర్లలో అమ్మకాలు ప్రతికూల ప్రభావం చూపాయి. అయితే చివరి గంటలో బ్యాంకు షేర్లలో కొనుగోళ్లు జరగడంతో నష్టాలు తగ్గాయి. ఐదు వారాల్లో తొలిసారిగా మార్కెట్ నష్టపోయింది. ఈ ఏడాది మొదటి క్వార్టర్‌లో జపాన్‌లో వ్యాపార విశ్వాసం క్షీణించడంతో జపాన్ స్టాక్ సూచీ నికాయ్ 3.5 శాతం పతనం కావడం, ముడి చమురు ధరల క్షీణత మళ్లీ ప్రారంభమవడం, అమెరికా ఉద్యోగ గణాంకాల కోసం ఇన్వెస్టర్లు వేచి చూడడం ఇవన్నీ ప్రతికూల ప్రభావం చూపాయి.