ఫలితాలు సీజన్: మార్కెట్లు అప్రమత్తత
Published Wed, Apr 12 2017 4:04 PM | Last Updated on Tue, Sep 5 2017 8:36 AM
ముంబై : రేపటి నుంచి నాలుగో త్రైమాసిక ఫలితాల సీజన్ ప్రారంభం కాబోతున్న తరుణంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. దీంతో మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 144.87 పాయింట్లు పడిపోయి 29,643.48 వద్ద, నిఫ్టీ 33.55 పాయింట్ల నష్టంలో 9203.45 వద్ద క్లోజయ్యాయి. గురువారం టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ తన ఫలితాలతో త్రైమాసిక సీజన్ కు బోణి కొట్టబోతుంది. అంచనావేసిన దానికంటే ఫలితాలు మెరుగ్గానే ఉంటాయని తెలుస్తున్నప్పటికీ, ఇన్వెస్టర్లు కొంత అప్రమత్తతో వ్యవహరించారు. దీంతో కంపెనీ షేర్లు ఫ్లాట్ గా ముగిశాయి. నార్త్ కొరియా, సిరియా ఆందోళన నేపథ్యంలో అటు గ్లోబల్ మార్కెట్లు కూడా ఒత్తిడిలో కొనసాగాయి. ఈ సెంటిమెంట్ కూడా దేశీయ మార్కెట్లపై పడిందని విశ్లేషకులంటున్నారు. ఇంట్రాడేలో సెన్సెక్స్ 289 పాయింట్ల రేంజ్ లో కొనసాగింది.
నిఫ్టీ గరిష్టంగా 9246.40, కనిష్టంగా 9161.80 స్థాయిలను తాకింది. మంగళవారం క్లోజింగ్ తో ఈ ఏడాది 20 శాతం ఎగిసిన నిఫ్టీ పీఎస్యూ బ్యాంకు ఇండెక్స్, సిండికేట్, ఓరియంటల్ బ్యాంకు ఆఫ్ కామర్స్, ఎస్బీఐ, బ్యాంకు ఆఫ్ ఇండియా, బ్యాంకు ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంకు నష్టాలతో 1.3 శాతం పడిపోయింది. టాటా స్టీల్, అదానీ పోర్ట్స్, విప్రో, హిందాల్కో, మారుతీ సుజుకి, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎన్టీపీసీ, టాటా మోటార్స్ లు కూడా నష్టాల్లో కొనసాగాయి. ఇదే సమయంలో భారతీ ఇన్ ఫ్రాటెల్, ఐషర్ మోటార్స్, సన్ ఫార్మా, బీపీసీఎల్ లాభాలు ఆర్జించాయి. అటు డాలర్ తో రూపాయి మారకం విలువ 18 పైసలు పడిపోయి 64.68 వద్ద ముగిసింది. ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరలు 24 రూపాయల లాభంతో 29,217గా నమోదయ్యాయి.
Advertisement
Advertisement