స్టాక్ మార్కెట్ హైజంప్ | Sensex crosses 23000 level | Sakshi
Sakshi News home page

స్టాక్ మార్కెట్ హైజంప్

Published Sat, May 10 2014 1:36 AM | Last Updated on Fri, Nov 9 2018 5:30 PM

స్టాక్ మార్కెట్ హైజంప్ - Sakshi

స్టాక్ మార్కెట్ హైజంప్

ఆకాశమే హద్దుగా కొత్త రికార్డుల వెల్లువ

* 650 పాయింట్లు ఎగసిన సెన్సెక్స్  తొలిసారిగా 23,000కు
 * 200 పాయింట్లు దూసుకెళ్లిన నిఫ్టీ  6,859 పాయింట్ల వద్ద ముగింపు
 * దుమ్ముదులిపిన బ్యాంకింగ్ షేర్లు  మళ్లీ ఎఫ్‌ఐఐల పెట్టుబడుల జోరు

 
 ప్రస్తుత ఎన్నికల తర్వాత కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడుతుందన్న అంచనాలు స్టాక్ మార్కెట్లకు ప్రోత్సాహమిచ్చాయి. ఎగ్జిట్ పోల్ ఫలితాలు మరో రెండు రోజుల తర్వాత వెలువడనున్న నేపథ్యంలో ముందుగానే కొద్దిమంది బుల్ ఆపరేటర్లు డెరివేటివ్ విభాగంలో భారీ పొజిషన్లు తీసుకోవడం ద్వారా ఈ ర్యాలీకి కారణమయ్యారని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో ఆకాశమే హద్దుగా మార్కెట్లు హైజంప్ చేశాయి. మరోసారి కొత్త రికార్డులను సృష్టించాయి! స్టాక్ మార్కెట్ చరిత్రలో సెన్సెక్స్ తొలిసారి 23,000 పాయింట్లను అధిగమించగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 6,850ను దాటి ముగిసింది. ఈ బాటలో బ్యాంక్ నిఫ్టీ సైతం సరికొత్త గరిష్టం 13,810ను తాకడం విశేషం!
 
 సాధారణ ఇన్వెస్టర్లు, ట్రేడర్లను నిర్ఘాంత పరుస్తూ వారాంతం రోజున స్టాక్ మార్కెట్లు రివ్వున దూసుకెళ్లాయి. సెన్సెక్స్ 650 పాయింట్లు ‘హై’జంప్‌చేసి 22,994 పాయింట్ల ముగిసింది. ఇది సెప్టెంబర్ 2013 తరువాత అతిపెద్ద ర్యాలీకాగా, ఇంట్రాడేలో 704 పాయింట్లు ఎగసి 23,048 వద్ద గరిష్టాన్ని తాకింది. ఇక నిఫ్టీ కూడా 199 పాయింట్లు పుంజుకుని 6,859 వద్ద ముగిసింది. ఒక దశలో అత్యధికంగా 6,871ను తాకింది. ర్యాలీకి ప్రధానంగా బ్యాంకింగ్ దిగ్గజాలు దోహదపడ్డాయి. ఎన్‌ఎస్‌ఈ బ్యాంకింగ్ ఇండెక్స్ ఇంట్రాడేలో 13,810ను తాకి, చివరికి 13,750 వద్ద స్థిరపడింది. ఇక్కడ ప్రస్తావించదగ్గ విశేషమేమిటంటే ఇవన్నీ సరికొత్త రికార్డులే!! సెన్సెక్స్, నిఫ్టీ 3% చొప్పున పుంజుకోగా, బ్యాంక్ నిఫ్టీ, బీఎస్‌ఈ బ్యాంకెక్స్ 5.5% స్థాయిలో ఎగశాయి. ఈ బలంతో మార్కెట్లు సరికొత్త రికార్డులను నెలకొల్పాయి!!

 ర్యాలీకి కారణాలేంటి?
 ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎన్‌డీఏ మెజారిటీ సాధించి, అధికారంలోకి వస్తుందన్న గట్టి విశ్వాసాన్ని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడి వ్యక్తంచేయడం తాజా ర్యాలీకి కారణంగా కొంతమంది నిపుణులు విశ్లేషిస్తున్నారు. మార్కెట్లో కొద్దిరోజుల నుంచి షేర్లు కొంటున్న బలమైన ట్రేడర్లు ఒక్కసారిగా ముందస్తు ర్యాలీకి తెరలేపారని మరికొంతమంది నిపుణులు వాదిస్తున్నారు. మోడీ ప్రధాని కాగలరన్న అంచనాల తో గత ఆరు నెలలుగా మార్కెట్లు బలపడుతూ వచ్చిన సంగతి తెలిసిందే. కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటయితే సంస్కరణలు వేగమందుకుంటాయని, ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని మార్కెట్ వర్గాలు ఆశిస్తున్నాయి.

అయితే రెండు వారాలుగా ఎన్‌డీఏకు తగిన మెజారిటీ లభించకపోవచ్చునన్న ఊహలు కూడా మార్కెట్లలో వ్యాపించాయి. దీంతో అమ్మకాలు పెరిగి ఈ మధ్యకాలంలో మార్కెట్లు 2.5% వరకూ నష్టపోయాయి కూడా. కాగా, సోమవారం(12న) చివరి దశ పోలింగ్ జరిగాక ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి. నిజానికి వీటి ఆధారంగా మంగళవారం(13) నుంచి మార్కెట్లలో సందడి మొదలవుతుందని ఇన్వెస్టర్లు ఊహిస్తూ వచ్చారు. ఈలోపు అనూహ్యంగా శుక్రవారమే మార్కెట్లు భారీ స్థాయిలో పుంజుకున్నాయి.
 
 విశేషాలెన్నో...
* గత నాలుగు రోజుల్లో రూ. 810 కోట్లను మాత్రమే ఇన్వెస్ట్‌చేసిన ఎఫ్‌ఐఐలు ఒక్కసారిగా రూ. 1,269 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.
* బ్యాంక్ షేర్లలో ఐసీఐసీఐ బ్యాంక్ దాదాపు 7% ఎగసి రూ. 1,375 వద్ద ముగిసింది. తద్వారా 2008లో నమోదైన లైఫ్‌టైమ్ గరిష్టం రూ. 1,465కు చేరువైంది. యాక్సిస్ రూ. 1,632 వద్ద, కొటక్ మహీంద్రా బ్యాంక్ రూ. 852 వద్ద చరిత్రాత్మక గరిష్టాలను అందుకున్నాయి.
* యస్‌బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, పీఎన్‌బీ, ఇండస్‌ఇండ్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్‌బీఐ, కెనరా, ఫెడరల్ బ్యాంక్, బీవోబీ 9-3% మధ్య దూసుకెళ్లాయి.  
* ఆర్‌ఐఎల్ దాదాపు నాలుగేళ్ల గరిష్టం రూ. 997ను తాకగా, జేఅండ్‌కే బ్యాంక్, అరవింద్, బజాజ్ ఫైనాన్స్, శ్రీరాం సిటీ యూనియన్, ఐషర్ మోటార్స్ కూడా కొత్త రికార్డులను చేరాయి.
* ఎంఅండ్‌ఎం, కోల్ ఇండియా, హెచ్‌పీసీఎల్, ఇంజినీర్స్, జీఎస్‌పీఎల్, బజాజ్ ఫిన్‌సర్వ్ తదితర 154 షేర్లు ఏడాది గరిష్టాలను తాకాయి.
 హా సెన్సెక్స్‌లో టాటా పవర్, హిందాల్కో, భెల్, ఓఎన్‌జీసీ, మారుతీ, హెచ్‌డీఎఫ్‌సీ, ఆర్‌ఐఎల్, హీరోమోటో, టాటా స్టీల్, ఎల్‌అండ్‌టీ 5.6-3.3% మధ్య పురోగమించాయి.
* అన్ని రంగాల ఇండెక్స్‌లూ 1-5% మధ్య లాభపడగా, కేవలం ఫార్మా (0.5%) నష్టపోయింది.
* రియల్టీ, పవర్, క్యాపిటల్ గూడ్స్, ఆయిల్, మెటల్, ఆటో రంగాలు 4.5-2.5% ఎగశాయి.
* ఒక్క రోజులో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రూ. 1.5 లక్షల కోట్లమేర పెరిగి రూ. 76.43 లక్షల కోట్లకు చేరింది.
* నిఫ్టీలో 4, సెన్సెక్స్‌లో 3 షేర్లు మాత్రమే నష్టపోయాయంటే ర్యాలీ ఎంత బలంగా వచ్చిందీ అర్థం చేసుకోవచ్చు.
* రియల్టీలో హెచ్‌డీఐఎల్ 18% జంప్‌చేయగా, యూనిటెక్, డీబీ, ఇండియాబుల్స్, డీఎల్‌ఎఫ్, ఒబెరాయ్ 9-4% మధ్య దూసుకెళ్లాయి.
* ట్రేడైన షేర్లలో 1,610 లాభపడితే, కేవలం 1,146 నష్టపోయాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement