
మూడు వారాల కనిష్టానికి సెన్సెక్స్
♦ 170 పాయింట్ల క్షీణతతో 25,437 పాయింట్ల వద్ద ముగింపు
♦ జపాన్ మార్కెట్ పతన ప్రభావం
♦ క్యూ4 ఫలితాల పట్ల నిరుత్సాహం
ముంబై: జపాన్ మార్కెట్ భారీగా తగ్గడంతో పాటు దేశీయ కార్పొరేట్ల ఫలితాలు నిరుత్సాహపర్చడంతో బీఎస్‌ఈ సెన్సెక్స్ మూడు వారాల కనిష్టస్థాయికి పతనమయ్యింది. అలాగే దేశంలో తయారీ రంగ కార్యకలాపాలు తగ్గాయన్న వార్తలు కూడా సెంటిమెంట్‌ను దెబ్బతీసాయి. బ్యాంక్ ఆఫ్ జపాన్ తాజా ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించకపోవడంతో ఆ దేశపు మార్కెట్లో పతనం కొనసాగుతోంది. ఈ కేంద్ర బ్యాంక్ నిర్ణయం కారణంగా జపాన్ కరెన్సీ యెన్ పెరిగిపోయింది. దాంతో ఆ దేశంలో ఎగుమతి కంపెనీలు దెబ్బతినే అవకాశం వుండటంతో జపాన్ నికాయ్ సూచి సోమవారం మరో 3.11% పడిపోయింది. ఈ ప్రభావం భారత్ మార్కెట్‌పై పడిందని విశ్లేషకులు చెప్పారు. చైనాతో సహా పలు ప్రధాన ఆసియా మార్కెట్లకు సెలవు. ఏప్రిల్ నెలలో దేశంలో తయారీ రంగ కార్యకలాపాలు నెమ్మదించాయంటూ వెలువడిన పీఎంఐ గణాంకాలు మార్కెట్‌ను కోలుకోనీకుండా చేశాయని జియోజిత్ బీఎన్‌పీ పారిబాస్ చీఫ్ మార్కెట్ స్ట్రాటజిస్ట్ ఆనంద్ జేమ్స్ చెప్పారు.
టాప్ లూజర్ ఐసీఐసీఐ బ్యాంక్
క్యూ4లో నికరలాభం భారీగా తగ్గిన కారణంతో వరుసగా రెండో ట్రేడింగ్ రోజు కూడా ఐసీఐసీఐ బ్యాంక్ షేరు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యింది. సెన్సెక్స్-30లో అన్నింటికంటే ఈ షేరు అధికంగా 4 శాతం క్షీణించి రూ. 227 వద్ద ముగిసింది. ఈ ప్రభావం మిగిలిన బ్యాంక్ షేర్లపై కూడా పడటంతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎస్‌బీఐలు 1.35 శాతం చొప్పున తగ్గాయి. డాక్టర్ రెడ్డీస్ లాబ్స్ 2.66 శాతం, ఆదాని పోర్ట్స్ 1.93 శాతం, భారతి ఎయిర్‌టెల్ 1.64 శాతం, విప్రో 0.98 శాతం, ఇన్ఫోసిస్ 0.84 శాతం చొప్పున క్షీణించాయి. మరోవైపు సోమవారం కాస్త మెరుగైన ఫలితాలు వెల్లడించిన హెచ్‌డీఎఫ్‌సీ స్వల్ప పెరుగుదలతో ముగిసింది. పెరిగిన షేర్లలో బీహెచ్‌ఈఎల్, గెయిల్, హీరో మోటోకార్ప్‌లు వున్నాయి.