క్యూ3లో ఐపీవో స్పీడ్‌ | Analysts Said 35 Companies Are Expected To Go Public In Q3 | Sakshi
Sakshi News home page

క్యూ3లో ఐపీవో స్పీడ్‌

Published Wed, Oct 6 2021 1:07 AM | Last Updated on Wed, Oct 6 2021 1:07 AM

Analysts Said 35 Companies Are Expected To Go Public In Q3 - Sakshi

కొద్ది నెలలుగా సెకండరీ మార్కెట్‌ రేసు గుర్రంలా దౌడు తీస్తోంది. దీంతో మార్కెట్ల ప్రామాణిక ఇండెక్స్‌ సెన్సెక్స్‌ 60,000 పాయింట్ల మైలురాయిని సైతం అధిగమించింది. ఈ ప్రభావంతో మరోపక్క ప్రైమరీ మార్కెట్‌ సైతం స్పీడందుకుంది. ఇప్పటికే ఈ ఏడాది పలు కంపెనీలు స్టాక్‌ ఎక్సే్ఛంజీలలో లిస్ట్‌కాగా.. మరిన్ని సంస్థలు పబ్లిక్‌ ఇష్యూలకు సై అంటున్నాయి. వెరసి 2017లో ప్రైమరీ మార్కెట్‌ సాధించిన నిధుల సమీకరణ రికార్డ్‌ తుడిచిపెట్టుకుపోనున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వివరాలు చూద్దాం.. 

ముంబై: గతేడాదిని మించుతూ ఈ ఆర్థిక సంవత్సరం(2021–22)లోనూ పలు సుప్రసిద్ధ కంపెనీలు ఐపీవో బాట పట్టాయి. ఇందుకు వీలుగా క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాస్పెక్టస్‌లను దాఖలు చేస్తున్నాయి. ఇప్పటికే స్టాక్‌ ఎక్సే్ఛంజీలలో జొమాటోసహా పలు కంపెనీలు విజయవంతంగా లిస్ట్‌కాగా.. ఇకపైనా మరిన్ని సంస్థలు ప్రైమరీ మార్కెట్‌ తలుపు తట్టనున్నాయి. తద్వారా భారీ స్థాయిలో నిధుల సమీకరణకు సిద్ధపడుతున్నాయి. సుమారు 35 కంపెనీలు క్యూ3(అక్టోబర్‌–డిసెంబర్‌)లో పబ్లిక్‌ ఇష్యూలకు రానున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఉమ్మడిగా ఈ కంపెనీలు రూ. 80,000 కోట్లను సమకూర్చుకోనున్నట్లు అంచనా వేశారు. ఫలితంగా 2017లో ఐపీవోల ద్వారా 35 కంపెనీలు ఉమ్మడిగా సమీకరించిన రూ. 67,147 కోట్ల రికార్డు మరుగున పడనున్నట్లు అభిప్రాయపడ్డారు. ఇక బీమా రంగ ప్రభుత్వ దిగ్గజం ఎల్‌ఐసీ సైతం ఈ ఏడాదిలో లిస్టింగ్‌ను సాధిస్తే చరిత్రాత్మక రికార్డు నమోదవుతుందని తెలియజేశారు. 

పేటీఎమ్‌ భారీగా.. 
ఈ ఏడాది మూడో త్రైమాసికం(క్యూ3)లో పలు ప్రయివేట్‌ కంపెనీలు పబ్లిక్‌ లిమిటెడ్‌గా ఆవిర్భవించనున్నాయి. మార్కెట్లు నిలకడగా కొనసాగితే డిజిటల్‌ చెల్లింపుల దిగ్గజం పేటీఎమ్‌సహా 35 కంపెనీలు ఐపీవోలను చేపట్టనున్నట్లు బ్యాంకింగ్‌ వర్గాలు చెబుతున్నాయి. క్యూ3లో ఐపీవోకు రానున్న జాబితాలో రూ. 16,600 కోట్ల సమీకరణ లక్ష్యాన్ని ప్రకటించిన పేటీఎమ్‌ను ప్రధానంగా ప్రస్తావిస్తున్నాయి. అధిక స్థాయిలో నిధులను ఆశిస్తున్న ఇతర కంపెనీలలో ఆధార్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ (రూ. 7,300 కోట్లు), స్టార్‌ హెల్త్‌ అండ్‌ అల్లీడ్‌ ఇ న్సూరెన్స్‌(రూ. 7,000 కోట్లు), పాలసీ బజార్‌(రూ. 6,000 కోట్లు), హెల్త్‌కేర్‌ సంస్థ ఎమ్‌క్యూర్‌ ఫార్మా (రూ. 5,000 కోట్లు), వంటనూనెల దిగ్గజం అదానీ విల్మర్‌(రూ. 4,500 కోట్లు), బ్యూటీ ప్రొడక్టుల సంస్థ నైకా(రూ. 4,000 కోట్లు) తదితరాలున్నాయి.  

14 కంపెనీలు రెడీ 
క్యూ3లో లిస్టింగ్‌ బాట పట్టనున్న ఇతర సంస్థలలో పారదీప్‌ ఫాస్ఫేట్స్, వేదాంత్‌ ఫ్యాషన్స్, సీఎంఎస్‌ ఇన్ఫోసిస్టమ్స్, నార్తర్న్‌ ఆర్క్‌ సైతం ఉన్నట్లు మార్కెట్‌ వర్గాలు పేర్కొన్నాయి. ఈ సంస్థలు రూ. 2,000–2,500 కోట్ల స్థాయిలో నిధుల సమీకరణ చేపట్టే వీలున్నట్లు తెలియజేశాయి. ఇప్పటికే 14 కంపెనీలు సెబీ నుంచి అనుమతులు సైతం పొందాయి. వీటిలో పారదీప్‌ ఫాస్ఫేట్స్, గో ఎయిర్‌లైన్స్, రుచీ సోయా ఇండస్ట్రీస్, ఆరోహణ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్, ఉత్కర్‌‡్ష స్మాల్‌ ఫైనాన్స్, ఫిన్‌కేర్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ చేరాయి. ఇవి రూ. 22,000 కోట్లు సమకూర్చుకునే అవకాశముంది. ఈ బాటలో ఇప్పటికే మరో 64 కంపెనీలు సెబీ వద్ద ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేయడం గమనార్హం! నాణ్యమైన కంపెనీలు చేపట్టే ఐపీవోల కోసం కొంతమంది ఇన్వెస్టర్లు సెకండరీ మార్కెట్లో అమ్మకాలు చేపట్టే అవకాశమున్నట్లు ఈ సందర్భంగా మార్కెట్‌ నిపుణులు పేర్కొంటున్నారు. ఎల్‌ఐసీ వంటి భారీ ఇష్యూల సమయంలో సెకండరీ మార్కెట్లో కొంతమేర లిక్విడిటీ కొరత నెలకొనవచ్చని వివరించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement