ఆర్థిక సంవత్సరానికి లాభాలతో గుడ్‌ బై... | Sensex jumps 655 points on final trading day of FY24 | Sakshi
Sakshi News home page

ఆర్థిక సంవత్సరానికి లాభాలతో గుడ్‌ బై...

Published Fri, Mar 29 2024 4:18 AM | Last Updated on Fri, Mar 29 2024 4:18 AM

Sensex jumps 655 points on final trading day of FY24 - Sakshi

సెన్సెక్స్‌ 655 పాయింట్లు ప్లస్‌

22,250 స్థాయి పైకి నిఫ్టీ 

గుడ్‌ఫ్రైడే సందర్భంగా నేడు ఎక్స్ఛేంజిలకు సెలవు 

ముంబై: ఆర్థిక సంవత్సరం చివరి రోజైన గురువారం స్టాక్‌ సూచీలు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 655 పాయింట్లు పెరిగి 73,651 వద్ద ముగిసింది. నిఫ్టీ 203 పాయింట్లు బలపడి 22,327 వద్ద నిలిచింది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నుంచి సానకూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం లాభాలతో మొదలయ్యాయి. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి మీడియా మినహా అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది.

ఒక దశలో సెన్సెక్స్‌ 1,194 పాయింట్లు పెరిగి 74,190 వద్ద, నిఫ్టీ 392 పాయింట్లు బలపడి 22,516 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకున్నాయి. స్టాక్‌ మార్కెట్‌ సంబంధించి ఆర్థిక సంవత్సరం చివరి రోజు కావడంతో పాటు ఫారెక్స్‌ మార్కెట్లో బలహీనతల కారణంగా ఆఖర్లో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. దీంతో సూచీలు కొంతమేర ఆరంభ లాభాలు కోల్పోయాయి. సెన్సెక్స్‌ దాదాపు ఒకశాతం లాభపడటంతో బీఎస్‌ఈలో రూ.3.33 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. 

► సెన్సెక్స్‌ 30 షేర్లలో యాక్సిస్‌ బ్యాంక్‌ (0.50%), రిలయన్స్‌ (0.37%), హెచ్‌సీఎల్‌ (0.26%), టెక్‌ మహీంద్రా (0.25%) మాత్రమే నష్టపోయాయి. మిగిలిన 26 షేర్లూ లాభపడ్డాయి.
► బీఎస్‌ఈ, నిఫ్టీలు ఎంపిక చేసుకున్న షేర్లలో బీటా వెర్షన్‌ టి+0 ట్రేడ్‌ సెటిల్‌మెంట్‌ను ప్రారంభించాయి. తొలి రోజున రెండు ఎక్స్ఛేంజిల్లో 60 మందికి పైగా సభ్యులు పాల్గొన్నారు.  

నేడు ఎక్స్ఛేంజిలకు గుడ్‌ఫ్రైడే సెలవు. శని, ఆదివారాలు సాధారణ సెలవులు రోజులు కావడంతో ట్రేడింగ్‌ సోమవారం ప్రారంభం అవుతుంది. 

ర్యాలీ ఎందుకంటే  
ప్రత్యామ్నాయ పెట్టుబడి ఫండ్ల(ఏఐఎఫ్‌)లో రుణదాతల పెట్టుబడులపై గతంలో కఠిన ఆంక్షల విధించిన ఆర్‌బీఐ తాజాగా నిబంధనలను సులభతరం చేయడంతో అధిక వెయిటేజీ ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులతో పాటు ఫైనాన్స్‌ రంగాల షేర్లు రాణించాయి. మోర్గాన్‌ స్టాన్లీ వచ్చే ఆర్థిక సంవత్సరానికి గానూ భారత వృద్ధి అవుట్‌లుక్‌ను 6.5 శాతం నుంచి 6.8 శాతానికి అప్‌గ్రేడ్‌ చేసింది. ఇటీవల ఎఫ్‌ఐఐలు భారత ఈక్విటీల పట్ల కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారు. అమెరికా సూచీలు రికార్డు స్థాయిల్లో  ట్రేడవుతున్నాయి. ఆసియా, యూరప్‌ మార్కెట్లు 0.5% పెరిగాయి.  

2023– 24లో రూ.128 లక్షల కోట్ల సృష్టి  
దేశీయ స్టాక్‌ మార్కెట్‌ 2023–24లో గణనీయమైన లాభాలు పంచింది. సెన్సెక్స్‌ 14,660 పాయింట్లు (25%) ర్యాలీతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలో కంపెనీల మొత్తం విలువ ఏడాది వ్యవధిలో 128 లక్షల కోట్ల పెరిగి రూ.387 లక్షల కోట్లు చేరింది.  సెన్సెక్స్‌  మార్చి 7న 74,245 వద్ద జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. మార్చి 2న ఇన్వెస్టర్ల సంపద సైతం రూ.394 లక్షల వద్ద ఆల్‌టైం హైని తాకింది. ఇదే కాలంలో నిఫ్టీ 4,967 పాయింట్లు(29%) పెరిగింది. మార్చి 11న 22,526 వద్ద చరిత్రాత్మక గరిష్టాన్ని అందుకుంది. 2022–23లో 423 పాయింట్లు పెరిగినప్పటికీ ఇన్వెస్టర్లకు రూ. 5.86 లక్షల కోట్ల నష్టం వాటిల్లింది.   

కార్వికి సెబీ మరో షాక్‌
కార్వీ ఇన్వెస్టర్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌కు సెబీ మరో షాక్‌ ఇచ్చింది. అర్హత ప్రమాణాలను ఉల్లంఘించినందుకు మర్చంట్‌ బ్యాంకర్‌ రిజి్రస్టేషన్‌ను రద్దు చేసింది. 2023 మార్చి 15–17 తేదీల్లో కార్వీ ఇన్వెస్టర్‌ సర్విసెస్‌ను సెబీ బృందం  తనిఖీల నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకుంది. గతంలోనూ సెబీ కార్వీపై పలు చర్యలు తీసుకున్న సంగతి విదితమే.

ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ డీలిస్టింగ్‌ 
స్టాక్‌ ఎక్స్ఛేంజిల నుంచి డీలిస్ట్‌ చేసేందుకు 72 శాతం వాటాదారులు అనుమతించినట్లు ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ తాజాగా వెల్లడించింది. అయితే రిటైల్‌ ఇన్వెస్టర్లు ఈ పథకాన్ని వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొంది. డీలిస్టింగ్‌ తదుపరి మాతృ సంస్థ ఐసీఐసీఐ బ్యాంక్‌లో విలీనంకానున్నట్లు తెలియజేసింది. డీలిస్టింగ్‌ పథకంలో భాగంగా ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ వాటాదారులు తమ వద్దగల ప్రతీ 100 షేర్లకుగాను 67 ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లను పొందనున్నట్లు వెల్లడించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement