వరుసగా అయిదో రోజు
వరుసగా అయిదో రోజు కూడా నష్టాలు నమోదు చేస్తూ సెన్సెక్స్ శుక్రవారం స్వల్పంగా 14 పాయింట్లు కోల్పోయింది. దాదాపు నాలుగు వారాల కనిష్టమైన 22,403.89పాయింట్ల వద్ద ముగిసింది. మరోవైపు నిఫ్టీ 1.60 పాయింట్లు క్షీణించి 6,694.80 వద్ద ముగిసింది. లాభాల స్వీకరణ కొనసాగడం, ఏప్రిల్ మౌలిక రంగ గణాంకాలు ఒక మోస్తరుగానే ఉండటం ఇందుకు కారణమని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. లోక్‌సభ ఎన్నికల ఫలితాల వెల్లడికి ముందు ఇన్వెస్టర్లు ఆచి తూచి వ్యవహరిస్తున్నారని, లాభాల స్వీకరణకు దిగుతున్నారని మార్కెట్ ధోరణి చూస్తుంటే తెలుస్తోందని పరిశీలకులు తెలిపారు.
ఇక, ఏప్రిల్‌లో తయారీ రంగ గణాంకాలు ఒక మోస్తరుగానే ఉండటం సైతం మార్కెట్ సెంటిమెంటును బలహీనపర్చిందని బొనాంజా పోర్ట్‌ఫోలియో సంస్థ సీనియర్ రీసెర్చ్ అనలిస్టు నిధి సారస్వత్ వివరించారు. శుక్రవారం కొంత పటిష్టంగానే ప్రారంభమైన సెన్సెక్స్ స్వల్ప శ్రేణిలో తిరుగాడి చివరికి 0.06 శాతం నష్టంతో 22,403.89 వద్ద ముగిసింది. చివరిసారిగా ఏప్రిల్ 7న ఇది 22,343.45 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. మొత్తం మీద వారం రోజుల్లో సెన్సెక్స్ 619.71 పాయింట్లు కోల్పోయింది. ఒక వారంలో ఇంత భారీగా క్షీణించడం 13 వారాల్లో ఇదే ప్రథమం. ఇలా పెద్ద మార్పులు లేకుండా మార్కెట్లు క్లోజవడం ఇది వరుసగా నాలుగో వారం.
మార్కెట్లు గణనీయంగా పెరిగిపోయిన తర్వాత ఇన్వెస్టర్లు భారీ పెట్టుబడులు పెట్టేందుకు ఇష్టపడకపోతుండటాన్ని ఇది సూచిస్తోందని కోటక్ సెక్యూరిటీస్ హెడ్ దీపేన్ షా అభిప్రాయపడ్డారు. బీఎస్‌ఈలో 1,423 స్టాక్స్ లాభాల్లోనూ, 1,306 షేర్లు నష్టాల్లోనూ ముగిశాయి. టర్నోవరు రూ. 3,119.85 కోట్ల నుంచి రూ. 2,312.16 కోట్లకు క్షీణించింది. ఇక, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐ) నికరంగా 386.95 కోట్లు కొనుగోళ్లు చేయగా, దేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (డీఐఐ) రూ. 405.65 కోట్ల మేర అమ్మకాలు జరిపారు.
ఎఫ్‌ఎంసీజీ నుంచి తప్పుకుంటున్న ఎఫ్‌ఐఐలు...
కోల్గేట్, డాబర్, ఇమామీ వంటి ఎఫ్‌ఎంసీజీ కంపెనీల్లో ఎఫ్‌ఐఐలు వాటాలను క్రమక్రమంగా తగ్గించుకుంటారు. మరోవైపు డీఐఐలు మాత్రం కొంటున్నారు. జనవరి-మార్చి త్రైమాసికంలో జరిపిన విశ్లేషణలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 16 కంపెనీల వివరాలను పరిశీలించగా 11 సంస్థల్లో ఎఫ్‌ఐఐల వాటా తగ్గినట్లు తేలింది. వేల్యూయేషన్ల పరంగా ఇవి చాలా ఖరీదైనవిగా మారడమే ఇందుకు కారణమని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడ్డాయి.