రెండో రోజూ నష్టాలు
దేశీ స్టాక్ మార్కెట్లు తొలుత లాభాలతో మొదలైనప్పటికీ, చివరికి స్వల్ప నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 59 పాయింట్లు క్షీణించి 27,027 వద్ద ముగిసింది. నిఫ్టీ 9 పాయింట్లు తగ్గి 8,087 వద్ద నిలిచింది. గురువారం సైతం మార్కెట్లు ఇదే స్థాయిలో నష్టపోయిన సంగతి తెలిసిందే. యూరోపియన్ కేంద్ర బ్యాంక్ వడ్డీ రేట్లను తగ్గించడంతోపాటు, ఆర్థిక వ్యవస్థకు బలాన్నిచ్చే బాటలో సహాయక ప్యాకేజీలను అమలు చేయనున్నట్లు ప్రకటించడంతో అంతర్జాతీయంగా సెంటిమెంట్ బలహీనపడిందని విశ్లేషకులు పేర్కొన్నారు.
కాగా, వరుసగా రెండో రోజు జేపీ గ్రూప్ షేర్లు నేలకూలాయి. జేపీ అసోసియేట్స్ 11%, జేపీ ఇన్‌ఫ్రాటెక్ 7% చొప్పున పతనమయ్యాయి. దీంతో జేపీ అసోసియేట్స్ రెండు రోజుల్లో 30% దిగజారింది. ఓపెన్ మార్కెట్లో ప్రమోటర్లు షేర్లు విక్రయించడం ఇన్వెస్టర్లలో ఆందోళనలకు కారణమైంది. మార్కెట్లు నీరసించినప్పటికీ చిన్న షేర్లకు డిమాండ్ కనిపించింది.