సాక్షి, ముంబై: అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలకు తోడు, కరోనా భయాలతో దేశీయంగా అమ్మకాల వెల్లువతో కీలక సూచీ సెన్సెక్స్ 400 పాయింట్లకు పైగా కుప్పకూలింది. అటు మరోకీలక సూచీ నిఫ్టీ కూడా ప్రధాన మద్దతు స్థాయి 12000 దిగువకు చేరింది. ప్రస్తుతం సెన్సెక్స్ 337 పాయింట్లుపతనమై 40715 వద్ద, నిఫ్టీ 111 పాయింట్లు నష్టపోయి 11935 వద్ద కొనసాగుతోంది. దాదాపు అన్ని రంగాలు నష్ట పోతున్నాయి. భారతి ఇన్‌ఫ్రాటెల్, యస్ బ్యాంకు, టాటా మోటార్స్, ఇండస్‌ఇండ్ బ్యాంకు, భారతి ఎయిర్టెల్, హిందాల్కో, ఓఎన్‌జీసీ టాప్ లూజర్స్‌గా కొనసాగుతున్నాయి. మరోవైపు బీపీసీఎల్, జీ ఎంటర్ టైన్‌మెంట, కోల్ ఇండియా, ఇన్ఫోసిస్, ఐషర్ మోటార్స్, గెయిల్, టీసీఎస్ లాభపడుతున్నాయి.ఆఖరి గంట ట్రేడింగ్ కీలకం కానుంది.
బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండస్ ఇండ్ బ్యాంక్, యస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ నష్టాలతో నిఫ్టీ బ్యాంకు 1.38 శాతం నష్టపోయింది. అలాగే సర్దుబాటు చేసిన స్థూల రాబడి (ఎజిఆర్) బకాయిలను టెలి కమ్యూనికేషన్ విభాగానికి (డాట్) కొంత చెల్లింపులు చేశాయి. అయినా ఇన్వెస్టర్ల ఆందోళన నేపథ్యంలో వోడాఫోన్ ఐడియా 15 శాతం కుప్పకూలగా, భారతి ఎయిర్‌టెల్ 4 శాతం నష్టంతో కొనసాగుతోంది. కాగా చైనాలో వేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్ దాదాపు 1900 మందిని బలితీసుకోగా, 72వేలమందికి ఈ వ్యాధి సోకింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన కొనసాగుతోంది. దీనికి తోడు నూతన సంవత్సర సెలవు విరామం తర్వాత కర్మాగారాలు తిరిగి ప్రారంభించడంలో ఆలస్యం కావడంతో అంతర్జాతీయంగా సెంటిమెంట్ దెబ్బతింది. మరోవైపు ఈ వారం ట్రేడింగ్ 4 రోజులే కొనసాగనుంది. శివరాత్రి సందర్భంగా శుక్రవారం మార్కెట్లకు సెలవు కావడం గమనార్హం.
చదవండి : వేలాడుతున్న హెచ్1బీ కత్తి!
Comments
Please login to add a commentAdd a comment