
దేశీయ మార్కెట్ వరుసగా 3రోజూ లాభాలతో మొదలైంది. సెన్సెక్స్ 85 పాయింట్లు పెరిగి 30,904.29 వద్ద, నిఫ్టీ 13 పాయింట్ల లాభంతో 9,079.45 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. మార్కెట్ మొదలైనప్పటికి నుంచి కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఉదయం గం.9:20ని.లకు సెన్సెక్స్ 100 పాయింట్ల లాభంతో 30920 వద్ద, నిప్టీ 38 పాయింట్లు పెరిగి 9105 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఇదే సమయానికి అన్ని రంగాలకు చెందిన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. అత్యధికంగా బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగ షేర్లు లాభపడుతున్నాయి. బ్యాంకింగ్ రంగ షేర్ల ర్యాలీతో ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ 1శాతం లాభపడి 18వేల పైన 18,015.15 వద్ద ట్రేడ్ అవుతోంది.
లాక్‌డౌన్‌లోనూ కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టకపోవడంతో పాటు బజాజ్ ఫిన్ సర్వీసెస్, కోల్గేట్, హిందూస్థాన్ జింక్, బీఎస్‌ఈ, జుబిలెంట్ ఇండస్ట్రీస్, బిర్లా కార్ప్, క్విక్ హీల్, అప్‌టెక్ కంపెనీలతో పాటు సుమారు 13 కంపెనీలు తమ ఆర్థిక సంవత్సరపు మూడో త్రైమాసిక ఫలితాలను విడుదల నేపథ్యంలో ఇన్వెస్టర్ల అప్రమత్తత కారణంగా సూచీలు ఇంట్రాడే ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అంతర్జాతీయ మార్కెట్ల విషయాకొస్తే.., ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు తమ కరోనా వైరస్ లాక్డౌన్ పరిమితులను క్రమంగా సడలించడంతో గ్లోబల్ ఈక్విటీలు ఈ వారంలో ఇప్పటి వరకు సానుకూల ర్యాలీని చేస్తున్నాయి. అమెరికా మార్కెట్లు బుధవారం రాత్రి లాభాలతో ముగిశాయి. ఆ దేశ ఈక్విటీ మార్కెట్‌కు ఇది వరుసగా 5రోజుల లాభాల ముగింపు కావడం విశేషం. అలాగే నేడు ఆసియాలో ప్రధాన మార్కెట్లు స్వల్పలాభాలతో ట్రేడ్ అవుతున్నాయి. యూఎస్ క్రూడ్ నిల్వలు పడిపోవడంతో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు పెరిగాయి.
కోటక్ బ్యాంక్, యూపీఎల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, బజాజ్ అటో, ఇన్ఫ్రాటెల్ షేర్లు 1.50శాతం నుంచి 3.50శాతం లాభపడ్డాయి. బీపీసీఎల్, ఎన్‌టీపీసీ, అదానీ పోర్ట్స్, గ్రాసీం, శ్రీరామ్ సిమెంట్ షేర్లు 1శాతం నుంచి 2శాతం నష్టపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment