
సెన్సెక్స్ 33 పాయింట్లు అప్
రోజు మొత్తం హెచ్చుతగ్గులకులోనైన మార్కెట్లు చివరికి నామమాత్ర లాభాలతో ముగిశాయి. మార్కెట్ల ప్రామాణిక సూచీ సెన్సెక్స్ తొలుత లాభాలతో మొదలైంది. 162 పాయింట్ల వరకూ పెరిగి గరిష్టంగా 27,371ను చేరింది. ఆపై లాభాలు పోగొట్టుకోవడమేకాకుండా ఒక దశలో 117 పాయింట్లు జారి 27,091 వద్ద కనిష్టాన్ని తాకింది. క్రితం ముగింపు 27,209 కాగా, చివరికి 33 పాయింట్ల లాభంతో 27,242 వద్ద ముగిసింది.
నిఫ్టీ కూడా ఒడిదుడుకులను చవిచూసినప్పటికీ ట్రేడింగ్ ముగిసేసరికి 27 పాయింట్లు బలపడి 8,201 వద్ద స్థిరపడింది. ఫలితంగా కొత్త ఏడాదిలో తొలి(జనవరి) సిరీస్ లాభాలతో బోణీ కొట్టింది. వెరసి వరుస నష్టాలకు చెక్ పడింది. గత రెండు రోజుల్లో సెన్సెక్స్ 493 పాయింట్లు పతనమైన విషయం విదితమే.
ఐటీ, మెటల్ ఓకే
ప్రధానంగా రియల్టీ, ఐటీ, మెటల్ రంగాలు 0.5%పైగా పుంజుకోగా, ఎఫ్‌ఎంసీజీ ఇండెక్స్ అదే స్థాయిలో డీలాపడింది. సెన్సెక్స్ దిగ్గజాలలో హెచ్‌డీఎఫ్‌సీ, సెసాస్టెరిలైట్, టీసీఎస్, ఇన్ఫోసిస్, హిందాల్కో, సన్ ఫార్మా, టాటా స్టీల్, ఎల్‌అండ్‌టీ, ఎస్‌బీఐ 1-0.6% మధ్య లాభపడ్డాయి. మరోపక్క బ్లూచిప్ షేర్లు మారుతీ, బీహెచ్‌ఈఎల్, ఐటీసీ, హెచ్‌యూఎల్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఆటో, సిప్లా 1.3-0.4% మధ్య నష్టపోయాయి.