తీవ్ర హెచ్చుతగ్గులు...
♦ చివరకు 128 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్
♦ 8,200 దిగువన ముగిసిన నిఫ్టీ
ముంబై: ప్రపంచ ట్రెండ్ కారణంగా శుక్రవారం తీవ్ర హెచ్చుతగ్గులకు లోనైన బీఎస్‌ఈ సెన్సెక్స్ చివరకు 128 పాయింట్ల నష్టంతో ముగిసింది. ఆసియా మార్కెట్ల బలహీనత కారణంగా తొలుత మైనస్‌లో ప్రారంభమైన సెన్సెక్స్ మధ్యాహ్న సెషన్‌లో దాదాపు 200 పాయింట్లు పెరిగి 26,972 పాయింట్ల గరిష్టస్థాయికి ఎగిసింది. తదుపరి యూరప్ మార్కెట్లు డౌన్‌ట్రెండ్‌లో ప్రారంభమైన ప్రభావంతో ఇక్కడ సెన్సెక్స్ 26,620 పాయింట్ల కనిష్టస్థాయికి పడిపోయింది. చివరకు 128 పాయింట్ల నష్టంతో 26,636 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 33 పాయింట్లు నష్టపోయి 8,200 స్థాయి దిగువన 8,170 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. మూడువారాల్లో సూచీలకు ఇదే తొలి క్షీణత, ఈ వారం మొత్తమీద సెన్సెక్స్ 207 పాయింట్లు, నిఫ్టీ 51 పాయింట్ల చొప్పున నష్టపోయాయి.
ఫెడ్, బ్రిటన్ ఎగ్జిట్‌పై దృష్టి... అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వచ్చేవారంలో జరిపే సమీక్ష, యూరోపియన్ యూనియన్‌లో బ్రిటన్ వైదొలగాలా.. లేదా.. అనే అంశంపై జూన్ 23న జరిగే రిఫరెండం వంటి కారణాలతో ప్రపంచఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ట్రేడవుతున్నాయని విశ్లేషకులు చెప్పారు. మార్కెట్ సమీప గమనంపై ఇన్వెస్టర్లలో అయోమయం నెలకొనడంతో మన మార్కెట్ తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యిందని బీఎన్‌పీ పారిబాస్ ఫండ్ మేనేజర్ శ్రేయాష్ దేవల్కర్ తెలిపారు.