స్టాక్ మార్కెట్ దూసుకుపోతోంది. అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా ఉండటం, విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు కొనసాగుతుండటంతో బుధవారం స్టాక్ మార్కెట్ లాభపడింది. వరుసగా ఆరో రోజూ సెన్సెక్స్, నిఫ్టీలు ఎగువకే ఎగిశాయి. గత ఏడు నెలల కాలంలో సూచీలు ఇన్ని రోజులు లాభపడటం ఇదే మొదటిసారి. సెన్సెక్స్ కీలకమైన 34,000 పాయింట్లు, నిఫ్టీ 10,000 పాయింట్లపైకి ఎగబాకాయి. బ్యాంక్, ఆర్థిక రంగ షేర్ల జోరు కొనసాగింది. అయితే ట్రేడింగ్ చివర్లో లాభాల స్వీకరణ జరగడంతో సగం లాభాలు తగ్గాయి. సెన్సెక్స్ 284 పాయింట్ల లాభంతో 34,110 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 82 పాయింట్లు ఎగసి 10,062 పాయింట్ల వద్ద ముగిశాయి.
సగం తగ్గిన లాభాలు...
సెన్సెక్స్, నిఫ్టీలు లాభాల్లోనే ఆరంభమయ్యాయి. రోజంతా లాభాలు కొనసాగాయి. చివరి అరగంటలో లాభాల స్వీకరణ చోటుచేసుకుంది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 663 పాయింట్లు, నిఫ్టీ 197 పాయింట్ల మేర లాభపడ్డాయి.
మే నెల సేవల రంగం గణాంకాలు నిరుత్సాహకరంగా ఉండటం, డాలర్‌తో రూపాయి మారకం విలువ 11 పైసల నష్టపోయి 75.47కు చేరడం ఒకింత ప్రతికూల ప్రభావం చూపాయి. దీంతో ఇంట్రాడే లాభాలు దాదాపు సగం తగ్గాయి. నిఫ్టీ కీలకమైన మద్దతు స్థాయికి చేరినందున ఒడిదుడుకులు చోటు చేసుకోవచ్చని నిపుణులంటున్నారు.
ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు లాక్‌డౌన్‌ను సడలించడం, ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటుండటం, ఉద్దీపన ప్యాకేజీ వార్తలతో ప్రపంచ మార్కెట్లు పరుగులు పెడుతున్నాయి. అమెరికా–చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నా, కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నా, ప్రపంచ మార్కెట్లు లాభాల్లోనే ట్రేడవుతున్నాయి. చైనాలో తయారీ రంగం కరోనా మహమ్మారి ప్రబలడానికి ముందటి స్థాయికి చేరిందని మే నెల గణాంకాలు వెల్లడించడం మరింత ఊపునిచ్చింది. ఆసియా మార్కెట్లు 1–3 శాతం, యూరప్ మార్కెట్లు 2–3 శాతం లాబాల్లో ముగిశాయి.
► నిధుల సమీకరణ వార్తలతో మహీంద్రా అండ్ మహీంద్రా షేర్ 5 శాతం లాభంతో రూ. 485 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్ ఇదే.
► గత క్యూ4లో రూ.871 కోట్ల నష్టాలు వచ్చినా, భవిష్యత్తుపై ఆశావహ అంచనాలతో ఇండిగో షేర్ 8.4% లాభంతో రూ. 1,026 వద్ద ముగిసింది.
► 50కు పైగా షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలను తాకాయి. అరబిందో ఫార్మా, బ్రిటానియా ఇండస్ట్రీస్, ఆర్తి డ్రగ్స్, ఎస్కార్ట్స్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.
► హోటల్ షేర్ల లాభాలు కొనసాగుతున్నాయి. చాలెట్ హోటల్స్, లెమన్ ట్రీ హోటల్, ఈఐహెచ్, తాజ్‌జీవీకే షేర్లు 1–20% రేంజ్‌లో లాభపడ్డాయి.
► ఫేస్‌బుక్ జట్టుతో సారేగమ ఇండియా షేర్ 20% అప్పర్ సర్క్యూట్‌తో రూ.334 వద్ద ముగిసింది.
10,000పైకి నిఫ్టీ
Published Thu, Jun 4 2020 6:58 AM | Last Updated on Thu, Jun 4 2020 6:58 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment