రికార్డుల బాటలో ముగిసిన సెన్సెక్స్
ఇన్వెస్టర్ల కొనుగోళ్ల అండతో మార్కెట్ల జోరు కొనసాగుతోంది. వెరసి మరోసారి ప్రధాన ఇండెక్స్‌లు సరికొత్త రికార్డులకు తెరలేపాయి. 118 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్ 22,876 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో అత్యధికంగా 22,912ను తాకింది. ఇక నిఫ్టీ కూడా 25 పాయింట్లు బలపడి 6,841 వద్ద నిలిచింది. ఒక దశలో 6,862 వరకూ ఎగసింది. ఇవన్నీ చ రిత్రాత్మక గరిష్ట స్థాయిలే కావడం విశేషం! ఫలితంగా వరుసగా మూడో రోజు పాత రికార్డులు చెరిగిపోయాయి.
ప్రధానంగా బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్ రంగాలు 1%పైగా పుంజుకోగా, రియల్టీ అదే స్థాయిలో డీలా పడింది. ఓవైపు క్యూ4 ఫలితాలు, మరోవైపు కొత్త ప్రభుత్వంపై అంచనాలు సెంటిమెంట్‌కు బలాన్నిస్తున్నట్లు నిపుణులు తెలిపారు. ఎఫ్‌ఐఐలకుతోడు, రిటైల్ ఇన్వెస్టర్లు కూడా కొనుగోళ్లు చేపడుతుండటంతో మార్కెట్లు రోజుకో కొత్త రికార్డును నమోదు చేస్తున్నాయని విశ్లేషించారు. అయితే డాలరుతో మారకంలో రూపాయి బలహీనపడటంతో గరిష్ట స్థాయిల వద్ద కొంతమేర అమ్మకాలు చోటు చేసుకున్నట్లు తెలిపారు.
ఎఫ్‌ఐఐల జోష్
గత మూడు ట్రేడింగ్ రోజుల్లో రూ. 809 కోట్లను ఇన్వెస్ట్‌చేసిన ఎఫ్‌ఐఐలు జోరు పెంచారు. తాజాగా రూ. 768 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. అయితే దేశీయ ఫండ్స్ రూ. 534 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి.