మళ్లీ రయ్... రయ్
⇒ కొత్త రికార్డులకు మార్కెట్
⇒ లోతుకు పడినా తిరిగి రికవరీ
⇒ సెన్సెక్స్ 123 ప్లస్‌తో 29,682కు జంప్
⇒ నిఫ్టీ 38 కలుపుకుని 8,952కు అప్
మార్కెట్ అప్‌డేట్
ముంబై: బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్‌ఈ) 30 సెన్సెక్స్ ఒకరోజు వెనకడుగు తర్వాత... మళ్లీ రయ్యిన ముందుకు దూసుకుపోయింది. అంటే వరుసగా 8 రోజుల వరుస లాభాల తర్వాత బుధవారం స్వల్ప నష్టంలో ముగిసినప్పటికీ, గురువారం మళ్లీ లాభాలను నమోదుచేసుకుంది. 123 పాయింట్ల లా భంతో 28,682 వద్ద ముగిసింది. తద్వారా అటు ఇంట్రాడేలోనూ, ఇటు ముగింపులోనూ కొత్త చరిత్రాత్మక స్థాయిలను చూసింది.ఇక నిఫ్టీ వరుసగా 10వ ట్రేడింగ్ సెషన్‌లోనూ పురోగతిలో నిలిచింది. 38 పాయింట్లు కలుపుకుని 8,952 వద్ద ముగిసింది. నిఫ్టీ... గడచిన ఆరు రోజులుగా ఏరోజుకారోజు కొత్త ‘గరిష్ట స్థాయి’ రికార్డులను నమోదుచేసుకుంటూ వస్తోంది.
మొదట పడినా... తిరిగి పరుగు
బుధవారం ముగింపుకన్నా (29,559) 43 పాయింట్ల దిగువ స్థాయిలో 29,516 పాయింట్ల వద్ద గురువారం సెన్సెక్స్ ట్రేడింగ్ ప్రారంభమైంది. అటు తర్వాత ప్రాఫిట్ బుకింగ్‌తో మరింతగా 29,378కు పడిపోయింది. అటు తర్వాత రికవరీ బాట పట్టి 29,741 పాయింట్ల గరిష్ట స్థాయిలను తాకింది. చివరకు 123 పాయింట్ల లాభంతో ముగిసింది. తద్వారా ఇంట్రాడే, ముగింపుల్లో ఆల్‌టైమ్ హై రికార్డుల మోత మోగించింది. ఇక నిఫ్టీ ఇంట్రాడే హై 8,966 పాయింట్లకు ఎగసింది. చివరకు 38 పాయింట్ల లాభంతో సరిపెట్టుకుంది.
ప్రభావిత అంశాలు
అమెరికా ఫెడరల్ రిజర్వ్ అమెరికా ఆర్థిక వ్యవస్థపై వ్యక్తీకరించిన సానుకూల అంచనాలు... అలాగే తన పాలసీ విధానాన్ని యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించడం... జనవరి నెలకు సంబంధించి నెలవారీ ఈక్విటీ డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు నేపథ్యంలో నిర్దిష్ట బ్లూచిప్స్‌లో కొనుగోళ్లు జరిగాయి. కొన్ని సంస్థల ఫలితాలు అంచనాలకు అనుగుణంగా రావడం, పటిష్ట రీతిలో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచాయి. 30 షేర్ సెన్సెక్స్‌లో 17 లాభపడ్డాయి. 13 నష్టాలతో ముగిశాయి.
మ్యాన్ ఇన్‌ఫ్రా షేర్లు కొన్న ఝున్‌ఝున్ వాలా
ముంబై: టాప్ ఇన్వెస్టర్ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా 30 లక్షల మ్యాన్‌ఇన్‌ఫ్రాకన్‌స్ట్రక్షన్ కంపెనీ షేర్లను కొనుగోలు చేశారు. ఆ కంపెనీ ప్రమోటర్ మన్శి పరాగ్ షా నుంచి ఒక్కో షేర్‌ను రూ.36 చొప్పున 30 లక్షల షేర్లను కొనుగోలు చేశారు. ఇందుకు రూ.10.8 కోట్లు వెచ్చించారు. ఈ కోనుగోలు కారణంగా కంపెనీ షేర్ 20 శాతం (ఒక రోజులో అధిక శాతం పెరిగే పరిమితి ఇదే) వృద్ధితో రూ.43.20 వద్ద ముగిసింది.