నెల కనిష్టానికి మార్కెట్
- అమెరికా ఫెడ్ పాలసీ నేపథ్యం
- 66 పాయింట్ల నష్టంతో 28,438కు సెన్సెక్స్
- 15 పాయింట్ల మైనస్‌తో 8,633కు నిఫ్టీ
- మార్కెట్ అప్‌డేట్
ముంబై: బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్‌ఈ) సెన్సెక్స్ -30, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ -50 సోమవారం నెల కనిష్ట స్థాయికి పడ్డాయి. సెన్సెక్స్ 66 పాయింట్ల నష్టంలో 28,438 వద్ద ముగిసింది.
నిఫ్టీ 15 పాయింట్ల నష్టంతో 8,633 వద్దకు దిగింది. మార్కెట్ ట్రేడింగ్ మొత్తం భారీ ఒడిదుకుల మధ్య సాగి, చివరకు నష్టాల్లో ముగిసింది.
ఊగిసలాట..: ప్రారంభ ట్రేడింగ్‌లో 28,582 పాయింట్ల గరిష్టాన్ని తాకిన సెన్సెక్స్, బ్లూచిప్స్‌లో భారీ అమ్మకాల ఒత్తిడితో 28,384 కనిష్టానికి పడింది. చివరికి కొంత కోలుకుంది. ఇక నిఫ్టీ 8,664 గరిష్ట-8,612 కనిష్ట శ్రేణిలో కదలాడింది.
లాభ నష్టాల్లో..: 30 సెన్సెక్స్ షేర్లలో 19 నష్టాల్లో ముగిశాయి. రంగాల వారీ సూచీలను చూస్తే, మెటల్ (1.49%), ఎఫ్‌ఎంసీజీ (0.96%), కేపిటల్ గూడ్స్ (0.63%) నష్టపోయాయి. ఐటీ (1.1%), రియల్టీ (1.15%), టెక్ (0.52 %) పెరిగాయి. రిటైల్ ఇన్వెస్టర్ల అమ్మకాలతో స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ సూచీలు 0.87%, 0.34% చొప్పున పడ్డాయి. మొత్తం 1,859 స్టాక్స్ నష్టపోగా, 1,024 లాభపడ్డాయి. 126 స్థిరంగా ఉన్నాయి.
టర్నోవర్..: బీఎస్‌ఈలో మొత్తం టర్నోవర్ రూ.3,866 కోట్ల నుంచి రూ.3,233 కోట్లకు పడింది. ఎన్‌ఎస్‌ఈలో క్యాష్ టర్నోవర్ రూ. 16,726 కోట్లు. డెరివేటివ్స్‌లో ఈ విలువ రూ. 1,91,059 కోట్లు.
కారణం...!
బుధవారం అమెరికా ఫెడరల్ బ్యాంక్ సమావేశం, వడ్డీరేట్ల పెంపునకు సంబంధించి ఊహాగానాల నేపథ్యంలో మార్కెట్ నష్టంలో ముగిసింది. అమెరికా వడ్డీరేట్లు పెంచితే, భారత్ వంటి వర్థమాన మార్కెట్ల నుంచి విదేశీ సంస్థాగత పెట్టుబడులు వెనక్కు మళ్లవచ్చన్న ఆందోళన మార్కెట్‌లో నెలకొందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. శుక్రవారం కూడా సెన్సెక్స్ 427 పాయింట్లు నష్టపోయిన సంగతి విదితమే.
రిటైల్ ద్రవ్యోల్బణం పెరుగుదల ఇందుకు ప్రధాన కారణమని విశ్లేషణలు వినిపించాయి. సోమవారం విడుదలైన టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణం రేటు ‘మైనస్’గా ఉన్నా... ఆహార ద్రవ్యోల్బణం అధిక స్థాయిలోనే ఉండడం, దీనితో భారత్‌లో కీలక పాలసీ రేటు రెపో మరింత తగ్గబోదన్న ఊహాగానాలు కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసిందని కొందరి విశ్లేషణ.