సెన్సెక్స్‌కు 427 పాయింట్లు నష్టం
⇒ రేట్ల కోత ఉండదేమోనన్న అంచనాలు
⇒ బీమా, బ్యాంకింగ్ షేర్లలో లాభాల స్వీకరణ
⇒ అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు
⇒ ఈ వారంలో 3 శాతం నష్టపోయిన సెన్సెక్స్, నిఫ్టీలు
⇒ ఈ ఏడాది అత్యధిక నష్టపోయిన వారం ఇదే
⇒ మార్కెట్ అప్‌డేట్
రిటైల్ ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో పెరిగిన కారణంగా రేట్ల కోత ఆశలు ఆవిరి కావడంతో స్టాక్ మార్కెట్ శుక్రవారం భారీగా పతనమైంది. అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు పోటెత్తాయి. గురువారం బాగా పెరిగిన బీమా, బ్యాంకింగ్ షేర్లలో కూడా లాభాల స్వీకరణ జరిగింది. దీంతో బీఎస్‌ఈ సెన్సెక్స్ 427 పాయింట్లు, నిఫ్టీ 128 పాయింట్లు నష్టపోయాయి.
అత్యధిక నష్టవారం’
గురువారం నాటి ముగింపు(28,930 పాయింట్లు)తో పోల్చితే బీఎస్‌ఈ సెన్సెక్స్ 205 పాయింట్ల లాభంతో (29,135 పాయింట్ల వద్ద) ప్రారంభమైంది. సానుకూలంగా ఉన్న అంతర్జాతీయ సంకేతాలకు, దీర్ఘకాలంలో పెండింగ్‌లో ఉన్న బీమా బిల్లు రాజ్యసభ ఆమోదం పొందడం, పారిశ్రామికోత్పత్తి గణాంకాలు అంచనాలను మించడం కూడా తోడవడంతో సెన్సెక్స్ 29,000 పాయింట్లను దాటేసింది. ఇంట్రాడేలో 29,184 పాయింట్ల గరిష్ట స్థాయి (253 పాయింట్లు లాభం)ను తాకింది.
అయితే ఫిబ్రవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం మూడు నెలల గరిష్టానికి చేరడం ట్రేడింగ్‌పై ప్రభావం చూపింది. రూపాయి పతనం, లాభాల స్వీకరణ కారణంగా దీంతో ప్రారంభ ఉత్సాహం ఆవిరైంది. ఈ నెలలో కూడా ద్రవ్యోల్బణం పెరిగే అవకాశాలున్నాయని, దీంతో వచ్చే నెల ద్రవ్యపరపతి విధానంలో ఆర్‌బీఐ కీలక రేట్లను తగ్గించకపోవచ్చన్న ఆందోళన స్టాక్ మార్కెట్‌ను పడేసింది.
ఈ నేపథ్యంలో సెన్సెక్స్ 28,448 పాయింట్ల కనిష్ట స్థాయికి (482 పాయింట్ల నష్టం) పడిపోయింది. చివరకు 427 పాయింట్ల నష్టంతో(1.48 శాతం) 28,503 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారంలో సెన్సెక్స్ మొత్తం 946 పాయింట్లు నష్టపోయింది. ఇక నిఫ్టీ 8,850-8,632 పాయింట్ల గరిష్ట, కనిష్ట స్థాయిల మధ్య కదలాడి చివరకు 128 పాయింట్లు నష్టపోయి 8,648 పాయింట్లు వద్ద ముగిసింది. ఈ వారంలో సెన్సెక్స్, నిఫ్టీలు 3.2 శాతం చొప్పున తగ్గాయి. ఈ ఏడాది భారీగా నష్టపోయిన వారం ఇదే.