Shear rates
-
సెన్సెక్స్‌కు 427 పాయింట్లు నష్టం
⇒ రేట్ల కోత ఉండదేమోనన్న అంచనాలు ⇒ బీమా, బ్యాంకింగ్ షేర్లలో లాభాల స్వీకరణ ⇒ అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు ⇒ ఈ వారంలో 3 శాతం నష్టపోయిన సెన్సెక్స్, నిఫ్టీలు ⇒ ఈ ఏడాది అత్యధిక నష్టపోయిన వారం ఇదే ⇒ మార్కెట్ అప్డేట్ రిటైల్ ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో పెరిగిన కారణంగా రేట్ల కోత ఆశలు ఆవిరి కావడంతో స్టాక్ మార్కెట్ శుక్రవారం భారీగా పతనమైంది. అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు పోటెత్తాయి. గురువారం బాగా పెరిగిన బీమా, బ్యాంకింగ్ షేర్లలో కూడా లాభాల స్వీకరణ జరిగింది. దీంతో బీఎస్ఈ సెన్సెక్స్ 427 పాయింట్లు, నిఫ్టీ 128 పాయింట్లు నష్టపోయాయి. అత్యధిక నష్టవారం’ గురువారం నాటి ముగింపు(28,930 పాయింట్లు)తో పోల్చితే బీఎస్ఈ సెన్సెక్స్ 205 పాయింట్ల లాభంతో (29,135 పాయింట్ల వద్ద) ప్రారంభమైంది. సానుకూలంగా ఉన్న అంతర్జాతీయ సంకేతాలకు, దీర్ఘకాలంలో పెండింగ్‌లో ఉన్న బీమా బిల్లు రాజ్యసభ ఆమోదం పొందడం, పారిశ్రామికోత్పత్తి గణాంకాలు అంచనాలను మించడం కూడా తోడవడంతో సెన్సెక్స్ 29,000 పాయింట్లను దాటేసింది. ఇంట్రాడేలో 29,184 పాయింట్ల గరిష్ట స్థాయి (253 పాయింట్లు లాభం)ను తాకింది. అయితే ఫిబ్రవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం మూడు నెలల గరిష్టానికి చేరడం ట్రేడింగ్‌పై ప్రభావం చూపింది. రూపాయి పతనం, లాభాల స్వీకరణ కారణంగా దీంతో ప్రారంభ ఉత్సాహం ఆవిరైంది. ఈ నెలలో కూడా ద్రవ్యోల్బణం పెరిగే అవకాశాలున్నాయని, దీంతో వచ్చే నెల ద్రవ్యపరపతి విధానంలో ఆర్బీఐ కీలక రేట్లను తగ్గించకపోవచ్చన్న ఆందోళన స్టాక్ మార్కెట్‌ను పడేసింది. ఈ నేపథ్యంలో సెన్సెక్స్ 28,448 పాయింట్ల కనిష్ట స్థాయికి (482 పాయింట్ల నష్టం) పడిపోయింది. చివరకు 427 పాయింట్ల నష్టంతో(1.48 శాతం) 28,503 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారంలో సెన్సెక్స్ మొత్తం 946 పాయింట్లు నష్టపోయింది. ఇక నిఫ్టీ 8,850-8,632 పాయింట్ల గరిష్ట, కనిష్ట స్థాయిల మధ్య కదలాడి చివరకు 128 పాయింట్లు నష్టపోయి 8,648 పాయింట్లు వద్ద ముగిసింది. ఈ వారంలో సెన్సెక్స్, నిఫ్టీలు 3.2 శాతం చొప్పున తగ్గాయి. ఈ ఏడాది భారీగా నష్టపోయిన వారం ఇదే. -
రిటైల్ ధరలు పెరిగాయ్..
- ఫిబ్రవరి రిటైల్ ద్రవ్యోల్బణం 5.37 % - వరుసగా మూడో నెలా పైపైకి.. రేట్ల కోత ఆశలపై నీళ్లు..! న్యూఢిల్లీ: వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో 5.37 శాతంగా నమోదయ్యింది. అంటే ఈ బాస్కెట్‌లోని మొత్తం వస్తువుల ధరలు 2014 ఫిబ్రవరితో పోల్చితే 2015 ఫిబ్రవరిలో 5.37 శాతం పెరిగాయన్నమాట. నవంబర్‌లో 4.38 శాతంగా ఉన్న ఈ రేటు అటు తర్వాతి నెలల్లో క్రమంగా పెరుగుతూ వస్తోంది. డిసెంబర్లో 5 శాతంగా, జనవరిలో 5.11 శాతంగా నమోదయ్యింది. వరుసగా మూడు నెలల నుంచీ ఈ రేటు పెరుగుతూ వస్తున్నందున, ఇక ఇప్పట్లో మరోదఫా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటు (బ్యాంకులకు తాను స్వల్పకాలికంగా ఇచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు) కోతకు అవకాశం లేదని పలువురు ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. తాజాగా విడుదలైన జనవరి పారిశ్రామిక వృద్ధి రేటు గణాంకాలు కూడా రేట్ల కోతకు అవకాశం లేని అంశమేనన్నది వారి వాదన. నిత్యావసరాల భారం ఆహారం, పానీయాల ధరలు 6.76 శాతం ఎగశాయి. ఇక్కడ ఒక్క ఆహార ఉత్పత్తులను చూస్తే ధరలు 6.79 శాతం పెరిగాయి. పెరిగిన ఉత్పత్తుల్లో కూరగాయలు (13.01%), పప్పు దినుసులు (10.61శాతం), పాలు-సంబంధిత ఉత్పత్తులు (9.21 శాతం), సుగంధ ద్రవ్యాలు (9.16 శాతం), పండ్లు (8.93 శాతం), ప్రెపేర్డ్ మీల్స్ (7.41 శాతం), మాంసం, చేపలు (5.03 శాతం), ఆల్కాహాలేతర పానీయాలు (4.62 శాతం), తృణ ధాన్యాలు (2.91 శాతం) ఉన్నాయి. -
ఈ షాక్ పాలసీది కాదు.. ఎన్‌పీఏలదే!
గతనెల 15న ఆర్బీఐ రేట్ల కోత నిర్ణయాన్ని వెలువరించాక స్టాక్‌మార్కెట్లు బీభత్సంగా పెరిగాయి. మంగళవారం నాటి సమీక్షలో ఏ కోతా లేకపోయేసరికి మార్కెట్లు క్షీణించాయి. ఈ రెండు సందర్భాల్లోనూ కీలకపాత్ర పోషించింది బ్యాంకు షేర్లే. మంగళవారం ప్రధాన బ్యాంకులైన ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు క్షీణించి జనవరి 14నాటి కనిష్ట స్థాయికి పడిపోయాయి. 15 నుంచి దాదాపు 10శాతం పెరగ్గా మళ్లీ దాన్ని కోల్పోయాయి. మంగళవారం ప్రధాన సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు స్వల్పంగా నష్టపోయినా బ్యాంకింగ్ ఇండెక్స్ మాత్రం 2.5 శాతంపైనే నష్టపోయింది. ఆర్బీఐ నిర్ణయంపై నిరాశకంటే బ్యాంకుల ఎన్పీఏలు పెరిగిపోవడమే దీనికి కారణమన్నది విశ్లేషకుల మాట. పెరుగుతున్న ఎన్పీఏలు... బ్యాంకులు కొద్దిరోజులుగా వెలువరించిన ఆర్థిక ఫలితాలు చూస్తే... వాటి స్థూల, నికర ఎన్పీఏలు బాగా పెరిగిపోయాయి. ఐసీఐసీఐ స్థూల ఎన్పీఏ 3 శాతాన్ని మించిపోగా, ఆర్బీఐ పరపతి విధాన సమీక్షనాడే ఫలితాలు వెల్లడించిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్థూల ఎన్పీఏ దాదాపు 6 శాతాన్ని చేరిపోయింది. అందుకే ఈ షేరు 8 శాతం పతనమై 10 నెలల కనిష్టస్థాయికి చేరింది. వారం రోజులుగా బ్యాంకుల ఆర్థిక ఫలితాలతో బ్యాంకింగ్ ఇండెక్స్ ఇటీవలి రికార్డు గరిష్టస్థాయి నుంచి 7% నష్టపోయింది. కానీ ప్రధాన సూచీల నష్టం 3 శాతంలోపే ఉంది. ఎస్ఎల్ఆర్ తగ్గించటమంటే... చట్టబద్ధ లిక్విడిటీ నిష్పత్తిని (ఎస్ఎల్ఆర్) అరశాతం తగ్గించడం వల్ల వడ్డీ రేట్లు తగ్గే అవకాశం లేదు. ఇపుడు ఎస్ఎల్ఆర్ పరిమితి 22 శాతం ఉండగా... తాజా కోతతో 21.5 శాతానికి చేరింది. అంటే బ్యాంకులు తమ నిధుల్లో కనీసం 21.5 శాతాన్ని ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడిగా పెట్టాలి. నిజానికి ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉన్నందున రుణాలకు డిమాండ్ లేదు. మరోవైపు వివిధ రంగాల నుంచి మొండి బకాయిలు పెరిగిపోతున్నాయి. దాంతో పలు బ్యాంకులు రిస్క్ లేకుండా 7-8 శాతం రాబడి వచ్చే ప్రభుత్వ బ్యాండ్లలోనే అత్యధికంగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఇది 22 శాతాన్ని మించే ఉంటోంది. దీంతో ఎస్ఎల్ఆర్ను తగ్గించడం వల్ల బ్యాంకులు మరో రూ.40,000 కోట్లు బాండ్ల నుంచి బయటకు తెచ్చుకునే అవకాశం ఉన్నా... రిస్క్‌లేని పెట్టుబడులవైపు చూస్తున్న ప్రభుత్వ బ్యాంకులు ఈ సదుపాయాన్ని ఇప్పట్లో వినియోగించుకునే అవకాశం లేదు. కొన్ని ప్రైవేటు బ్యాంకులు మాత్రం కొంత ఎస్ఎల్ఆర్ పెట్టుబడిని వెనక్కు తీసుకొని ఫిబ్రవరి-మార్చిల్లో సహజంగా బ్యాంకింగ్ వ్యవస్థలో ఏర్పడే లిక్విడిటీ కొరతను అధిగమించవచ్చు.