ఈ షాక్ పాలసీది కాదు.. ఎన్‌పీఏలదే!
గతనెల 15న ఆర్‌బీఐ రేట్ల కోత నిర్ణయాన్ని వెలువరించాక స్టాక్‌మార్కెట్లు బీభత్సంగా పెరిగాయి. మంగళవారం నాటి సమీక్షలో ఏ కోతా లేకపోయేసరికి మార్కెట్లు క్షీణించాయి. ఈ రెండు సందర్భాల్లోనూ కీలకపాత్ర పోషించింది బ్యాంకు షేర్లే. మంగళవారం ప్రధాన బ్యాంకులైన ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు క్షీణించి జనవరి 14నాటి కనిష్ట స్థాయికి పడిపోయాయి. 15 నుంచి దాదాపు 10శాతం పెరగ్గా మళ్లీ దాన్ని కోల్పోయాయి. మంగళవారం ప్రధాన సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు స్వల్పంగా నష్టపోయినా బ్యాంకింగ్ ఇండెక్స్ మాత్రం 2.5 శాతంపైనే నష్టపోయింది. ఆర్‌బీఐ నిర్ణయంపై నిరాశకంటే బ్యాంకుల ఎన్‌పీఏలు పెరిగిపోవడమే దీనికి కారణమన్నది విశ్లేషకుల మాట.
పెరుగుతున్న ఎన్‌పీఏలు...
బ్యాంకులు కొద్దిరోజులుగా వెలువరించిన ఆర్థిక ఫలితాలు చూస్తే... వాటి స్థూల, నికర ఎన్‌పీఏలు బాగా పెరిగిపోయాయి. ఐసీఐసీఐ స్థూల ఎన్‌పీఏ 3 శాతాన్ని మించిపోగా, ఆర్‌బీఐ పరపతి విధాన సమీక్షనాడే ఫలితాలు వెల్లడించిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్థూల ఎన్‌పీఏ దాదాపు 6 శాతాన్ని చేరిపోయింది. అందుకే ఈ షేరు 8 శాతం పతనమై 10 నెలల కనిష్టస్థాయికి చేరింది. వారం రోజులుగా బ్యాంకుల ఆర్థిక ఫలితాలతో బ్యాంకింగ్ ఇండెక్స్ ఇటీవలి రికార్డు గరిష్టస్థాయి నుంచి 7% నష్టపోయింది. కానీ ప్రధాన సూచీల నష్టం 3 శాతంలోపే ఉంది.
ఎస్‌ఎల్‌ఆర్ తగ్గించటమంటే...
చట్టబద్ధ లిక్విడిటీ నిష్పత్తిని (ఎస్‌ఎల్‌ఆర్) అరశాతం తగ్గించడం వల్ల వడ్డీ రేట్లు తగ్గే అవకాశం లేదు. ఇపుడు ఎస్‌ఎల్‌ఆర్ పరిమితి 22 శాతం ఉండగా... తాజా కోతతో 21.5 శాతానికి చేరింది. అంటే బ్యాంకులు తమ నిధుల్లో కనీసం 21.5 శాతాన్ని ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడిగా పెట్టాలి. నిజానికి ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉన్నందున రుణాలకు డిమాండ్ లేదు. మరోవైపు వివిధ రంగాల నుంచి మొండి బకాయిలు పెరిగిపోతున్నాయి. దాంతో పలు బ్యాంకులు రిస్క్ లేకుండా 7-8 శాతం రాబడి వచ్చే ప్రభుత్వ బ్యాండ్లలోనే అత్యధికంగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఇది 22 శాతాన్ని మించే ఉంటోంది. దీంతో ఎస్‌ఎల్‌ఆర్‌ను తగ్గించడం వల్ల బ్యాంకులు మరో రూ.40,000 కోట్లు బాండ్ల నుంచి బయటకు తెచ్చుకునే అవకాశం ఉన్నా... రిస్క్‌లేని పెట్టుబడులవైపు చూస్తున్న ప్రభుత్వ బ్యాంకులు ఈ సదుపాయాన్ని ఇప్పట్లో వినియోగించుకునే అవకాశం లేదు. కొన్ని ప్రైవేటు బ్యాంకులు మాత్రం కొంత ఎస్‌ఎల్‌ఆర్ పెట్టుబడిని వెనక్కు తీసుకొని ఫిబ్రవరి-మార్చిల్లో సహజంగా బ్యాంకింగ్ వ్యవస్థలో ఏర్పడే లిక్విడిటీ కొరతను అధిగమించవచ్చు.