రిటైల్ ధరలు పెరిగాయ్..
- ఫిబ్రవరి రిటైల్ ద్రవ్యోల్బణం 5.37 %
- వరుసగా మూడో నెలా పైపైకి.. రేట్ల కోత ఆశలపై నీళ్లు..!
న్యూఢిల్లీ: వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో 5.37 శాతంగా నమోదయ్యింది. అంటే ఈ బాస్కెట్‌లోని మొత్తం వస్తువుల ధరలు 2014 ఫిబ్రవరితో పోల్చితే 2015 ఫిబ్రవరిలో 5.37 శాతం పెరిగాయన్నమాట. నవంబర్‌లో 4.38 శాతంగా ఉన్న ఈ రేటు అటు తర్వాతి నెలల్లో క్రమంగా పెరుగుతూ వస్తోంది.
డిసెంబర్‌లో 5 శాతంగా, జనవరిలో 5.11 శాతంగా నమోదయ్యింది. వరుసగా మూడు నెలల నుంచీ ఈ రేటు పెరుగుతూ వస్తున్నందున, ఇక ఇప్పట్లో మరోదఫా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటు (బ్యాంకులకు తాను స్వల్పకాలికంగా ఇచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు) కోతకు అవకాశం లేదని పలువురు ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. తాజాగా విడుదలైన జనవరి పారిశ్రామిక వృద్ధి రేటు గణాంకాలు కూడా రేట్ల కోతకు అవకాశం లేని అంశమేనన్నది వారి వాదన.
నిత్యావసరాల భారం
ఆహారం, పానీయాల ధరలు 6.76 శాతం ఎగశాయి. ఇక్కడ ఒక్క ఆహార ఉత్పత్తులను చూస్తే ధరలు 6.79 శాతం పెరిగాయి. పెరిగిన ఉత్పత్తుల్లో కూరగాయలు (13.01%), పప్పు దినుసులు (10.61శాతం), పాలు-సంబంధిత ఉత్పత్తులు (9.21 శాతం), సుగంధ ద్రవ్యాలు (9.16 శాతం), పండ్లు (8.93 శాతం), ప్రెపేర్డ్ మీల్స్ (7.41 శాతం), మాంసం, చేపలు (5.03 శాతం), ఆల్కాహాలేతర పానీయాలు (4.62 శాతం), తృణ ధాన్యాలు (2.91 శాతం) ఉన్నాయి.