ప్రభుత్వ షేర్ల హవా
* 241 పాయింట్లు అప్
* 24,363 వద్దకు సెన్సెక్స్
* నిఫ్టీ 60 పాయింట్లు ప్లస్
* 7,264 వద్ద ముగింపు
* కొత్త గరిష్ట స్థాయిలివి!
* పవర్, క్యాపిటల్ గూడ్స్ జోరు
* ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, హెల్త్‌కేర్ డీలా
కేంద్రంలో బీజేపీ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుండటంతో ప్రభుత్వ రంగ షేర్లకు ఊపొచ్చింది. గత కొన్నేళ్లుగా విధానపరమైన నిర్ణయాలు కుంటుపడటంతో అటు ఆర్థిక వ్యవస్థతోపాటు, ఇటు ప్రభుత్వ రంగ షేర్లు సైతం వెలుగు కోల్పోయాయి. మోడీ అధ్యక్షతన ఏర్పడనున్న కొత్త ప్రభుత్వం సంస్కరణలు వేగవంతం చేయడం వంటి చర్యల ద్వారా ఆర్థిక వృద్ధికి జోష్‌నిస్తుందన్న అంచనాలు ప్రభుత్వ షేర్లకు డిమాండ్ పెంచాయని నిపుణులు పేర్కొన్నారు.
వీటితోపాటు, పవర్, ఇన్‌ఫ్రా రంగాలు వెలుగులో నిలిచాయి. వెరసి వరుసగా మూడో రోజు మార్కెట్ లాభాలను ఆర్జించింది. 241 పాయింట్లు ఎగసిన సెన్సెక్స్ 24,363 వద్ద నిలవగా, 60 పాయింట్లు పుంజుకున్న నిఫ్టీ 7,264 వద్ద స్థిరపడింది. మార్కెట్ చరిత్రలో ఇండెక్స్‌లు ఈ స్థాయిలో ముగియడం ఇదే తొలిసారి! కాగా, ఎఫ్‌ఐఐల పెట్టుబడులు కొనసాగాయి. ఎఫ్‌ఐఐలు రూ. 1,350 కోట్లను ఇన్వెస్ట్‌చేయగా, దేశీ ఫండ్స్ నికరంగా రూ. 348 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి.
భెల్ దూకుడు
బీఎస్‌ఈలో పవర్, క్యాపిటల్ గూడ్స్, రియల్టీ, మెటల్ రంగాలు 10-7% మధ్య జంప్ చేయడం విశేషంకాగా, బ్యాంకెక్స్ సైతం 3% లాభపడింది. అయితే మరోవైపు ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, హెల్త్‌కేర్ 5-4% మధ్య పతనమయ్యాయి. ప్రభుత్వ షేర్లలో విద్యుత్ రంగ దిగ్గజం బీహెచ్‌ఈఎల్ 17% దూసుకెళ్లగా, కోల్ ఇండియా 13%, ఎన్‌టీపీసీ 10%, ఓఎన్‌జీసీ 8% చొప్పున ఎగశాయి. ఇండొనేషియాలో 200 మెగావాట్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రాథమిక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం భెల్‌కు జోష్‌నిచ్చింది.
ఈ బాటలో ఇతర పీఎస్‌యూ షేర్లు ఎంఎంటీసీ, బీఈఎంఎల్, షిప్పింగ్ కార్పొరేషన్, హిందుస్తాన్ కాపర్, నైవేలీ లిగ్నైట్, పీటీసీ, ఆర్‌సీఎఫ్, ఎఎఫ్‌సీ, ఎన్‌హెచ్‌పీసీ, ఆర్‌ఈసీ, ఎంవోఐఎల్, కంటెయినర్ కార్పొరేషన్, సెయిల్ 20-10% మధ్య పురోగమించాయి. వీటితోపాటు రియల్టీ షేర్లు యూనిటెక్, అనంత్‌రాజ్, డీబీ, డీఎల్‌ఎఫ్, గోద్రెజ్ ప్రాపర్టీస్, ఇండియాబుల్స్, ప్రెస్టేజ్ ఎస్టేట్స్, హెచ్‌డీఐఎల్, ఫీనిక్స్ 11-5% మధ్య పుంజుకున్నాయి.
టీసీఎస్ 6% పతనం
ఇతర సెన్సెక్స్ దిగ్గజాలలో టాటా పవర్, హిందాల్కో, ఎల్‌అండ్‌టీ, ఎస్‌బీఐ, సెసాస్టెరిలైట్, యాక్సిస్, ఆర్‌ఐఎల్, హెచ్‌డీఎఫ్‌సీ 8-3.5% మధ్య లాభపడగా, గత కొంత కాలంగా మార్కెట్లను శాసించిన ఐటీ, ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ దిగ్గజాలు అమ్మకాలతో నీరసించాయి. టీసీఎస్ 6% పతనంకాగా, ఐటీసీ, డాక్టర్ రెడ్డీస్, ఇన్ఫోసిస్, సన్ ఫార్మా, విప్రో, హెచ్‌యూఎల్ 5-4% మధ్య తిరోగమించాయి. ఈ బాటలో వోకార్డ్, ఇప్కా, గ్లెన్‌మార్క్, లుపిన్, ర్యాన్‌బాక్సీ, అరబిందో, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్, మైండ్‌ట్రీ సైతం 7-4% మధ్య దిగజారాయి. ఇటీవల పుంజుకుంటూ వస్తున్న రూపాయి తాజాగా డాలరుతో మారకంలో 11 నెలల గరిష్టం 58.37కు చేరడంతో ఐటీ, హెల్త్‌కేర్ షేర్లలో అమ్మకాలు పెరిగినట్లు నిపుణులు విశ్లేషించారు.