సాక్షి, ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో ముగిసాయి. కానీ ఆరంభ లాభాలను కుదించుకోవడంతో ఆల్ టైం హైల నుంచి వెనక్కి తగ్గాయి. కొత్త ఆర్థిక సంవత్సరంలో రికార్డుల బోణి కొట్టిన కీలక సూచీలు రెండూ ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణతో మద్దతు స్థాయిలకు దిగువన ముగిసాయి. ఆరంభంనుంచి దాదాపు చివరి వరకూ ట్రిపుల్ సెంచరీ లాభాలతో దూసుకుపోయిన మార్కెట్లు ఒక దశలో 400 పాయింట్ల లాభాలను సాధించాయి. అయితే చివరి అర్థగంటలో అమ్మకాలతో సెన్సెక్స్ 199 పాయింట్ల లాభాలకు పరిమితమై 38871 వద్ద, నిఫ్టీ 45 పాయింట్లు ఎగిసి 11669 వద్ద ముగిశాయి. ఇవాల్టి మార్కెట్‌లో సెన్సెక్స్ 39వేల మైలురాయిని దాటగా, నిప్టీ 11700 స్థాయికి ఎగువన ట్రేడ్ అయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా రికార్డ్ స్థాయిలో కొనసాగడం విశేషం.
దాదాపు అన్ని సెక్టార్లు లాభాల్లోనే ముగిశాయి. ప్రధానంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లు భారీగా లాభపడ్డాయి. మెటల్, ఐటీ, ఆటో రంగాలు లాభాల్లో ముగిశాయి. రియల్టీ, ఎఫ్‌ఎంసీజీ నష్టపోయాయి. ఆంధ్రాబ్యాంక్, లక్ష్మీ విలాస్, టాటా స్టీల్, పీఎన్‌బీ హౌసింగ్, వెల్ కార్ప్ టాప్‌విన్నర్స్‌గా ఉండగా, జేఅండ్‌కే, సిండికేట్, పీఎన్‌బీ, బీవోబీ, యూనియన్, బీవోఐ, కెనరా, అలహాబాద్, సెంట్రల్, ఇండియన్ బ్యాంక్, టాటా మోటార్స్, హిందాల్కో, వేదాంతా, గెయిల్, టాటా స్టీల్, విప్రో, మారుతీ, ఎయిర్‌టెల్, ఎన్‌టీపీసీ, అల్ట్రాటెక్ లాభపడిన వాటిల్లో ఉన్నాయి. అయితే ఐవోసీ, యూపీఎల్, ఇండస్‌ఇండ్, జీ, ఐబీ హౌసింగ్, బీపీసీఎల్, ఓఎన్‌జీసీ, ఐషర్, టైటన్, కోల్ ఇండియా టాప్ లూజర్స్‌గా ఉన్నాయి.
కాగా ఆర్‌బీఐ రేట్ కట్ అంచనాలు, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో దేశంలో బీజేపీ మళ్లీ అధికార పగ్గాలు చేపట్టనుందనే అంచనాలు ఇన్వెస్టర్ల కొనుగోళ్లకు దారి తీసినట్టు ఎనలిస్టులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment