
సెన్సెక్స్, నిఫ్టీలు ఇంట్రాడేలో జీవిత కాల గరిస్ట స్థాయిలకు చేరిన తర్వాత లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో మంగళవారం స్టాక్ మార్కెట్ నష్టపోయింది. వృద్ధిపై ఆందోళన నెలకొనడం, మహారాష్ట్రలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, నవంబర్ నెల డెరివేటివ్స్ కాంట్రాక్టులు మరో రెండు రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీలు తీవ్రమైన ఒడిదుడుకులకు గురయ్యాయి. ఇటీవల బాగా పెరిగిన టెలికం, ఐటీ, క్యాపిటల్ గూడ్స్, వాహన షేర్లలో ట్రేడర్లు లాభాలు స్వీకరించారు. ఇంట్రాడేలో సెన్సెక్స్ 41,120 పాయింట్లను, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 12,132 పాయింట్లను తాకాయి. ఇవి ఈ రెండు సూచీలకు జీవిత కాల గరిష్ట స్థాయిలు. చివరకు సెన్సెక్స్ 68 పాయింట్ల నష్టంతో 40,821 పాయింట్ల వద్ద, నిఫ్టీ 36 పాయింట్ల నష్టంతో 12,038 పాయింట్ల వద్ద ముగిశాయి. బ్యాంక్ నిఫ్టీ కూడా 31,850 పాయింట్ల వద్ద ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట స్థాయిని తాకింది. చివరకు 0.5% లాభంతో ఆల్‌టైమ్‌హై క్లోజింగ్, 31,718 పాయింట్ల వద్ద ముగిసింది.
410 పాయింట్ల రేంజ్‌లో సెన్సెక్స్....
సెన్సెక్స్ 41వేల పాయింట్లపైననే మొదలైంది. 231 పాయింట్ల లాభంతో 41,120 పాయింట్ల వద్ద జీవిత కాల గరిష్ట స్థాయిని తాకింది. మధ్యాహ్నం తర్వాత నష్టాల్లోకి జారి ంది. ఒక దశలో 231 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ మరో దశలో 179 పాయింట్లు నష్టపోయింది. మొత్తం మీద రోజంతా 410 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. ఇంట్రాడేలో డాలర్‌తో రూపాయి మారకం విలువ 20 పైసలు పెరిగినా, స్టాక్ మార్కెట్‌కు నష్టాలు తప్పలేదు. ఆసియా, యూరప్ మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి.
వృద్ధిపై ఆందోళన....
ఈ క్యూ2లో వృద్ధి 4.7 శాతమేనని, వరుసగా ఆరో క్వార్టర్‌లోనూ జీడీపీ క్షీణిస్తుందని ఫిచ్ గ్రూప్‌నకు చెందిన ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ సంస్థ అంచనాలను వెలువరించింది. అంతే కాకుండా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జీడీపీ అంచనాలను నాలుగోసారి సవరించింది. క్యూ2 జీడీపీ గణాంకాలు శుక్రవారం వెలువడనుండటం, సెన్సెక్స్, నిఫ్టీలు జీవిత కాల గరిష్ట స్థాయిలకు ఎగియడం, ఎఫ్ అండ్ ఓ కాంట్రాక్టుల ముగింపు... వీటన్నింటి నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. సెన్సెక్స్, నిఫ్టీలతో పాటు పలు షేర్లు ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట స్థాయిలకు ఎగిశాయి. ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్ ఇ ండస్ట్రీస్, జుబిలంట్ ఫుడ్‌వర్క్స్, ఎంబసీ ఆఫీస్ రీట్స్, ఆవాస్ ఫైనాన్షియర్స్, అదానీ గ్రీన్, దివీస్ ల్యాబ్స్, తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. 50కు పైగా షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలను తాకగా, 120కు పైగా షేర్లు ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. అలహాబాద్ బ్యాంక్, కేర్ రేటింగ్స్, ఓమాక్సీ, శోభ, చెన్నై పెట్రోలియమ్ కార్పొరేషన్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.
►భారతీ ఎయిర్‌టెల్ షేర్ 4.3% నష్టంతో రూ.431.70 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. ఈ కంపెనీ దీర్ఘకాల రేటింగ్‌ను ఇక్రా తగ్గించడం, కనీస టారిఫ్‌ల విషయమై టెలికం డిపార్ట్‌మెంట్ ఎలాంటి స్పందన వ్యక్తం చేయకపోవడం దీనికి ప్రధాన కారణాలు.
►లాభాల స్వీకరణ కారణంగా టీసీఎస్ 1.6%, ఇన్ఫోసిస్ 1 శాతం, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ 1.2 శాతం మేర తగ్గాయి.
►వృద్ధి అంచనాలపై ఆందోళన కారణంగా వాహన షేర్లు పతనమయ్యాయి. మారుతీ సుజుకీ 1.5 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 1.6 శాతం, టాటా మోటార్స్ 1.3 శాతం చొప్పున నష్టపోయాయి.
►చైర్మన్ పదవికి సుభాష్ చంద్ర రాజీనామా చేయడంతో జీ ఎంటర్‌టైన్మెంట్ షేర్ 7% నష్టంతో రూ. 320 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.2,300 కోట్లు ఆవిరైంది.
రూ.10 లక్షల కోట్లకు చేరువలో రిలయన్స్ మార్కెట్ క్యాప్
మార్కెట్ విలువ పరంగా అతి పెద్ద కంపెనీ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాప్ ఇంట్రాడేలో రూ.10 లక్షల కోట్లకు చేరువైంది. ఇంట్రాడేలో షేర్ రూ.1,576 ధరకు చేరడంతో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.9,99,045 కోట్లకు చేరింది. కానీ చివరకు ఈ షేర్ స్వల్ప నష్టంతో రూ.1,559కు చేరడంతో మార్కెట్ క్యాప్ రూ.9,88,180 కోట్లకు(13,800 కోట్ల డాలర్ల) పరిమితమైంది. ఈ మార్కెట్ క్యాప్‌తో ఈ కంపెనీ బ్రిటిష్ చమురు దిగ్గజం బీపీ పీఎల్‌సీ మార్కెట్‌క్యాప్ (13,100 కోట్లు)ను మించిపోయింది.
ఎఫ్ అండ్ ఓ నుంచి టాటా మోటార్స్ తొలగింపు
ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ సెగ్మెంట్ నుంచి టాటా మోటార్స్ షేర్‌ను బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలు తొలగిస్తున్నాయి. వచ్చే ఏడాది జనవరి 31 (ఫిబ్రవరి డెరివేటివ్స్ సిరీస్) నుంచి టాటా మోటార్స్, ఎన్‌బీసీసీ, డిష్‌టీవీ, క్యాస్ట్రాల్ ఇండియా షేర్లను ఈ ఎక్సే్ఛంజ్‌లు తొలగిస్తున్నాయి. వచ్చే నెల 23 నుంచి సెన్సెక్స్ సూచీ నుంచి కూడా టాటా మోటార్స్ షేరును తీసివేస్తున్న విషయం తెలిసిందే.