వెలుగులో పీఎస్యూ షేర్లు
స్వల్పంగా తగ్గిన సూచీలు
ముంబై: ఇటీవల జోరుగా పెరిగిన బ్లూచిప్ షేర్లలో లాభాల స్వీకరణ జరగడంతో బుధవారం స్టాక్ సూచీలు స్వల్పంగా తగ్గాయి. ట్రేడింగ్ తొలిదశలో 29,000 పాయింట్ల స్థాయిని దాటి 29,067 పాయింట్ల వరకూ పెరిగిన బీఎస్‌ఈ సెన్సెక్స్ చివరకు 52 పాయింట్ల క్షీణతతో 28,926 పాయింట్ల వద్ద ముగిసింది. గత మూడు సెషన్లలో ఈ సూచీ 554 పాయింట్లు పెరిగింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 25 పాయింట్లు తగ్గి 8,918 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం, యాక్సిస్ బ్యాంక్, ఎస్ బ్యాంక్, కెయిర్న్ ఇండియా, ఆసియన్ పెయింట్స్, టెక్ మహింద్రాలు 1.5-2.5 శాతం మధ్య క్షీణించాయి. గురువారం యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ సమావేశం జరగనున్న నేపథ్యంలో లాభాల స్వీకరణ జరిగిందని జియోజిత్ బీఎన్‌పీ పారిబాస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు.
బీహెచ్‌ఈఎల్ టాప్
పలు ప్రభుత్వ రంగ షేర్లకు భారీ కొనుగోలు మద్దతు లభించింది. ప్రభుత్వ రంగంలోని బ్యాంకింగ్, మెటల్, క్యాపిటల్ గూడ్స్ షేర్లు జోరుగా పెరిగాయి. అంచనాలకు మించిన ఆర్థిక ఫలితాలతో ఆకట్టుకున్న బీహెచ్‌ఈఎల్ భారీగా 15 శాతం పెరిగి రూ. 159 స్థాయికి చేరింది. పీఎస్‌యూ మెటల్ షేర్లు సెయిల్, ఎన్‌ఎండీసీలు 7 శాతంపైగా ర్యాలీ జరిపాయి. ఓఎన్‌జీసీ 2.9 శాతం ఎగిసింది. ఇక పీఎస్‌యూ బ్యాంకింగ్ షేర్లలో కెనరా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లు 5-7 శాతం మధ్య పెరగ్గా, బ్యాంక్ ఆఫ్ బరోడా 3 శాతంపైగా దూసుకెళ్లింది. సెన్సెక్స్ షేర్లలో అన్నింటికంటే అధికంగా ఎస్‌బీఐ 2.74 శాతం పెరిగి 52 వారాల గరిష్టస్థాయి రూ. 266.50 వద్ద ముగిసింది.