25,000 స్థాయిని దాటితేనే..
మార్కెట్ పంచాంగం
ఎన్నో నెలల తర్వాత ఈక్విటీలు, క్రూడ్, బంగారం, మెటల్స్...ఇలా ట్రేడయ్యే అన్ని ఆస్తుల ధరలూ పెరుగుతున్నాయి. అలాగే చైనాతో సహా ఇతర వర్థమాన దేశాల కరెన్సీలన్నీ బలపడుతున్నాయి. ఈక్విటీలు పెరిగితే బంగారం తగ్గడం, క్రూడ్ తగ్గితే షేర్లు క్షీణించడం, చైనా మార్కెట్ పతనమైతే ఇతర ప్రపంచ మార్కెట్లు పడిపోవడం, డాలరు పెరిగితే ఇతర వర్థమాన కరెన్సీలు తగ్గడం వంటి ట్రెండ్స్ అన్నీ హఠాత్తుగా మటుమాయమయ్యాయి.
ఒకవైపు యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ భారీ ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించగా, మరోవైపు అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచవచ్చన్న సంకేతాలు వెలువడుతున్నాయి. అయినా అన్నింటి ధరలూ అప్‌ట్రెండ్‌లోనే వున్నాయి. ఈ ధోరణి ఇక ఎన్నోరోజులు కొనసాగకపోవొచ్చు. ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించడం శ్రేయస్కరం. ఇక సూచీల స్వల్పకాలిక సాంకేతికాంశాలకు వస్తే...
సెన్సెక్స్ సాంకేతికాంశాలు
మార్చి 11తో ముగిసిన 4 రోజుల ట్రేడింగ్‌వారంలో పరిమితశ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనైన బీఎస్‌ఈ సెన్సెక్స్ చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 72 పాయింట్ల స్వల్పలాభంతో 24,718 పాయింట్ల వద్ద ముగిసింది. క్రితం వారం వరుసగా మూడురోజులపాటు 24,820 పాయింట్ల వద్ద చిన్న అవరోధం ఏర్పడినందున, ఈ వారం ఇదేస్థాయి తొలి నిరోధం కాగలదు. గత శుక్రవారం అమెరికా మార్కెట్లు భారీగా ర్యాలీ జరిపిన నేపథ్యంతో ఈ సోమవారం ఈ స్థాయిపైన సెన్సెక్స్ ప్రారంభమైతే వెనువెంటనే 25,000 పాయింట్ల శిఖరాన్ని తాకే చాన్స్ వుంది. దాదాపు ఇదే స్థాయి వద్ద జనవరి 14, ఫిబ్రవరి 1 తేదీల్లో డబుల్‌టాప్ ఏర్పడినందున, ఈ స్థాయిని బలంగా దాటి స్థిరపడితేనే తదుపరి అప్‌ట్రెండ్ సాధ్యపడుతుంది.
అటుపైన సెన్సెక్స్ 25,230 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. ఈ స్థాయిని కూడా ఛేదిస్తే కొద్దిరోజుల్లో 26,256 పాయింట్ల వరకూ ర్యాలీ కొనసాగే చాన్స్ వుంటుంది. ఈ వారం క్షీణిస్తే 24,440 పాయింట్ల వద్ద తొలి మద్దతు లభిస్తుండగా, 24,380-24,280 శ్రేణి వద్ద మద్దతు సెన్సెక్స్ కీలకమైనది. మార్చి 2 నాటి గ్యాప్‌అప్ అయిన ఈ శ్రేణిని సూచీ కోల్పోతే ప్రస్తుత అప్‌ట్రెండ్ ప్రమాదంలో పడే వీలుంది. ఈ శ్రేణి దిగువన 24,044 పాయింట్ల వరకూ తగ్గవచ్చు. ఆ లోపున 23,820 పాయింట్ల స్థాయి వద్ద మరో మద్దతు లభిస్తున్నది.
నిఫ్టీ కీలక మద్దతు శ్రేణి 7,406-7,380
ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ అంతక్రితం వారంతో పోలిస్తే 25 పాయింట్ల లాభంతో 7,510 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ సోమవారం గ్యాప్‌అప్‌తో మొదలైతే 7,550 స్థాయి వద్ద తక్షణ నిరోధం ఏర్పడవచ్చు. ఈ స్థాయిపైనే నిఫ్టీ ప్రారంభమైతే వేగంగా 7,600 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. ఈ స్థాయిని దాటితేనే నిఫ్టీ మరింత పెరిగి 7,675 స్థాయివరకూ ర్యాలీ జరపవచ్చు. ఈ స్థాయిని కూడా ఛేదించి, స్థిరపడితే రానున్న వారాల్లో 7,980 పాయింట్ల దిశగా కదిలే అవకాశం వుంటుంది.
ఈ వారం మార్కెట్ తగ్గితే నిఫ్టీకి తక్షణం 7,425 వద్ద చిన్నపాటి మద్దతు లభిస్తున్నది. ఈ స్థాయిని కోల్పోతే 7,406-7,380 పాయింట్ల మద్దతు శ్రేణి సమీపకాలంలో అప్‌ట్రెండ్‌కు కీలకం. ఈ శ్రేణిని కోల్పోతే 7,308 పాయింట్ల వరకూ క్షీణించవచ్చు. ఆ లోపున ముగిస్తే క్రమేపీ 7,235 పాయింట్ల వద్దకు తగ్గే ప్రమాదం వుంటుంది.
- పి.సత్యప్రసాద్