
మార్కెట్‌కు పోర్చుగల్ భయాలు
పాత ఒప్పందాలపైనా పన్ను విధించే చట్టాలతో కూడిన గార్ పట్ల ఇన్వెస్టర్లలో ఆందోళనలు చెలరేగాయి. బడ్జెట్‌లో రెట్రోస్పెక్టివ్ ట్యాక్స్ చట్టాన్ని తొలగిస్తారన్న అంచనాలు తేలిపోవడంతో మార్కెట్లో నిరుత్సాహం చోటుచేసుకుంది. దీనికితోడు తాజాగా పోర్చుగల్ బ్యాంకింగ్ వ్యవస్థ చిక్కుల్లోపడటం సెంటిమెంట్‌ను దెబ్బకొట్టింది. దీంతో వరుసగా నాలుగో రోజు సెన్సెక్స్ నష్టపోయింది. 348 పాయింట్లు పతనమై 25,024 వద్ద ముగిసింది. ఇది నెల రోజుల కనిష్టంకాగా, 4 రోజుల్లో 1,076 పాయింట్లను కోల్పోయింది! తద్వారా ఇన్వెస్టర్ల సంపదగా పేర్కొనే లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ(క్యాపిటలైజేషన్)లో రూ. 5 లక్షల కోట్లమేర హరించుకుపోయింది!!
7,500 దిగువకు నిఫ్టీ
రెండు రోజుల వ్యవధిలో మోడీ ప్రభుత్వం ప్రకటించిన రెండు బడ్జెట్లూ మార్కెట్‌ను నిరాశపరచడంతో ఇన్వెస్టర్లు మరోసారి అమ్మకాలకే ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో నిఫ్టీ కూడా 108 పాయింట్లు పడిపోయి కీలకస్థాయి 7,500కు దిగువన 7,460 వద్ద ముగిసింది. కాగా, సెన్సెక్స్ తొలుత లాభాలతో మొదలైంది. ఒక దశలో 175 పాయింట్లు పుంజుకుని 25,550 వరకూ ఎగసింది. అయితే యూరప్ దేశాల రుణ భార సమస్యలు మళ్లీ తెరపైకి రావడంతో మిడ్ సెషన్ నుంచీ అమ్మకాలు పెరిగి నష్టాలలోకి జారుకుంది. 24,978 వద్ద కనిష్టాన్ని తాకింది. ఈ నేపథ్యంలో వారం మొత్తంమీద సెన్సెక్స్ 938 పాయింట్లు పోగొట్టుకుంది. ఫలితంగా 2011 డిసెంబర్ తరువాత మళ్లీ గరిష్ట స్థాయి నష్టాలు నమోదయ్యాయి!
2015 జూన్‌కల్లా 28,800కు సెన్సెక్స్!
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది(2015) జూన్‌కల్లా మార్కెట్ ప్రామాణిక సూచీ సెన్సెక్స్ 28,800 పాయింట్లకు చేరుతుందని గ్లోబల్ బ్రోకరేజీ దిగ్గజం మోర్గాన్ స్టాన్లీ అంచనా వేసింది. ఇన్వెస్టర్ సెంటిమెంట్‌ను మెరుగుపరచడంలో విధానకర్తలు తీసుకుంటున్న సవ్యమైన నిర్ణయాలు ఇందుకు దోహదపడతాయని రీసెర్చ్ నివేదికలో వివరించింది. 2014-15లో సెన్సెక్స్ ఆర్జన 13.5% వృద్ధి చెందుతుందన్న అంచనాల ఆధారంగా దాదాపు 10% లక్ష్యాన్ని నిర్ణయించినట్లు తెలిపింది. ఈ బాటలో సెన్సెక్స్ ఆర్జన 2015-16లో 22.7%, 2016-17లో 23.4% చొప్పున పుంజుకునే అవకాశమున్నట్లు అభిప్రాయపడింది.