
కరోనా వైరస్ కల్లోలంతో కుదేలైన ఆర్థిక వ్యవస్థను ఆదుకోవడానికి మరో ఉద్దీపన ప్యాకేజీని కేంద్రం త్వరలోనే అందించగలదన్న ఆశలతో మంగళవారం స్టాక్ మార్కెట్ లాభపడింది. వివిధ దేశాల్లో లాక్‌డౌన్‌ను దశలవారీగా ఎత్తేస్తారన్న అంచనాలతో ప్రపంచ మార్కెట్లు లాభపడటం కలసివచ్చింది. ముడి చమురు ధరలు 2 శాతం మేర తగ్గడం, డాలర్‌తో రూపాయి మారకం విలువ స్వల్పంగానైనా పుంజుకోవడం, బ్యాంక్, ఆర్థిక రంగ షేర్లు పుంజుకోవడం.... సానుకూల ప్రభావం చూపించాయి. సెన్సెక్స్ 32,0000 పాయింట్లపైకి నిఫ్టీ 9,300 పాయింట్లపైకి ఎగబాకాయి. ఈ రెండు సూచీలు వరుసగా రెండో రోజూ లాభపడ్డాయి. ఈ రెండు సూచీలు ఏడు వారాల గరిష్ట స్థాయిలకు చేరాయి. సెన్సెక్స్ 371 పాయింట్ల లాభంతో 32,115 పాయింట్ల వద్ద, నిఫ్టీ 99 పాయింట్ల లాభంతో 9,381 పాయింట్ల వద్ద ముగిశాయి.
541 పాయింట్ల రేంజ్‌లో సెన్సెక్స్...
సెన్సెక్స్ లాభాల్లోనే మొదలైంది. గంటలోపే నష్టాల్లోకి జారిపోయినా, మళ్లీ లాభాల్లోకి వచ్చింది. మధ్యాహ్నం వరకూ పరిమిత శ్రేణిలో కదలాడింది. ఆ తర్వాత లాభాలు జోరుగా పెరిగాయి. ఒక దశలో 84 పాయింట్లు పతనమైన సెన్సెక్స్ మరో దశలో 457 పాయింట్లు ఎగసింది. మొత్తం మీద రోజంతా 541 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. లాక్‌డౌన్ తొలగింపు, వ్యాపారాలు మళ్లీ పూర్వపు స్థాయిలకు రావడానికి తీసుకునే చర్యలపై ప్రస్తుత ర్యాలీ ఆధారపడి ఉందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ వినోద్ నాయర్ పేర్కొన్నారు. షాంఘై, జపాన్ సూచీలు మినహా మిగిలిన ఆసియా మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. యూరప్ మార్కెట్లు 2–3 శాతం రేంజ్‌లో లాభపడ్డాయి.
►నికర లాభం నిరాశపరిచినా, నికర వడ్డీ మార్జిన్ పెరగడం, నిలకడైన వృద్ధి కారణంగా ఇండస్‌ఇండ్ బ్యాంక్ షేర్ 15 శాతం లాభంతో రూ.467 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్ ఇదే.
►సన్‌ఫార్మా, ఎన్‌టీపీసీ, నెస్లే ఇండియా, హెచ్‌సీఎల్ టెక్, భారతీ ఎయిర్‌టెల్ షేర్లు నష్టపోయాయి.
►మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో 29% వాటా కొనుగోలు చేయనుండటంతో యాక్సిస్ బ్యాంక్ షేర్ 7% లాభంతో రూ. 455 వద్దకు చేరింది.