ఆర్‌బీఐ పాలసీ ఎఫెక్ట్
116 పాయింట్లు నష్టం
28,444 వద్దకు సెన్సెక్స్
ఐటీ, ఆటో రంగాలు డీలా
ఆర్‌బీఐ చేపట్టిన సమీక్షలో వడ్డీ రేట్ల జోలికిపోకుండా యథాతథ పాలసీని ప్రకటించడంతో మార్కెట్లు నష్టపోయాయి. సెన్సెక్స్ 116 పాయింట్లు క్షీణించి 28,444 వద్ద నిలవగా, నిఫ్టీ 31 పాయింట్లు తగ్గి 8,525 వద్ద ముగిసింది. పరపతి సమీక్ష నేపథ్యంలో ఇండెక్స్‌లు రోజు మొత్తం స్వల్ప హెచ్చుతగ్గులను చవిచూసి చివరికి నష్టాలతో ముగిశాయి. వెరసి వరుసగా రెండో రోజు మార్కెట్లు నీరసించాయి. రెండు రోజుల్లో సెన్సెక్స్ 250 పాయింట్లు నష్టపోయింది. బీఎస్‌ఈలో ప్రధానంగా ఐటీ, ఆటో రంగాలు 1%పైగా నష్టపోగా, మెటల్, హెల్త్‌కేర్ రంగాలు 1% లాభపడ్డాయి.
ఆయిల్ షేర్లలో అమ్మకాలు
అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు భారీగా దిగిరావడంతో కేంద్ర ప్రభుత్వం మరోసారి పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది. ఈ పెంపు రిటైల్ ధరలపై పడనప్పటికీ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల మార్జిన్లు తగ్గే అవకాశముంది. దీంతో బీపీసీఎల్, ఐవోసీ, హెచ్‌పీసీఎల్ 4-2% మధ్య క్షీణించాయి. పెట్రోల్‌పై లీటర్‌కు రూ. 2.25, డీజిల్‌పై రూ. 1 చొప్పున సుంకాన్ని పెంచడం ద్వారా మార్చికల్లా ప్రభుత్వానికి రూ. 4,000 కోట్లు అదనంగా సమకూరనున్నాయి. సెన్సెక్స్‌లో హిందాల్కో అత్యధికంగా 2.5% పుంజుకోగా, గెయిల్, ఎంఅండ్‌ఎం, ఇన్ఫోసిస్ అదే స్థాయిలో నష్టపోయాయి. టీసీఎస్, టాటా మోటార్స్, హెచ్‌డీఎఫ్‌సీ సైతం 1% బలహీనపడ్డాయి.
32,500 పాయింట్లకు సెన్సెక్స్
2015 డిసెంబర్‌కల్లా సెన్సెక్స్ 32,500 పాయింట్లను తాకుతుందని మోర్గాన్ స్టాన్లీ అంచనా వేసింది. దేశీ స్టాక్ మార్కెట్లో ప్రస్తుతం నెలకొన్న బుల్‌ట్రెండ్ కొనసాగుతుందని, ఇందుకు వేగమందుకున్న ఆర్థిక వృద్ధి దోహదపడుతుందని అభిప్రాయపడింది.