మూడు వారాల కనిష్టానికి నిఫ్టీ
* వెన్నాడిన చమురు, గ్రీస్ అందోళనలు
* 79 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
మార్కెట్ అప్‌డేట్
ముంబై: భారత స్టాక్ మార్కెట్ల పతన తీవ్రత కొంత నెమ్మదించింది. మంగళవారం నిట్టనిలువుగా పడిపోయిన మార్కెట్లు బుధవారం ట్రేడింగ్ జరిగినంత సేపూ సూచీలు స్వల్ప నష్టాల్లోనే కొనసాగాయి. బ్లూచిప్ షేర్లలో నష్టాల కారణంగా చివరకు 79 పాయింట్లు కోల్పోయి 26,909 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్ 275 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. నిఫ్టీ 25 పాయింట్ల నష్టపోయి 8,102 పాయింట్ల వద్ద ముగిసింది.
ముడి చమురు ధరల పతనం కొనసాగుతూనే ఉండడం, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల జోరు సూచీల నష్టానికి కారణాలు. ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 50 డాలర్లకు దిగువకు వస్తే అంతర్జాతీయంగా వృద్ధి అవకాశాలు మసకబారతాయని ఇన్వెస్టర్లు భయపడుతున్నట్లు బ్రోకర్లు చెప్పారు. యూరో జోన్ నుంచి గ్రీస్ వైదొలిగే అవకాశాలు పెరుగుతండడం సైతం ఇన్వెస్టర్లను ఇన్వెస్టర్లను ఆందోళనపర్చాయి.
ఎలాంటి ప్రధాన సంఘటనలు లేకపోవడం, ముడి చమురు మరింతగా పతనమవడం వంటి కారణాల వల్ల అంతర్జాతీయ మార్కెట్లు ఒడిదుడుకులమయంగా సాగాయని బొనంజా పోర్ట్‌ఫోలియో అసోసియేట్ ఫండ్ మేనేజర్ హిరేన్ ధకన్ వ్యాఖ్యానించారు. లోహా, బ్యాంక్ షేర్లు సెన్సెక్స్‌ను పడగొట్టాయి. బీఎస్‌ఈలో మొత్తం టర్నోవర్ రూ.3,210 కోట్లుగా నమోదైంది. ఎన్‌ఎస్‌ఈలో మొ త్తం టర్నోవర్ ఈక్విటీల్లో రూ.16,358 కోట్లుగా, డెరివేటివ్స్‌లో రూ.2,32,360 కోట్లుగా నమోదైంది.