స్టాక్ మార్కెట్ చరిత్రలోనే తొలిసారి...
-
31,700మార్కుకు పైన సెన్సెక్స్
-
నిఫ్టీ సరికొత్త గరిష్టంలో 9,771 వద్ద ముగింపు
ముంబై : ఎన్‌ఎస్‌ఈ మార్కెట్లో సాంకేతిక లోపాలు చోటుచేసుకుని, ట్రేడింగ్‌కు అవాంతరం ఎదురైనప్పటికీ స్టాక్ మార్కెట్లు తిరుగులేని స్థాయిలో దూసుకెళ్లాయి. సరికొత్త రికార్డు స్థాయిల్లో ముగిశాయి. సెన్సెక్స్ 355.01 పాయింట్లు జంప్ చేసి స్టాక్ మార్కెట్ చరిత్రలోనే తొలిసారి 31,700 మార్కుకు పైన, 31,715 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ సైతం 105.25 పాయింట్ల జోరుతో 9750 మార్కును అధిగమించి 9771 వద్ద క్లోజైంది. ప్రారంభం నుంచి రికార్డు స్థాయిలో మార్కెట్లు లాభాల వర్షం కురిపిస్తున్నాయి. ప్రారంభంలోనే సెన్సెక్స్ డబుల్ సెంచరీ క్రాస్ చేసింది. నిఫ్టీ కూడా అదే ఊపులో కొనసాగుతుండగా.. ఎన్‌ఎస్‌ఈ రేట్లు అప్‌డేట్ కాకుండా సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. 9 గంటలకు 55 నిమిషాలకు ట్రేడింగ్‌ను నిలిపివేసి, అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు మళ్లీ ఎన్‌ఎస్‌ఈ మార్కెట్లను పునఃప్రారంభించారు. మార్కెట్లు నేడు రికార్డుల వర్షం కురిపించడానికి ప్రధాన కారణం కంపెనీలు వెలువరించనున్న క్వార్టర్ ఫలితాలేనని మార్కెట్ విశ్లేషకులంటున్నారు.
మెరుగైన ప్రదర్శనను కంపెనీలు కనబర్చనున్నాయనే అంచనాలు ఊపందుకోవడంతో మార్కెట్లు పైగి ఎగిసినట్టు చెప్పారు. బ్లూచిప్ కంపెనీలు ఫలితాలు జూలై 13న టీసీఎస్ ఫలితాల ప్రకటనతో ప్రారంభం కానున్నాయి. అంతేకాక టెక్నాలజీ, ఐటీ, పీఎస్‌యూ, హెల్త్‌కేర్, బ్యాంకులు లాభాల్లో కొనసాగడం మార్కెట్లను రికార్డు స్థాయిల్లో నడిపించాయి. టీసీఎస్, టాటామోటార్స్, భారతీ ఎయిర్‌టెల్, లుపిన్, సన్ ఫార్మాలు 2 శాతం పైగా ర్యాలీ జరుపగా.. కేవలం హెచ్‌డీఎఫ్‌సీ మాత్రమే నష్టాలను గడించింది. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ కూడా లాభపడి 64.53 వద్ద ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్‌లో బంగారం ధరలు నష్టాల పర్వం కొనసాగుతోంది. నేడు 138 రూపాయలు నష్టపోయి 27,646గా నమోదయ్యాయి.