new record highs
-
కొత్త ఏడాది తొలి రోజూ రికార్డ్స్‌తో బోణీ
ముంబై, సాక్షి: కొత్త ఏడాది తొలి రోజు దేశీ స్టాక్ మార్కెట్లకు కొత్త జోష్ వచ్చింది. దీంతో సెన్సెక్స్ 48,000 మైలురాయికి చేరువలో నిలవగా.. నిఫ్టీ 14,000 పాయింట్ల మార్క్‌ను అధిగమించింది. వెరసి వరుసగా 8వ రోజూ మార్కెట్లు లాభపడగా.. మరోసారి సరికొత్త గరిష్ట రికార్డులు నమోదయ్యాయి. సెన్సెక్స్ 118 పాయింట్ల వృద్ధితో 47,869 వద్ద ముగిసింది. నిఫ్టీ 37 పాయింట్లు పుంజుకుని 14,019 వద్ద స్థిరపడింది. గత వారానికల్లా నిరుద్యోగ క్లెయిములు తగ్గడంతో గురువారం యూఎస్ మార్కెట్లు 0.6 శాతం స్థాయిలో బలపడ్డాయి. మరోసారి రికార్డు గరిష్టాల వద్ద ముగిశాయి. దీనికితోడు కోవిడ్-19 కట్టడికి ఫైజర్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) గుర్తింపును ఇవ్వడంతో సెంటిమెంటు బలపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఇంట్రాడేలో సెన్సెక్స్ 47,980ను తాకగా.. నిఫ్టీ 14,050కు చేరింది. (2020: ఎఫ్‌పీఐల పెట్టుబడుల స్పీడ్) ఐటీ, ఆటో.. ఎన్ఎస్ఈలో ప్రయివేట్ బ్యాంక్స్ 0.3 నీరసించగా.. పీఎస్‌యూ బ్యాంక్స్ 3.3 శాతం ఎగశాయి. ఈ బాటలో ఆటో, ఐటీ, రియల్టీ 1 శాతం స్థాయిలో లాభపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో అదానీ పోర్ట్స్, టీసీఎస్, ఐటీసీ, ఎంఅండ్ఎం, ఎస్బీఐ, టాటా మోటార్స్, ఎయిర్టెల్, బజాజ్ ఆటో, సన్ ఫార్మా, సిప్లా 4.4-1 శాతం మధ్య ఎగశాయి. అయితే ఐసీఐసీఐ, ఎస్బీఐ లైఫ్, హిందాల్కో, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టైటన్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ 1.4-0.4 శాతం మధ్య డీలా పడ్డాయి. బీహెచ్ఈఎల్ జూమ్ డెరివేటివ్ స్టాక్స్‌లో బీహెచ్ఈఎల్, చోళమండలం, ఐడియా, బీఈఎల్, పీఎన్బీ, బీవోబీ, ఎల్ఐసీ హౌసింగ్, లాల్‌పాథ్, పిరమల్, కెనరా బ్యాంక్ 8-4 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోవైపు ఎస్బీఐ లైఫ్, బాలకృష్ణ, ఇండిగో, హావెల్స్, మదర్సన్, వేదాంతా 1.4-0.5 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1 శాతం చొప్పున పుంజుకున్నాయి. ట్రేడైన షేర్లలో 2,046 లాభపడగా.. 953 మాత్రమే నష్టాలతో నిలిచాయి. ఎఫ్‌పీఐల జోరు నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1,136 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 258 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. బుధవారం ఎఫ్‌పీఐలు రూ, 1,825 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 587 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. -
సెన్సెక్స్‌ప్రెస్- 44,000 దాటేసింది!
ముంబై: దీపావళి వెలుగులు కొనసాగిస్తూ దేశీ స్టాక్ మార్కెట్లు మరోసారి ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ప్రారంభంలోనే సెన్సెక్స్ ట్రిపుల్ సెంచరీ చేయడం ద్వారా 44,000 పాయింట్ల మైలురాయిని సైతం దాటేసింది. 44,161కు చేరింది. ఈ బాటలో నిఫ్టీ 12,934 వరకూ ఎగసింది. 13,000 పాయింట్ల మార్క్‌కు చేరువైంది. వెరసి మళ్లీ సరికొత్త గరిష్టాల రికార్డులను సాధించాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 350 పాయింట్ల లాభంతో 43,987 వద్ద కదులుతోంది. నిఫ్టీ 92 పాయింట్లు అధికంగా 12,872 వద్ద ట్రేడవుతోంది. మోడర్నా ఇంక్ వ్యాక్సిన్‌పై ఆశలతో సోమవారం యూఎస్ మార్కెట్లు సైతం చరిత్రాత్మక గరిష్టాలను అందుకోవడం గమనార్హం! మెటల్, బ్యాంక్స్ జోరు ఎన్ఎస్ఈలో ప్రధానంగా మెటల్, బ్యాంకింగ్ 2-1 శాతం చొప్పున ఎగశాయి. ఐటీ, ఫార్మా 0.5 శాతం స్థాయిలో క్షీణించాయి. నిఫ్టీ దిగ్గజాలలో టాటా స్టీల్, టాటా మోటార్స్, హిందాల్కో, ఎయిర్టెల్, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎంఅండ్ఎం, శ్రీ సిమంట్, గెయిల్, ఏషియన్ పెయింట్స్ 4.2-1.5 శాతం మధ్య బలపడ్డాయి. అయితే బీపీసీఎల్, హీరో మోటో, డాక్టర్ రెడ్డీస్, హెచ్‌సీఎల్ టెక్, బజాజ్ ఆటో, ఐషర్, ఐవోసీ, ఐటీసీ, ఇన్ఫోసిస్, టీసీఎస్ 3.7-0.5 శాతం మధ్య బలహీనపడ్డాయి. ఐడియా అప్ డెరివేటివ్స్‌లో ఐడియా, అంబుజా, బంధన్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, జిందాల్ స్టీల్, భారత్ ఫోర్జ్ 4.4-2 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. ఐబీ హౌసింగ్, పిరమల్, టొరంట్ ఫార్మా, మ్యాక్స్ ఫైనాన్స్, ఆర్ఈసీ, మణప్పురం, కోఫోర్జ్, ముత్తూట్ 3.6-1.4 శాతం మధ్య వెనకడుగు వేశాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.25 శాతం చొప్పున పుంజుకున్నాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,029 లాభపడగా.. 702 నష్టాలతో కదులుతున్నాయి. -
కదం తొక్కిన స్టాక్ బుల్- కొత్త రికార్డ్స్
ముంబై: వరుసగా ఆరో రోజు స్టాక్ బుల్ కదం తొక్కింది. దీంతో కేవలం 7 నెలల్లోనే దేశీ స్టాక్ మార్కెట్లు సరికొత్త చరిత్రను లిఖించాయి. ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ ప్రధాన ఇండెక్స్ నిఫ్టీ.. చరిత్రాత్మక గరిష్టాలను అందుకున్నాయి. ఈ ఏడాది జనవరి 20న సాధించిన లైఫ్ టైమ్ హైలను రెండు ఇండెక్సులూ తిరిగి ఒకే రోజు అధిగమించడం విశేషం. కోవిడ్-19 ఇచ్చిన షాక్ నుంచి కేవలం 7 నెలల్లోనే దేశీ స్టాక్ మార్కెట్లు సూపర్ ర్యాలీ చేయడం ద్వారా ఈ ఫీట్ సాధించాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో సెన్సెక్స్ ఇంట్రాడేలో 752 పాయింట్లు దూసుకెళ్లి 42,645ను తాకింది. నిఫ్టీ సైతం 210 పాయింట్లు ఎగసి 12,474కు చేరింది. వెరసి సరికొత్త రికార్డులను సాధించాయి. ఇంతక్రితం ఈ ఏడాది జనవరి 20న సెన్సెక్స్ 42,274 పాయింట్ల వద్ద, నిఫ్టీ 12,430 వద్ద ఇంట్రాడేలో రికార్డ్ గరిష్టాలను నమోదు చేసిన విషయం విదితమే. కాగా.. ట్రేడింగ్ ముగిసేసరికి నిఫ్టీ 198 పాయింట్ల లాభంతో 12,461 వద్ద నిలిచింది. సెన్సెక్స్ 704 పాయింట్లు జంప్ చేసి 42,597 వద్ద స్థిరపడింది. వెరసి ముగింపులోనూ లైఫ్ టైమ్ ‘హై’లను సాధించాయి. కారణాలేవిటంటే? డెమక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ అమెరికా 46వ ప్రెసిడెంట్ కానుండటం, కేంద్ర బ్యాంకులు ఫెడరల్ రిజర్వ్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ సహాయక ప్యాకేజీలకు మద్దతిస్తుండటం వంటి అంశాలు ప్రధానంగా సెంటిమెంటుకు బలాన్నిచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. బైడెన్- ప్రధాని మోడీ మధ్య మంచి అవగాహన, వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ భారత సంతతికి చెందిన వ్యక్తి కావడం వంటి అంశాలు సైతం ఇన్వెస్టర్లకు హుషారునిచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఇటీవల ఎఫ్ఐఐలు దేశీ స్టాక్స్ లో భారీగా ఇన్వెస్ట్ చేస్తుండటం సైతం ఇందుకు దోహదం చేస్తున్నట్లు తెలియజేశారు. ఈ నెల తొలి ఐదు రోజుల్లోనే ఎఫ్ఐఐలు నగదు విభాగంలో నికరంగా రూ. 8,381 కోట్లను ఇన్వెస్ట్ చేయడం గమనార్హం. అన్ని రంగాలూ ఎన్ఎస్ఈలో అన్ని రంగాలూ 0.5-2.7 శాతం మధ్య బలపడ్డాయి. మీడియా యథాతథంగా ముగిసింది. నిఫ్టీ దిగ్గజాలలో దివీస్, ఎయిర్టెల్, ఇండస్ఇండ్, ఐసీఐసీఐ, యాక్సిస్, హిందాల్కో, బీపీసీఎల్, టెక్ మహీంద్రా, శ్రీసిమెంట్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐషర్, టైటన్, బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్ 5.5-2 శాతం మధ్య ఎగశాయి. బ్లూచిప్స్ లో కేవలం సిప్లా, అదానీ పోర్ట్స్, మారుతీ, ఐటీసీ, గ్రాసిమ్, డాక్టర్ రెడ్డీస్, 3-0.3 శాతం మధ్య బలహీనపడ్డాయి. వోల్టాస్ జూమ్ డెరివేటివ్స్‌లో వోల్టాస్, ఎస్కార్ట్స్, మదర్ సన్, కోఫోర్జ్, ఇండిగో, వేదాంతా, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, ఎంఅండ్ఎం ఫైనాన్స్, భారత్ ఫోర్జ్ 6.5-3.5 శాతం మధ్య జంప్ చేశాయి. కాగా.. గ్లెన్ మార్క్ 6 శాతం పతనమైంది. ఇతర కౌంటర్లలో టొరంట్ పవర్, మణప్పురం, శ్రీరాం ట్రాన్స్, జిందాల్ స్టీల్, బాష్, అశోక్ లేలాండ్, సెయిల్, జీ 2-0.7 శాతం మధ్య నీరసించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1-0.6 శాతం చొప్పున బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1,506 లాభపడగా.. 1,185 నష్టపోయాయి. ఎఫ్‌పీఐల కొనుగోళ్లు నగదు విభాగంలో వారాంతాన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 4,870 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు. అయితే దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 2,939 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. గురువారం ఎఫ్‌పీఐలు రూ. 5,368 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 2,208 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. -
కరోనా భయాలకు బంగారం రక్ష
న్యూఢిల్లీ: అటు అంతర్జాతీయంగా, ఇటు దేశీయంగా పసిడి సరికొత్త రికార్డులవైపు దూసుకుపోతోంది. న్యూయార్క్ ఫ్యూచర్స్ మార్కెట్–నైమెక్స్‌లో చురుగ్గా ట్రేడవుతున్న పసిడి ఆగస్టు కాంట్రాక్ట్ ఔన్స్ (31.1 గ్రా) ధర బుధవారం ఒక దశలో 2,058 డాలర్లకు పెరిగింది. గత ముగింపుతో పోల్చితే దాదాపు 50 డాలర్లు అధికం. ఈ వార్తరాసే 9 గంటల సమయంలో ధర 2,048 డాలర్ల వద్ద (2 శాతం అప్) ట్రేడవుతోంది. అంతర్జాతీయంగా ఇది సరికొత్త రికార్డు కావడం గమనార్హం. తొమ్మిదేళ్ల గరిష్ట స్థాయి 1,911.60 డాలర్లను బ్రేక్ చేసిన జూలై 27 తర్వాత కేవలం కొద్దిరోజుల్లోనే పసిడి 2,050 డాలర్లను దాటేయడం గమనార్హం. పసిడి 52 వారాల కనిష్ట స్థాయి 1,428 డాలర్లు. కరోనా నేపథ్యం... పసిడి అంతర్జాతీయంగా భారీగా పెట్టుబడులను ఆకర్షిస్తోంది. పసిడి అంతర్జాతీయ డిమాండ్ సైతం ఏప్రిల్–జూన్ మధ్య 11 శాతం పడిపోయినా ( 1,136.9 టన్నుల నుంచి 1,015.7 టన్నులకు )పెట్టుబడులకు సంబంధించి డిమాండ్ మాత్రం భారీగా పెరగడం గమనార్హం. ఎలక్ట్రానిక్ ట్రేడెడ్ ఫండ్స్ విషయంలో డిమాండ్ 300 శాతం పెరిగి 76.1 టన్నుల నుంచి భారీగా 434.1 టన్నులకు చేరడం గమనార్హం. కారణాలను చూస్తే... ► ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ ► కోవిడ్ మరణాల సంఖ్య భారీగా పెరుగుతుండడం ► ఆర్థిక అనిశ్చితి ► అమెరికా–చైనా మధ్య ఉద్రిక్తత ► వివిధ దేశాల కరెన్సీ విలువల పతనం ► అమెరికా సెంట్రల్ బ్యాంక్– ఫెడ్ ఫండ్ రేటు (ప్రస్తుతం 0.25 శాతం) తగ్గిస్తుందన్న అంచనాలు దేశీయంగా ఒకేరోజు రూ.1,200కుపైగా అప్.. అంతర్జాతీయ ధోరణికి తోడు రూపాయి బలహీన ధోరణి (బుధవారం ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో 74.94) దేశంలో పసిడి ధరకు బలమవుతోంది. దేశ రాజధాని న్యూఢిల్లీలో స్పాట్ మార్కెట్లో 10 గ్రాములు 24 క్యారెట్లు స్వచ్ఛత ధర బుధవారం రూ.1,365 పెరిగి రూ.56,181కి ఎగసింది. వెండి సైతం కేజీకి రూ.5,972 ఎగసి, 72,725కు చేరింది. దేశంలోకి పలు స్పాట్ మార్కెట్లలో సైతం ధర రూ.1,200కుపైగా పెరిగింది. 24 క్యారెట్ల స్వచ్ఛత ధర రూ.55,000 దాటిపోగా, ఆభరణాల బంగారం రూ. 53,000పైకి చేరింది. ఈ వార్తరాసే సమయానికి దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్– ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల పూర్తి స్వచ్ఛత ధర మంగళవారం ముగింపుతో పోల్చితే దాదాపు రూ.837 ఎగసి పెరిగి రూ.55,388 వద్ద ట్రేడవుతోంది. -
ఈ షేర్ల రికార్డుల ర్యాలీ చూడతరమా!
మార్కెట్లు జోరుమీదున్నాయి. మిడ్‌సెషన్‌కల్లా సెన్సెక్స్ లాభాల ట్రిపుల్ సెంచరీ సాధించింది. 321 పాయింట్లు జంప్‌చేసి 36,650కు చేరింది. ఇక నిఫ్టీ సైతం 85 పాయింట్లు ఎగసి 10,791 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల ర్యాలీ బాటలో సాగుతున్న పలు మిడ్ క్యాప్ కౌంటర్లు సరికొత్త గరిష్టాల రికార్డులను సృష్టిస్తున్నాయి. జాబితాలో తాజాగా స్పెషాలిటీ కెమికల్స్ కంపెనీ ఆల్కిల్ అమైన్స్, కన్జూమర్ డ్యురబుల్స్ కంపెనీ డిక్సన్ టెక్నాలజీస్, ట్రాక్టర్ల దిగ్గజం ఎస్కార్ట్స్ లిమిటెడ్, ఐటీ సేవల కంపెనీ ఎల్అండ్టీ ఇన్ఫోటెక్, ఎఫ్ఎంసీజీ కంపెనీ టాటా కన్జూమర్ చోటు సాధించాయి. కొద్ది రోజులుగా ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్న ఈ కౌంటర్లన్నీ ఇంట్రాడేలో చరిత్రాత్మక గరిష్టాలను అందుకోవడం విశేషం! వివరాలు చూద్దాం.. ఆల్కిల్ అమైన్స్ కెమికల్స్ గత మూడు నెలల్లో 69 శాతం ర్యాలీ చేసిన ఆల్కిల్ అమైన్స్ కెమికల్స్ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 2.6 శాతం ఎగసి రూ. 2360 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 2375ను తాకింది. మార్చి త్రైమాసికంలో ఆల్కిల్ అమైన్స్ పన్నుకు ముందు లాభం(ఇబిట్) 93 శాతం జంప్‌చేసి రూ. 61 కోట్లను అధిగమించింది. ఇందుకు ముడివ్యయాలు తగ్గడం సహకరించింది. టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్ గత ఆరు రోజుల్లో టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్ షేరు 14 శాతం బలపడింది. తాజాగా ఎన్ఎస్ఈలో 3 శాతం ఎగసి రూ. 437ను అధిగమించింది. ప్రస్తుతం రూ. 435 వద్ద ట్రేడవుతోంది. ఇటీవల విదేశీ రీసెర్చ్ సంస్థ క్రెడిట్ స్వీస్ ఈ కౌంటర్‌కు ఔట్పెర్ఫార్మ్ రేటింగ్‌ను ప్రకటించడంతోపాటు ఏడాది కాలానికి రూ. 490 టార్గెట్ ధరను ప్రకటించింది. ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ గత ఆరు రోజుల్లో దాదాపు 8 శాతం పుంజుకున్న ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ తాజాగా ఎన్ఎస్ఈలో 2 శాతం లాభపడి రూ. 2079 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 2098కు ఎగసింది. ఈ ఏడాది ద్వితీయార్ధం(అక్టోబర్) నుంచి కంపెనీ మరింత జోరందుకునే వీలున్నట్లు సాఫ్ట్వేర్ పరిశ్రమవర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎస్కార్ట్స్ లిమిటెడ్ ట్రాక్టర్ల తయారీ ఎస్కార్ట్స్ షేరు ఎన్ఎస్ఈలో తొలుత రూ. 1126 సమీపానికి చేరింది. ఇది 3.5 శాతం అధికంకాగా.. ప్రస్తుతం రూ. 1115 వద్ద ట్రేడవుతోంది. గత మూడు నెలల్లో ఈ ఆటో రంగ కౌంటర్ 63 శాతం దూసుకెళ్లడం గమనార్హం! సాధారణ వర్షపాత అంచనాలు, గ్రామీణ ఆదాయాలు పుంజుకోవడం, పంటల విస్తీర్ణం పెరగడం వంటి అంశాలు ఈ కౌంటర్‌కు జోష్‌నిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. డిక్సన్ టెక్నాలజీస్ ముందు రోజు 4 శాతం ఎగసిన డిక్సన్ టెక్నాలజీస్ తాజాగా మరో 4 శాతం జంప్‌చేసింది. ఎన్ఎస్ఈలో తొలుత రూ. 6,336ను తాకింది. ప్రస్తుతం రూ. 6212 వద్ద కదులుతోంది. కోవిడ్-19లోనూ జూన్ నెలలో కన్జూమర్ డ్యురబుల్స్ రంగం 100 శాతం రికవరీ సాధించిన వార్తలు ఈ కౌంటర్‌కు ప్రోత్సాహాన్నిస్తున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. -
కొత్త శిఖరాలకు సూచీలు
స్టాక్ మార్కెట్లో రికార్డ్ల పరంపర కొనసాగుతోంది. మంగళవారం ఇంట్రాడేలో కొత్త రికార్డ్లను సృష్టించిన సెన్సెక్స్, నిఫ్టీలు బుధవారం ముగింపులో కొత్త శిఖరాలకు చేరాయి. అమెరికా–చైనాల మధ్య వాణిజ్య ఒప్పందం తుది దశలో ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ వెల్లడించడంతో ప్రపంచ మార్కెట్లు లాభపడటం సానుకూల ప్రభావం చూపించింది. విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు కొనసాగుతుండటం, నవంబర్ సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు మరో రోజులో ముగియనుండటంతో షార్ట్ కవరింగ్ కొనుగోళ్లు జరగడం, డాలర్‌తో రూపాయి మారకం విలువ పుంజుకోవడం కలసివచ్చాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 199 పాయింట్లు పెరిగి 41,021 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 63 పాయింట్లు ఎగసి 12,101 పాయింట్ల వద్ద ముగిశాయి. ఈ రెండు సూచీలకు ఇవి జీవిత కాల గరిష్ట స్థాయి ముగింపులు. వీటితో పాటు బ్యాంక్ నిఫ్టీ కూడా 31,876 పాయింట్ల వద్ద జీవిత కాల గరిష్ట స్థాయిలో ముగిసింది. బ్యాంక్, ఆయిల్, గ్యాస్, వాహన, ప్రభుత్వ రంగ షేర్లు లాభపడ్డాయి. రియల్టీ, టెలికం, క్యాపిటల్ గూడ్స్ షేర్లు లాభాల స్వీకరణ కారణంగా నష్టపోయాయి. వాహన షేర్లకు ‘స్క్రాప్ పాలసీ’ లాభాలు ఆర్బీఐ కీలక రేట్లను తగ్గించగలదన్న అంచనాలతో బ్యాంక్ షేర్లు పెరిగాయి. వాహన తుక్కు విధానాన్ని (స్క్రాపేజ్ పాలసీ) ప్రభుత్వం తీసుకు రానున్నదన్న వార్తల కారణంగా వాహన, వాహన విడిభాగాల షేర్లు పెరిగాయి. టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, భారత్ ఫోర్జ్, అశోక్ లేలాండ్, మారుతీ సుజుకీ, ఐషర్ మోటార్స్, హీరో మోటొకార్ప్, టీవీఎస్ మోటార్ కంపెనీ, బజాజ్ ఆటోలు 1–3 శాతం రేంజ్లో పెరిగాయి. లాభాల్లో ఆరంభమైన సెన్సెక్స్, నిఫ్టీలు రోజంతా ఇదే జోరు చూపించాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 254 పాయింట్ల లాభంతో 41,076 పాయింట్లకు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 77 పాయింట్లు ఎగసి 12,115 పాయింట్లకు చేరాయి. షాంఘై సూచీ మినహా మిగిలిన అన్ని ఆసియా మార్కెట్లు లాభపడ్డాయి. యూరప్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్, నిఫ్టీలు ఆల్‌టైమ్ హైల వద్ద ముగిసినప్పటికీ, వందకు పైగా షేర్లు ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. అలహాబాద్ బ్యాంక్, చెన్నై పెట్రో, జైన్ ఇరిగేషన్, ఎంఫసిస్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. పలు షేర్లు ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట స్థాయిలకు చేరాయి. దివీస్ ల్యాబ్స్, బజాజ్ ఫిన్సర్వ్, అదానీ గ్రీన్, పీఐ ఇండస్ట్రీస్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ► యస్ బ్యాంక్ 8 శాతం లాభంతో రూ. 68 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్ ఇదే. నిధుల సమీకరణ నిమిత్తం ఈ నెల 29న బోర్డ్ సమావేశం జరగనున్నదన్న వార్తలు దీనికి కారణం. ► ఎస్బీఐకు చెందిన క్రెడిట్ కార్డ్‌ల విభాగం, ఎస్బీఐ కార్డ్స్ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) పత్రాలను మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీకి సమర్పించిన నేపథ్యంలో ఎస్బీఐ షేర్ 2.4 శాతం లాభంతో రూ.344 వద్ద ముగిసింది.ఈ బ్యాంక్ మార్కెట్ క్యాప్ మళ్లీ రూ.3 లక్షల కోట్లకు ఎగబాకింది. సెన్సెక్స్‌లో అత్యధికంగా లాభపడ్డ రెండో షేర్ ఇదే. ► ఎల్ అండ్ టీ షేర్ 2 శాతం నష్టంతో రూ.1,335 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. రూ.8 పెరిగితే.. పది లక్షల కోట్లకు! రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ 0.7 శాతం లాభంతో రూ.1,570 వద్ద ముగిసింది. మార్కెట్ క్యాప్ రూ.9.96 లక్షల కోట్లకు పెరిగింది. ఈ షేర్ రూ.8 పెరిగితే కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.10 లక్షల కోట్లకు పెరుగుతుంది. భారత్‌లో అత్యధిక మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ ఇదే. -
సరికొత్త గరిష్టాలకు సెన్సెక్స్, నిఫ్టీ
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లలో వరుసగా రికార్డుల మోతమోగుతోంది. వరుసగా రెండోరోజు మంగళవారం కూడా దేశీయ సూచీలు సరికొత్త రికార్డుల వద్ద ఆరంభమయ్యాయి. సెన్సెక్స్ 34,400 దాటగా నిఫ్టీ కూడా ప్రస్తుతం ఆరంభ లాభాలనుంచి స్వల్పంగా వెనక్కి తగ్గిన మార్కెట్లు ఫ్లాట్‌గా మారాయి.ప్రస్తుతం మళ్లీ లాభాల్లోకి మళ్లి 52 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ 34404 వద్ద, నిఫ్టీ 4 పాయింట్లు పెరిగి 10627వద్ద ట్రేడ్ అవుతోంది. కోల్ ఇండియా, అశోక్ లేలాండ్, గెయిల్, జీఎస్కే కన్జ్యూమర్, రేమాండ్ , అరవింద్ మిల్స్, విప్రో, టాటా మెటార్స్ లాభపడుతున్నాయి. ఎన్ఎండీసీ, ఐషర్ మోటార్స్, హెచ్‌పీసీఎల్, ఏసీసీ, ఆర్‌కామ్,ఎస్‌బ్యాంక్, యునైటెడ్ స్పిరిట్స్ నష్టపోతున్నాయి. -
స్టాక్ మార్కెట్ చరిత్రలోనే తొలిసారి...
31,700మార్కుకు పైన సెన్సెక్స్ నిఫ్టీ సరికొత్త గరిష్టంలో 9,771 వద్ద ముగింపు ముంబై : ఎన్ఎస్ఈ మార్కెట్లో సాంకేతిక లోపాలు చోటుచేసుకుని, ట్రేడింగ్‌కు అవాంతరం ఎదురైనప్పటికీ స్టాక్ మార్కెట్లు తిరుగులేని స్థాయిలో దూసుకెళ్లాయి. సరికొత్త రికార్డు స్థాయిల్లో ముగిశాయి. సెన్సెక్స్ 355.01 పాయింట్లు జంప్ చేసి స్టాక్ మార్కెట్ చరిత్రలోనే తొలిసారి 31,700 మార్కుకు పైన, 31,715 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ సైతం 105.25 పాయింట్ల జోరుతో 9750 మార్కును అధిగమించి 9771 వద్ద క్లోజైంది. ప్రారంభం నుంచి రికార్డు స్థాయిలో మార్కెట్లు లాభాల వర్షం కురిపిస్తున్నాయి. ప్రారంభంలోనే సెన్సెక్స్ డబుల్ సెంచరీ క్రాస్ చేసింది. నిఫ్టీ కూడా అదే ఊపులో కొనసాగుతుండగా.. ఎన్ఎస్ఈ రేట్లు అప్డేట్ కాకుండా సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. 9 గంటలకు 55 నిమిషాలకు ట్రేడింగ్‌ను నిలిపివేసి, అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు మళ్లీ ఎన్ఎస్ఈ మార్కెట్లను పునఃప్రారంభించారు. మార్కెట్లు నేడు రికార్డుల వర్షం కురిపించడానికి ప్రధాన కారణం కంపెనీలు వెలువరించనున్న క్వార్టర్ ఫలితాలేనని మార్కెట్ విశ్లేషకులంటున్నారు. మెరుగైన ప్రదర్శనను కంపెనీలు కనబర్చనున్నాయనే అంచనాలు ఊపందుకోవడంతో మార్కెట్లు పైగి ఎగిసినట్టు చెప్పారు. బ్లూచిప్ కంపెనీలు ఫలితాలు జూలై 13న టీసీఎస్ ఫలితాల ప్రకటనతో ప్రారంభం కానున్నాయి. అంతేకాక టెక్నాలజీ, ఐటీ, పీఎస్‌యూ, హెల్త్‌కేర్, బ్యాంకులు లాభాల్లో కొనసాగడం మార్కెట్లను రికార్డు స్థాయిల్లో నడిపించాయి. టీసీఎస్, టాటామోటార్స్, భారతీ ఎయిర్టెల్, లుపిన్, సన్ ఫార్మాలు 2 శాతం పైగా ర్యాలీ జరుపగా.. కేవలం హెచ్డీఎఫ్సీ మాత్రమే నష్టాలను గడించింది. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ కూడా లాభపడి 64.53 వద్ద ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరలు నష్టాల పర్వం కొనసాగుతోంది. నేడు 138 రూపాయలు నష్టపోయి 27,646గా నమోదయ్యాయి.