ముంబై: వరుసగా ఆరో రోజు స్టాక్ బుల్ కదం తొక్కింది. దీంతో కేవలం 7 నెలల్లోనే దేశీ స్టాక్ మార్కెట్లు సరికొత్త చరిత్రను లిఖించాయి. ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ ప్రధాన ఇండెక్స్ నిఫ్టీ.. చరిత్రాత్మక గరిష్టాలను అందుకున్నాయి. ఈ ఏడాది జనవరి 20న సాధించిన లైఫ్ టైమ్ హైలను రెండు ఇండెక్సులూ తిరిగి ఒకే రోజు అధిగమించడం విశేషం. కోవిడ్-19 ఇచ్చిన షాక్ నుంచి కేవలం 7 నెలల్లోనే దేశీ స్టాక్ మార్కెట్లు సూపర్ ర్యాలీ చేయడం ద్వారా ఈ ఫీట్ సాధించాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో సెన్సెక్స్ ఇంట్రాడేలో 752 పాయింట్లు దూసుకెళ్లి 42,645ను తాకింది. నిఫ్టీ సైతం 210 పాయింట్లు ఎగసి 12,474కు చేరింది. వెరసి సరికొత్త రికార్డులను సాధించాయి. ఇంతక్రితం ఈ ఏడాది జనవరి 20న సెన్సెక్స్ 42,274 పాయింట్ల వద్ద, నిఫ్టీ 12,430 వద్ద ఇంట్రాడేలో రికార్డ్ గరిష్టాలను నమోదు చేసిన విషయం విదితమే. కాగా.. ట్రేడింగ్ ముగిసేసరికి నిఫ్టీ 198 పాయింట్ల లాభంతో 12,461 వద్ద నిలిచింది. సెన్సెక్స్ 704 పాయింట్లు జంప్ చేసి 42,597 వద్ద స్థిరపడింది. వెరసి ముగింపులోనూ లైఫ్ టైమ్ ‘హై’లను సాధించాయి.
కారణాలేవిటంటే?
డెమక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ అమెరికా 46వ ప్రెసిడెంట్ కానుండటం, కేంద్ర బ్యాంకులు ఫెడరల్ రిజర్వ్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ సహాయక ప్యాకేజీలకు మద్దతిస్తుండటం వంటి అంశాలు ప్రధానంగా సెంటిమెంటుకు బలాన్నిచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. బైడెన్- ప్రధాని మోడీ మధ్య మంచి అవగాహన, వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ భారత సంతతికి చెందిన వ్యక్తి కావడం వంటి అంశాలు సైతం ఇన్వెస్టర్లకు హుషారునిచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఇటీవల ఎఫ్ఐఐలు దేశీ స్టాక్స్ లో భారీగా ఇన్వెస్ట్ చేస్తుండటం సైతం ఇందుకు దోహదం చేస్తున్నట్లు తెలియజేశారు. ఈ నెల తొలి ఐదు రోజుల్లోనే ఎఫ్ఐఐలు నగదు విభాగంలో నికరంగా రూ. 8,381 కోట్లను ఇన్వెస్ట్ చేయడం గమనార్హం.
అన్ని రంగాలూ
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ 0.5-2.7 శాతం మధ్య బలపడ్డాయి. మీడియా యథాతథంగా ముగిసింది. నిఫ్టీ దిగ్గజాలలో దివీస్, ఎయిర్టెల్, ఇండస్ఇండ్, ఐసీఐసీఐ, యాక్సిస్, హిందాల్కో, బీపీసీఎల్, టెక్ మహీంద్రా, శ్రీసిమెంట్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐషర్, టైటన్, బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్ 5.5-2 శాతం మధ్య ఎగశాయి. బ్లూచిప్స్ లో కేవలం సిప్లా, అదానీ పోర్ట్స్, మారుతీ, ఐటీసీ, గ్రాసిమ్, డాక్టర్ రెడ్డీస్, 3-0.3 శాతం మధ్య బలహీనపడ్డాయి.
వోల్టాస్ జూమ్
డెరివేటివ్స్‌లో వోల్టాస్, ఎస్కార్ట్స్, మదర్ సన్, కోఫోర్జ్, ఇండిగో, వేదాంతా, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, ఎంఅండ్ఎం ఫైనాన్స్, భారత్ ఫోర్జ్ 6.5-3.5 శాతం మధ్య జంప్ చేశాయి. కాగా.. గ్లెన్ మార్క్ 6 శాతం పతనమైంది. ఇతర కౌంటర్లలో టొరంట్ పవర్, మణప్పురం, శ్రీరాం ట్రాన్స్, జిందాల్ స్టీల్, బాష్, అశోక్ లేలాండ్, సెయిల్, జీ 2-0.7 శాతం మధ్య నీరసించాయి. బీఎస్‌ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1-0.6 శాతం చొప్పున బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1,506 లాభపడగా.. 1,185 నష్టపోయాయి.
ఎఫ్‌పీఐల కొనుగోళ్లు
నగదు విభాగంలో వారాంతాన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 4,870 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు. అయితే దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 2,939 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. గురువారం ఎఫ్‌పీఐలు రూ. 5,368 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 2,208 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment